పెంబి, మార్చి 12 : మండల కేంద్రంలోని భీమన్న చెరువుకు సరస్వతీ ఉప కాల్వ డీ-28 ద్వారా సాగు నీరు సరఫరా కావడం లేదు. దీంతో దీని ఆయకట్టు కింద దాదాపు 60 మంది రైతులకు చెందిన 120 ఎకరాలు బీడుగా మారాయి. డీ-28 కాల్వ మరమ్మతులు చేపట్టకపోవడంతో భీమన్న చెరువు వరకు నీరు రావడం లేదు. వర్షకాలంలో చెరువు నిండడంతో ఒక్క పంట మాత్రమే పండిస్తున్నామని, డీ-28 కాల్వకు మరమ్మతులు చేపట్టి యాసంగికి కూడా సాగు నీరు అందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు విన్నవించిన పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.
భూములు బీడుగా ఉండడంతో కూలీ పనులకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి డీ-28 కాల్వకు మరమ్మతులు చేపట్టి భీమన్న చెరువుకు సాగు నీరు అందించాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై నీటి పారుదల శాఖ ఏఈ నవీన్‌ను వివరణ కోరగా.. మరమ్మతు కోసం నిధులు మంజురైనప్పటికీ అటవీ శాఖ అధికారులు అనుమతులు ఇవ్వడం లేదని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సాగు నీరు అందించడానికి కృషి చేస్తా.
నీరు రాక.. కూలీకి పోతున్న..
నాకు భీమన్న చెరువు ఆయకట్టు కింద ఒక ఎకరం వ్యవసాయ భూమి ఉంది. డీ-28 కాల్వ మరమ్మతుకు గురికావడంతో చెరువుకు సాగు నీరు రావడం లేదు. దీంతో యేటా యాసంగి సీజన్‌కు భూములు బీడుగా ఉంటున్నాయి. కాల్వకు మరమ్మతులు చేపట్టాలని ఆయకట్టు రైతులందరం కలిసి కలెక్టర్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు విన్నవించుకున్నాం. ఎవరు పట్టించుకోవడం లేదు. యాసంగి సాగు లేక కూలీ పనులకు వెళ్లాల్సి వస్తుంది. అధికారులు, నాయకులు డీ-28 కాల్వకు మరమ్మతులు చేపట్టి సాగునీరు అందించేలా కృషి చేయండి.
– చింతకింది రాజేందర్, రైతు, పెంబి.