మంచిర్యాల, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నస్పూర్ మున్సిపాలిటీలోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీలో అక్రమాల లెక్కలు తేలడం లేదు. ఈ విషయమై ఫిర్యాదులు వెల్లువెత్తగా, అనేకసార్లు సర్వేలు చేసిన అధికారులు ఇప్పటికీ స్పష్టతకు రాకపోవడమేమిటన్నది అంతుబట్టడం లేదు. టీఎన్జీవోలు, ప్రజాసంఘాల నాయకులు వినతుల మేరకు గత కలెక్టర్లు, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్(సీసీఎల్ఏ), రాష్ట్ర ఎన్నికల కమిషనర్..
ఇలా ఎందరో ఉన్నతాధికారులు ఈ భూములపై సర్వేలు చేయించారు. సర్వేలు చేసిన ప్రతిసారి ఆ రిపోర్టులు సీసీఎల్ఏకు, కలెక్టర్లకు అందజేశారు. ఇప్పుడున్న కలెక్టర్ సైతం వచ్చీరాగానే కలెక్టరేట్ సమీపంలోని సర్వే నంబర్ 42తో పాటు టీఎన్జీవో భూములపై సర్వే చేయించారు. ఆ రిపోర్టు సైతం సార్‌కు అందింది. ఇవన్నీ జరిగాక..
ఇటీవల రిటైర్డ్ టీఎన్జీవోలు ఈ ప్లాట్ల కేటాయింపుల్లో తమకు అన్యాయం జరిగిందంటూ సీసీఎల్ఏకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీఎల్ఏ మరోసారి టీఎన్జీవో భూములపై ఎంక్వైరీకి ఆదేశించింది. కలెక్టర్ ఆ బాధ్యతలను డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ ఆఫీసర్(డీసీవో) సంజీవరెడ్డికి అప్పగించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నది. ఇలా ఇప్పటికే ఎన్నోసార్లు సర్వేలు జరిగినా టీఎన్జీవో హోసింగ్ సొసైటీలోని అక్రమాల లెక్కలు మాత్రం బయటికి రాలేదు. సీసీఎల్ఏకు ఇచ్చిన సర్వే రిపోర్టులు, గత కలెక్టర్లు, ప్రస్తుత కలెక్టర్‌కు ఇచ్చిన సర్వే రిపోర్ట్లన్నీ బుట్టదాఖలయ్యాయి.
ఇప్పటి వరకు చేసిన సర్వేలు ఇలా…
టీఎన్జీవో భూములపై ఓ సామాజిక కార్యకర్త 1-11-2023న రెవెన్యూ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి ఆ ఫిర్యాదు అదే నెల 7న సీసీఎల్ఏకు వచ్చింది. దాన్ని సీసీఎల్ఏ కలెక్టర్‌కు 17న పంపించింది. దీనిపై సర్వే చేయాలంటూ కలెక్టర్ ఆర్డీవోను ఆదేశించగా, ఆయన జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ఆరుగురు సర్వేయర్లతో సర్వే చేయించారు. పూర్తి నివేదికను సర్వేయర్లు ఆర్డీవోకు అప్పగించారు. టీఎన్జీవోల 119 హౌస్‌సైట్స్, వాటి ప్రస్తుత స్టేటస్, లే-అవుట్ స్కెచ్ మ్యాప్ మొత్తం రిపోర్టు కలెక్టర్‌కు అందజేశారు.
రెండోసారి అదే సామాజిక కార్యకర్త వారం వ్యవధిలోనే మంచిర్యాల జిల్లాలోని కొందరు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సర్వే నంబర్ 42లో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నవంబర్ 6, 2023లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి సీసీఎల్ఏ ద్వారా కలెక్టర్‌కు ఎంక్వైరీ చేయమని మరోసారి ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు ఆర్డీవో స్థాయిలో సర్వే చేసిన రిపోర్ట్‌ను మరోసారి సీసీఎల్ఏకు పంపించారు.
మూడోసారి ప్రస్తుత కలెక్టర్ కుమార్ దీపక్ 27-6,2024న సర్వే నంబర్ 42లోని 102.10 ఎకరాలపై సర్వే చేయాలంటూ కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంచిర్యాల డివిజన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫర్ సర్వే జీ.గంగాధర్ సమక్షంలో ఐదురుగరు తహసీల్దార్లు, నస్పూర్ మున్సిపాలిటీ టౌన్‌ప్లానింగ్ అధికారితో సర్వే చేయించారు. ఈ రిపోర్టు కూడా కలెక్టర్‌కు చేరింది. సర్వే నంబర్42కు సంబంధించిన సమస్త సమాచారంతో ఈ సర్వే రిపోర్టు కలెక్టర్‌కు చేరింది.
ఇన్నిసార్లు రిపోర్టులు కలెక్టర్లకు.. అక్కడి నుంచి సీసీఎల్ఏకు సర్వే నంబర్ 42, టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ భూములపై నివేదిక వెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా రిటైర్డ్ టీఎన్జీవోలు కొందరు ప్లాట్ల కేటాయింపుల్లో తమకు నష్టం చేశారంటూ సీసీఎల్ఏకు ఫిర్యాదు చేయడంతో మారోసారి కలెక్టర్‌ను విచారణకు ఆదేశించింది. ఆ బాధ్యతను కలెక్టర్ డీసీవోకు అప్పగించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నది.
ఎన్ని సార్లు సర్వే చేస్తారు
-నయీం పాషా, సామాజిక కార్యకర్త
సర్వే నంబర్ 42, టీఎన్జీవో హౌసింగ్ సొసైటీపై ఇప్పటికే ఎన్నోసార్లు సర్వేలు చేశారు. సీసీఎల్ఏ, కలెక్టర్లకు ఆ రిపోర్టులు అందజేశారు. అయినా మళ్లోసారి విచారణ అంటూ కాలయాపన చేస్తున్నారు. అంటే గతంలో సర్వే చేసి, అందజేసిన రిపోర్టులకు విలువ లేదా.. లేకపోతే గత అధికారులు సరిగా సర్వే చేయలేదా. ఇప్పుడు డీసీవో ఆధ్వర్యంలో చేస్తున్న విచారణలోనైనా నిజానిజాలన్నీ బయటపెట్టాలి. నష్టపోతున్న టీఎన్జీవోలకు న్యాయం చేయడంతో పాటు సర్వే నంబర్ 42లోని ప్రభుత్వ భూములను సంరక్షించాలి.
ఇన్ని రిపోర్టులు వచ్చినా క్లారిటీ లేదు..
ఇలా ఇప్పటీకే మూడుసార్లు సర్వేలు చేసి రిపోర్టులు ఇచ్చినా సర్వే నంబర్ 42, అందులోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అక్రమాలపై అధికారులకు క్లారిటీ ఎందుకు రావడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. సర్వేయర్లు, తహసీల్దార్లు సర్వేలు చేసి ఇచ్చాక కూడా అక్రమార్కులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనేది ప్రశ్నార్థకంగా మారింది. గత కలెక్టర్లతో పాటు ప్రస్తుత కలెక్టర్‌కు ఇచ్చిన సర్వే నివేదికలు బుట్టదాఖలైనట్లేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అసలు టీఎన్జీవోలకు ల్యాండ్ అలొకేషన్ చేశాక.. అందుకు సంబంధించి వాళ్లు గవర్నమెంట్‌కు డబ్బులు చెల్లించకుండానే ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకరికి కేటాయించిన ప్లాట్‌లో మరొకరు ఇప్పుడు ఇల్లు కడుతున్నారు. ఇదే విషయమై రిటైర్డ్ టీఎన్జీవోలు సీసీఎల్‌కే ఫిర్యాదు చేశారు. ఇప్పుడు విచారణ జరుగుతుండగానే హడావుడిగా ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయిస్తున్నారు.
గత కలెక్టర్ల హయాంలో ఇలా విచారణ జరిగిన సమయాల్లో నిర్మాణ పనులు చేయొద్దని ఆదేశాలిచ్చారు. ఇప్పుడు విచారణ జరుగుతుంటే మరోవైపు వేగంగా నిర్మాణాలు చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. టీఎన్జీవోల్లో నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయకుండానే అక్రమ నిర్మాణాలకు పరోక్షంగా జిల్లా అధికారులు సహకరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డీసీవో విచారణ పూర్తయ్యే వరకు ఇండ్ల నిర్మాణాలు నిలిపివేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.