నిర్మల్, జూన్ 27(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం గత యాసంగి రైతు భరోసాను పూర్తి స్థాయిలో ఇవ్వకుండానే ఆదరాబాదరాగా ప్రస్తుత వానకాలం సీజన్ కోసం ఈ నెల 30న నిధులను విడుదల చేస్తామని గొప్పలు చెప్పడం గందరగోళానికి తావిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు నాలుగు సీజన్లలో.. రెండు సీజన్ల రైతు భరోసా డబ్బులను పూర్తిగా ఎగ్గొట్టిందని, గత యాసంగి సీజన్లో కేవలం రెండెకరాల లోపు రైతులకే భరోసా సాయాన్ని అందించిందని రైతులు వాపోతున్నారు. పాత బకాయిలను చెల్లించకుండా, రైతుల దృష్టిని మళ్లించేందుకే ఈసారి ప్రతీ రైతుకు పూర్తి స్థాయిలో భరోసా సాయాన్ని అందిస్తామంటూ ప్రభుత్వ పెద్దలు ప్రకటనలు గుప్పిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఈసారి రైతు భరోసా అర్హుల జాబితా రూపకల్పనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలకు ముందు ప్రతి రైతుకు రైతు భరోసా సాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత సాగు చేసిన భూములకే పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పింది. కానీ.. క్షేత్రస్థాయిలో సాగు భూముల సర్వేను పక్కాగా లెక్కించకుండానే సంబంధిత అధికారులు ఇష్టారీతిన జాబితా రూపొందించినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రస్తుతం.. చాలా మంది రైతులకు సంబంధించిన భూముల వివరాలు జాబితాలో అందుబాటులో లేకపోవడం, అలాగే మరికొంత మందికి రైతు భరోసా నిధులు జమ కాకపోతుండడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశం మేరకు స్థానిక అధికారులు ఇప్పటికే సాగులో ఉన్న భూములకు సంబంధించి అందుబాటులో ఉన్న అరకొర సమాచారాన్ని చేరవేసి చేతులు దులుపుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవలే భూములను కొనుగోలు చేసిన రైతుల వివరాలతోపాటు, కొత్తగా సాగులోకి వచ్చిన భూముల వివరాలపై పూర్తి స్థాయిలో సర్వే చేయకుండానే జాబితాను విడుదల చేయడంతో చాలామంది అర్హులైన రైతులకు ఈసారి రైతు భరోసా అందే అవకాశం లేకుండా పోయింది.
ప్రభుత్వం సైతం క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని పరిగణలోకి తీసుకోకుండా అధికారులందించిన ప్రాథమిక వివరాల ఆధారంగానే రైతు భరోసాను అందించి భారీ ఎత్తున ప్రచారం చేసుకుంటుండడం విమర్శలకు తావిస్తున్నది. కాగా.. ఈసారి ఎలాంటి పంటల నమోదు సర్వే ప్రక్రియ పూర్తి కాకుండానే అధికారులు తమకున్న సమాచారం మేరకే జాబితాను రూపొందించి ఉన్నతాధికారులకు నివేదించినట్లు చెబుతున్నారు. దీంతో జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేవో అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
రైతు భరోసాకు అర్హులైన వారికి సంబంధించిన జాబితా వివరాలను అధికారులు బహిరంగంగా వెళ్లడించకపోతుండడంపై రైతులు మండిపడుతున్నారు. రైతు భరోసా డబ్బులు పొందిన వారికి నేరుగా వారి సెల్‌ఫోన్‌కే మెసేజ్ వస్తున్న కారణంగా, మిగతా వారికి దీనికి సంబంధించిన సమాచారం తెలియడం లేదు. దీంతో ఇటు జాబితా రూపకల్పన విషయంలోనూ, అటు అర్హుల ఎంపిక, నిధుల పంపిణీ విషయంలో జిల్లా వ్యాప్తంగా గందరగోళ పరిస్థితి నెలకొన్నది.
గత యాసంగిలో 100 కోట్లు బకాయి
గత యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం జిల్లా రైతులకు దాదాపు రూ.100 కోట్లు బకాయి ఉన్నది. జిల్లాలో మొత్తం 1,91,288 మంది రైతులు రైతుభరోసా పథకానికి అర్హులైన వారు ఉన్నారు. వీరికి యాసంగి సీజన్‌కు రూ.266 కోట్ల డబ్బులను వారి ఖాతాల్లో జమ చేయాలి. అయితే యాసంగి సీజన్ చివరి నాటికి కేవలం 2 ఎకరాల లోపు ఉన్న రైతులకు రూ.168 కోట్లు మాత్రమే జమ చేశారు. రెండెకరాలకు పైబడి ఉన్న రైతులకు రైతు భరోసా కింద దాదాపు రూ.100 కోట్లు జమ కావాలి. ఈ బకాయిలను చెల్లించకుండానే ప్రస్తుతం వానకాలం సీజన్‌కు సంబంధించి పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది.
అంతకుముందు రెండు సీజన్ల డబ్బులను ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈసారి అయినా అందరికీ సాయాన్ని అందిస్తుందో లేదో అన్న అనుమానాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం సీజన్‌కు ముందే ఠంచన్‌గా పెట్టుబడి సాయాన్ని అందించేదని, ఇంతలా ప్రచారం చేస్తూ సాగదీసేది కాదని రైతులు గత ప్రభుత్వ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు.
అరకొర సాయంపై అన్నదాతల ఆగ్రహం
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ప్రతి వానకాలం, యాసంగి సీజన్లలో దాదాపు 4.25 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలను సాగు చేస్తుంటారు. గత బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు కింద ఎలాంటి ఆంక్షలు లేకుండా సకాలంలో ప్రతి రైతు ఖాతాలో పెట్టుబడి సాయం జమయ్యేది. దీంతో రైతులకు పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకం పేరు మార్చిందే తప్ప రైతులకు మేలు చేకూర్చింది ఏమీ లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మళ్లీ అన్నదాతలు అప్పులు చేయాల్సిన దుస్థితి తలెత్తుతున్నది.
గత యాసంగి సీజన్‌కు సంబంధించి డిసెంబర్, జనవరి మాసాల్లోనే రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాల్సి ఉండగా, కాలయాపన చేస్తూ మార్చి, ఏప్రిల్ నెలల్లో అరకొరగా నిధులు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. అది కూడా కేవలం రెండెకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఇచ్చి, మిగతా రైతులకు చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా మోసం చేసింది. దీంతో జిల్లా రైతాంగా కాంగ్రెస్ సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. యాసంగి భరోసానే పూర్తి స్థాయిలో అందకపోవడంతో ఈ వానకాలం సీజన్లోనైనా పెట్టుబడి సాయం వస్తుందో.. రాదో నన్న సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.