వరంగల్, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ) : వరంగల్ జిల్లాలోని పలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)లో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. రైతు రుణమాఫీని అమల్లోకి రావడంతో పలువురు కార్యదర్శులు, సిబ్బంది అవినీతి వెలుగులోకి వస్తున్నది. ఇప్పటికే వివిధ ఆరోపణలతో జిల్లాలోని నాలుగు సంఘాల్లో సస్పెన్షన్ల పర్వం కొనసాగింది. నల్లబెల్లి, సంగెం, దుగ్గొండి, గీసుగొండ మండలం చింతలపల్లి, మందపల్లి, వంచనగిరి పీఏసీఎస్‌ల కార్యదర్శులు నలుగురు, నల్లబెల్లి పీఏసీఎస్ డీటీపీ ఆపరేటర్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా సహకార అధికారి (డీసీవో) బి సంజీవరెడ్డి వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు అక్రమాలపై విచారణకు ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన 2023 డిసెంబర్ 9లోపు రైతులు రుణం పొందినప్పటికీ ఆయా పీఏసీఎస్ అధికారులు, సిబ్బంది తప్పిదం, అక్రమాల వల్ల అనేక మంది రుణమాఫీని కోల్పోతున్నారు. దీంతో వారు సంఘాలకు చేరుకొని రికార్డులు పరిశీలిస్తుండడంతో అధికారులు, సిబ్బంది నిర్వాకం బయటపడుతున్నది.
ప్రధానంగా నల్లబెల్లి పీఏసీఎస్‌పై అధికార యంత్రాంగం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు కనపడుతున్నది. ఈ పీఏసీఎస్ కార్యదర్శి, డీటీపీ ఆపరేటర్‌పై ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేసిన అధికారులు తాజాగా చైర్మన్ సీహెచ్ మురళీధర్, కార్యదర్శి ఎన్ మొగిలి, డీటీపీ ఆపరేటర్ వైనాల రాజుపై నల్లబెల్లి పోలీసు స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనేక రకాల ఫిర్యాదులు వస్తుండటంతో సహకార శాఖలోని ఆడిట్ అధికారి వాల్యనాయక్, నర్సంపేట ఏరియా ఆడిట్ అధికారి శ్రీనివాస్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కీర్నాయక్ విచారణ ప్రారంభించారు. ఈ పీఏసీఎస్‌లోని సుమారు 2,500 రుణ దరఖాస్తులను పరిశీలించి మూడు రోజుల్లో నివేదిక అందజేయాలని డీసీవో సంజీవరెడ్డి విచారణ అధికారులను ఆదేశించారు. మూడు రోజుల్లో విచారణ జరిపి నివేదిక అందజేయాలని అధికారులకు గడువు విధించారు.
ఆరోపణలొచ్చిన పీఏసీఎస్‌ల్లోని అధికారులు, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నం. తప్పు ఎవరు చేసినా చట్టపరంగా చర్యలు తప్పవు. జిల్లాలో ప్రస్తుతం నాలుగు పీఏసీఎస్‌ల్లో వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించాం. నల్లబెల్లి పీఏసీఎస్‌లో మూడు రోజుల్లో విచారణ జరిపి నివేదిక అందజేయాలని గడువు నిర్దేశించాం. అర్హులైన రైతులకు రుణమాఫీ వర్తిస్తుంది. పీఏసీఎస్‌ల్లో తప్పులు జరిగితే రైతులకు న్యాయం చేస్తాం.