నేరడిగొండ, నవంబర్ 5 : ఇతర రాష్ర్టాలకు అక్రమంగా పశువులు తరలిస్తున్న అంతర్రాష్ట్ర పశువుల అక్రమ రవాణా రాకెట్‌ను పోలీసులు భగ్నం చేశారు. ఈ ముఠా ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామాల నుంచి పశువులను సేకరించి కేరళలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తేలిందని నేరడిగొండ ఎస్ఐ ఇమ్రాన్ తెలిపారు. ఆయన వివరాలు ప్రకారం.. మహారాష్ట్రలోని గాడ్చందూర్కు చెందిన ఇమ్రాన్ బాబు షేక్, ఇచ్చోడకు చెందిన మహమ్మద్ జాకీర్ ఒక వ్యవస్థీకృత నేర రవాణా రాకెట్లో పాలుపంచుకున్నట్లు తెలిపారు.
వీరు జిల్లాలోని పలు గ్రామాల్లో పశువులను దొంగలించి మహమ్మద్ ఇమ్రాన్‌కు చెందిన వాహనంలో అనంతపూర్ మీదుగా కేరళలోని కొచ్చిలో మహేంద్ర త్రిమూర్తి వద్దకు తరలిస్తారని వెల్లడించారు. వీరికి సఫాన్ హనీఫ్ సేత్, అస్లాం, మహబూబ్ అలీ ఖురేషి సహాయం చేశారన్నారు. ఇదే క్రమంలో ఈ నెల 3వ తేదీన మహ్మద్ జాకీర్, షేక్ ఇమ్రాన్ ఇచ్చోడ మార్కెట్లో 16 ఎడ్లను కొనుగోలు చేసి, మరో మూడు ఎడ్లను దొంగిలించారన్నారు.
మహ్మద్ ఇమ్రాన్ వాహనంలో కొచ్చికి తరలిస్తుండగా, ముందస్తు సమాచారం మేరకు రోల్మామడ టోల్‌ప్లాజా వద్ద వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి ఇందులో భాగస్వాములైన 10 మందిలో ఎనిమిది మందిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. మిగతా ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఎస్ఐ వెల్లడించారు.