పట్టించుకోవాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుంటే.. రహదారులపై గుంతలు ప్రాణాలు మింగుతుంటే.. ఆగ్రహిస్తున్న జనం రోడ్డెక్కు తున్నారు. చేవెళ్ల బస్సు ప్రమాదంతో ఆలోచనలో పడిన ప్రజలు.. సర్కారుపై సమరశంఖం పూరిస్తున్నారు. వివిధ రూపాల్లో నిరసన తెలిపేందుకు స్వచ్ఛంద సంస్థలు, పౌరవేదికలు కార్యాచరణకు దిగుతున్నాయి. బుధవారం రంగారెడ్డి జిల్లా పెద్దేముల్లో గుంతలు పూడ్చాలంటూ పలు గ్రామాల ప్రజలు రాస్తారోకో చేపట్టారు.
వికారాబాద్/మొయినాబాద్, నవంబర్ 5, (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెండేండ్లుగా చాలా మార్గాల్లో వరుసగా జరుగుతున్న భారీ ప్రమాదాలు.. పెద్దఎత్తున చనిపోతున్న ప్రజలు.. నిత్యకృత్యమయ్యాయి. ముఖ్యంగా వికారాబాద్ జిల్లా చేవెళ్ల-మీర్జాగూడ హైవేపై చేవెళ్ల ప్రాంతంలో రోడ్డు దుస్థితి చాలా అధ్వానంగా మారింది. తాండూరు నుంచి సంగారెడ్డి, జహీరాబాద్, బంటారం, మోమిన్‌పేట వెళ్లే మార్గాల్లో రోడ్లు దారుణంగా తయారయ్యాయి. ఘాజీపూర్ బ్రిడ్జిపై రోడ్డు మొత్తం ప్రమాదకరంగా మారింది. ఆ బ్రిడ్జిని సురక్షితంగా దాటితే ప్రజలు ‘హమ్మయ్యా.. బతికి బయటపడ్డాం’ అని అనుకోవడం.. అక్కడి ప్రజలకు నిత్యకృత్యమే. అయినా కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్కారు మెడలు వంచి తీరాలనే సంకల్పంతో స్థానికులు పోరాటబాట పట్టారు. మంగళవారం తాండూరులో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. రహదారుల భద్రత ఉద్యమ వేదిక సభ్యులు మొయినాబాద్‌లో పెద్దఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు.
కాంగ్రెస్ సర్కారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రోడ్లను బాగుచేయకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కంటి తుడుపు చర్యలతో సరిపెట్టకుండా… సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ఇంకెంత మంది చనిపోతే కాంగ్రెస్ నాయకుల్లో చలనం వస్తుందని ప్రశ్నించారు. బుధవారం తాండూరు-సంగారెడ్డి రోడ్డును బాగుచేయాలంటూ పెద్దేముల్ మండల పరిధిలోని పలు గ్రామాల యువకులు ధర్నా చేపట్టారు. బుద్దారం వాగు సమీపంలో బుద్దారం, ఘాజీపూర్, పెద్దేముల్ గ్రామాల ధర్నాకు దిగారు. ‘ఖబడ్దార్ కాంగ్రెస్ నాయకుల్లారా.. పాలన చేతకాకపోతే దిగిపొండి.. మా ప్రాణాలు తీయకండి’ అని ఈ నినాదాలు చేశారు. తాండూరు డెవలప్మెంట్ ఫోరం పట్టణ బంద్‌కు పిలుపునిచ్చింది. వరుస ఆందోళనలతో ఎట్టకేలకు ఎన్హెచ్ఏఐ అధికారులు గుంతలను పూడ్చేందుకు రంగంలోకి దిగారు. లక్ష్మీనారాయణపూర్ చౌరస్తా-యాలాల వెళ్లే రహదారిపై గుంతలను మట్టితో నింపారు. ఇప్పుడు ఆగమేఘాలపై స్పందించిన అధికారులకు ఇన్ని రోజులు కండ్లు మూసుకుపోయాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇవన్నీ ప్రభుత్వ హత్యలే
దెబ్బతిన్న రోడ్లపై జరుగుతున్న ప్రమాదాల్లో మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే. చేవెళ్ల ప్రాంతంలో జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలతో రక్తం ఏరులై పారుతున్నది. రోడ్ల దుస్థితితోనే ప్రజలు మృత్యువాత పడుతున్నారు. ప్రమాదాలకు సీఎం రేవంత్‌రెడ్డి, రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యనే బాధ్యత వహించాలి. మానవత్వంతో స్పందించి, సానుభూతి ప్రకటించాల్సిన ప్రజాప్రతినిధులు ఎవరికి వారు ఇష్టారీతిన ప్రకటనలు చేయడం దారుణం. రోడ్ల మరమ్మతులు త్వరగా పూర్తి చేయకపోతే స్థానిక ఎంపీ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. రోడ్డు పనులు ప్రారంభించకపోతే ప్రజాప్రతినిదులను గ్రామాల్లో పర్యటించకుండా అడ్డుకుంటాం.
-కోంపల్లి అనంతరెడ్డి, శాపూరం శ్రీకాంత్, రహదారుల భద్రత ఉద్యమ వేదిక సభ్యులు