హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): మొదటి నుంచీ ముస్లింల పాలిట శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ ముస్లిం నేత అబ్దుల్ ముఖీబ్ చాందా మండిపడ్డారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముస్లిం నేతలు అజమ్అలీ, మసిఉల్లాఖాన్తో కలిసి ఆయన మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్‌పై ముస్లింలు ఆగ్రహంగా ఉన్నారని ఇంటెలిజెన్స్ రిపోర్టు సీఎం రేవంత్‌కు అందిందని, ఈ నేపథ్యంలో ముస్లింల ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఆర్ఎస్ఎస్ స్కూల్లో చదువుకున్న రేవంత్‌కు ముస్లింలపై ప్రేముందంటే నమ్మే ప్రసక్తే లేదని చెప్పారు. బోరబండలో కబరస్థాన్ ఏర్పాటుపై హామీ ఇచ్చి ఏడాది దాటినా, పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీతో దోస్తీ చేస్తూ ముస్లింలతో కుస్తీ పడుతున్నాడని ఆయన ధ్వజమెత్తారు. హైడ్రా పేరిట ఎందరో ముస్లింల ఇండ్లను కూల్చివేశాడని ఆరోపించారు.
బీఆర్‌ఎస్‌నేత మసిఉల్లాఖాన్ మాట్లాడుతూ కాంగ్రెస్ లేనిదే ముస్లింలు లేరని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇస్లాం 1400 ఏండ్ల క్రితమే పుట్టిందని, కాంగ్రెస్ పుట్టి 140 ఏండ్లు మాత్రమే అయ్యిందని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే ముస్లింలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉంటూ ఆర్ఎస్ఎస్ కోసం పని చేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్లో ఉన్న ముస్లింలను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తుంటే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ అభ్యర్థికి మద్ధతుగా ప్రచారంలో పాల్గొంటున్నారని మండిపడ్డారు. మరో నేత అజమ్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ముస్లింలంతా అభద్రతాభావంలో ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ముస్లింలను టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతున్నారుని మండిపడ్డారు. బీజేపీ మాజీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేసినా, కాంగ్రెస్ ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తున్న వారిపై కేసులు పెడుతున్నారు మండిపడ్డారు.