మంచిర్యాలటౌన్, మార్చి 4: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22 వరకు జరగనుండడంతో ఇందుకు తగిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. కేంద్రాలను సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 23 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ సారి 5 నిమిషాల గ్రేస్ పీరియడ్‌ను అమలులోకి తీసుకువచ్చారు.
ఈ ఏడాది మంచిర్యాల జిల్లాలో మొత్తం 12540 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలను రాస్తుండగా మొదటి సంవత్సరంలో ఇంటర్ విద్యార్థులు 4965, వొకేషనల్ 935 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ద్వితీయ సంవత్సరంలో 5625 మంది ఇంటర్ విద్యార్థులు, 1015 మంది వొకేషనల్ విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. అవకతవకలు జరుగకుండా జిల్లా స్థాయిలో హైపవర్ కమిటీలో చైర్మన్‌గా కలెక్టర్, డీసీపీ. ఆర్జేడీలు సభ్యులుగా ఉంటారు. జిల్లా ఎగ్జామినేషన్ కమిటీ కన్వీనర్‌గా డీఐఈవో, ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లతో కమిటీ ఉంటుంది, 23మంది సీఎస్‌లు, 23 మంది డిపార్ట్మెంట్ అధికారులు, నలుగురు కస్టోడియన్లు, రెండు సిట్టింగ్ స్కాడ్ బృందాలు, ఫ్లైయింగ్ స్కాడ్ బృందాలు పరీక్షలను పర్యవేక్షిస్తాయని, మంచిర్యాల డీఐఈవో అంజయ్య తెలిపారు.
ఆసిఫాబాద్ టౌన్, మార్చి 4: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలకు 19 పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈవో కల్యాణి తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో జనరల్ 3,997 మంది, 761 మంది వొకేషనల్, ద్వితీయ సంవత్సరంలో 4,527 మంది, 769 మంది వొకేషనల్ విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్, ఇతర ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబోమని తెలిపారు. వైద్య సిబ్బందితో పాటు మందులు అందుబాటులో ఉంచినట్లు, ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు.