హాజీపూర్, మార్చి 10 : ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం వేంపల్లి గ్రామ శివారులోగల ఎస్ఆర్ఆర్ జూనియర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 23 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. అనంతరం ముల్కల్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి తరగతి గదులు, వంటశాల, రిజిష్టర్లు, హాజరుపట్టికను పరిశీలించారు.
పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులను సన్నద్ధం చేయాలని, 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని, కొత్త మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. అనంతరం పీహెచ్సీని సందర్శించి వార్డులు, పరిసరాలు శుభ్రంగా ఉంచాలని, వేసవిని దృష్టిలో పెట్టుకొని వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించాలన్నారు. వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని, సమయపాలన పాటించాలని ఆదేశించారు.