కడెం, ఆగస్టు 7 :నీటి లెక్కను పక్కాగా తెలుసుకోవడానికి, నీటి వివరాలు సులభంగా అధికారులకు చేరడానికి, ప్రాజెక్టు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోను క్యూసెక్కుల్లో స్పష్టంగా లెక్కించడానికి అధికారులు ఆటోమేటిక్ వాటర్ లెవల్ రికార్డర్(ఏడబ్ల్యూఎల్‌ఆర్)ను ఏర్పాటు చేశారు. 2017లో కడెం వద్ద, 2021లో ఎస్సారెస్పీ నీటిని తెలుసుకోవడానికి అన్ని గోదావరి వంతెనల మీద పెట్టారు. తాజాగా కడెం ప్రాజెక్టుకు సంబంధించి కొండుకూర్-పాండ్వాపూర్ గ్రామాల మధ్యలోని కడెం వంతెన వద్ద, మరోటి బెల్లాల్-బోర్నపల్లి గోదావరి వంతెన వద్ద ఏర్పాటు చేసి శాటిలైట్‌తో అనుసంధానం చేశారు. ఇవీ.. సోలార్ విధానం ద్వారా పని చేస్తుండగా.. వర్షపాతంతోపాటు, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో వివరాలను సులభతరంగా తెలియజేస్తాయి. అధికారులకు కూడా సమాచారం క్షణాల్లోనే చేరుతోంది.
అధిక వర్షాల వల్ల జలాశయాల వరద గేట్లు ఎత్తడం వల్ల ఎంత మేరకు నీరు విడుదలవుతోంది.. ఎన్ని క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది.. అనే సమాచారాన్ని జలాశయం అధికారులు లెక్క వేసి ఉన్నతాధికారులకు పంపాలి. అయితే ఇది స్పష్టంగా అంచనా వేసేందుకు ఆటోమేటిక్ వాటర్ లేవల్ రికార్డర్ (ఏడబ్ల్యూఎల్‌ఆర్) ద్వారా సాధ్యమవుతోంది. దీంతో ఇదివరకు 2017లో కడెం జలాశయం వరదగేట్ల వద్ద ఏర్పాటు చేసిన అధికారులు, 2021లో ఎస్సారెస్పీ నీటిని తెలుసుకునేందుకు అన్ని గోదావరి వంతెనల మీద ఏర్పాటు చేశారు. అయితే గతంలో కడెం ప్రాజెక్టు మీదా ఏర్పాటు చేసిన అధికారులు, ఈ వానకాలం కడెం వాగుపై కూడ పెట్టారు. రెండేళ్ల కాలంగా కడెం ప్రాజెక్టుకు అధికంగా వరదనీరు వస్తున్న సమాచారాన్ని కడెం ప్రాజెక్టు మీద ఏర్పాటు చేసిన పరికరం ద్వారా తెలుసుకుంటున్నప్పటికీ దిగువకు ఎంత వరకు విడుదల చేస్తున్నామనే సమాచారం సైతం తెలుసుకునేందుకు ఈ పరికరం ఎంతో ఉపయోగపడనుంది.
కడెం ప్రాజెక్టు వరదగేట్లు ఎత్తడం వల్ల అది నేరుగా గోదావరిలోకి కలవడంతోపాటు, ఎస్సారెస్పీ వరదగేట్లు ఎత్తడం వల్ల గోదావరి గుండా ఈ నీరు మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి జలాశయానికి చేరుకుంటోంది. దీంతోపాటు, స్వర్ణ, కడెం జలాశయాలకు సంబంధించిన నీరు గోదావరి ద్వారా ఎల్లంపల్లికి చేరుకుంటోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎన్ని క్యూసెక్కుల నీరు వస్తుందో తెలుసుకునేందుకు కడెం మండలంలోని బెల్లాల్ గోదావరి వంతెన వద్ద, ప్రస్తుతం కడెం ప్రాజెక్టు నుంచి వచ్చే నీటిని తెలుసుకునేందుకు నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారి వద్ద కడెం వంతెనపై నేషనల్ కొలెటరల్ మేనేజ్మెంట్ సర్వీస్ లిమిటెడ్(ఎన్సీఎంఎస్ఎల్) హైదరాబాద్‌కు చెందిన అధికారులు ఆటోమెటిక్ వాటర్ లేవల్ రికార్డర్(ఏడబ్ల్యూఎల్‌ఆర్) పరికరాన్ని ఏర్పాటు చేశారు. అయితే గతంలో కడెం జలాశయం వద్ద సెంట్రల్ వాటర్ కమీషన్ (సీడబ్ల్యూసీ) ఏర్పాటు చేయగా, ప్రస్తుతం గోదావరి నీటిమట్టాన్ని తెలుసుకునేందుకు ఎన్సీఎంఎస్ఎల్ అధికారులు దీనిని ఏర్పాటు చేశారు.
ఈ సమాచారం నీటి పారుదలశాఖ ఉన్నతాధికారులతోపాటు, ఎన్సీఎంఎస్ఎల్, సీడబ్ల్యూసీ అధికారులకు నేరుగా చేరుతుంది. అయితే ప్రతి జలాశయం నుంచి నీటి విడుదల చేసే ముం దు అధికారులు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులకు, సీడబ్ల్యూ సీ అధికారులతోపాటు, గోదావరి పరీవాహక ప్రాంత మండలాల తహసీల్దార్లకు, పోలీసులకు ముందస్తు సమాచారం అందించాల్సి ఉంటుంది. సంబంధిత అధికారులు ప్రజలను అప్రమత్తం చేశార ని నిర్ధారణ అయ్యాకే గోదావరిలోకి నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని సీడబ్ల్యూసీ అధికారులకు పూర్తి సమాచారం అందక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. జలాశయంలోకి ఇన్‌ఫ్లో చేరుతున్న పరిస్థితి, దిగువకు విడుదలవుతున్న నీటి పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉన్నతస్థాయి అధికారులకు అందించేందుకు ఈ ఏడబ్ల్యూఎల్‌ఆర్ పరికరం ఉపయోగపడనుంది.
నూతన పరికరంతో నేరుగా సమాచారం
గోదావరి వంతెన వద్ద ఇటీవల ఎన్సీఎంఎస్ఎస్ అధికారులు నూతనంగా ఏడబ్ల్యూఎల్‌ఆర్ పరికరాన్ని ఏర్పాటు చేశారు. గోదావరి నుంచి ఎన్ని క్యూసెక్కుల నీరు వెళ్తుందో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. ఇక్కడి సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకునేందుకు ఈ పరికరం పని చేస్తోంది. ఢిల్లీలోని సీడబ్ల్యూసీ అధికారులు, హైదరాబాద్‌లోని నేషనల్ కొలెటరల్ మేనేజ్మెంట్ సర్వీస్ లిమిటెడ్ (ఎన్సీఎంఎల్ఎస్) అధికారులకు ఇక్కడి సమాచారం అందుతోంది. ఆటోమేటిక్ వాటర్ లేవల్ రికార్డర్ (ఏడబ్ల్యూఎల్‌ఆర్) ఇది సోలార్ విధానం ద్వారా పని చేస్తోంది. కడెం ప్రాజెక్టుకు సంబంధించినది కొండుకూర్-పాండ్వాపూర్ గ్రామాల మధ్యలోని కడెం వంతెన వద్ద ఏర్పాటు చేయగా, గోదావరికి సంబంధించిన పరికరాన్ని బెల్లాల్-బోర్నపల్లి గోదావరి వంతెన వద్ద ఏర్పాటు చేసి వీటిని శాటిలైట్‌తో అనుసంధానం చేశారు. వర్షపాతంతోపాటు, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో వివరాలను తెలియజేస్తోంది.
పూర్తిస్థాయి సమాచారం తెలుస్తోంది..
వంతెనల వద్ద ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ వాటర్ లేవల్ రికార్డర్ (ఏడబ్ల్యూఎల్‌ఆర్) పరికరం ద్వారా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ఇన్‌ఫ్లో, అలాగే నీటి విడుదలకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం క్షణాల్లో తెలుస్తోంది. కడెం ప్రాజెక్టు నీరు, ఎస్సారెస్పీ ద్వారా విడుదలయ్యే నీరు నేరుగా శ్రీపాద ఎల్లంపల్లిలోకి చేరుతున్న తరుణంలో ఆ ప్రాజెక్టు మన ప్రాంతాలైన కడెం, ఎస్సారెస్పీ నుంచి వచ్చే నీటి సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు ఈ పరికరాలు ఉపయోగపడతాయి. సోలార్ అనుసంధానం ద్వారా ఇవి ఉన్నతస్థాయి అధికారులకు కూడా సమాచారాన్ని చేరవేసే సౌకర్యం ఇందులో ఉంది.
– భోజదాస్, డీఈ, కడెం ప్రాజెక్టు.