డ్రాగన్ ఫ్రూట్ విదేశాల్లో పండే పంట. మంచి ఔషధంలా పనిచేస్తోంది. ఒక్కసారి పంట వేస్తే రెండున్నర దశాబ్దాలు దిగుబడి వస్తోంది. ఖర్చు తక్కువ.. ఆదాయం అధికం. తెగుళ్లు సోకే ప్రమాదం తక్కువ. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట కావడంతో రైతన్నలు సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. దీనికితోడు రాష్ట్ర సర్కారు కూడా సంప్రదాయ పంటలకు బదులు విభిన్న పంటలను ప్రోత్సహిస్తున్నది. అన్ని రకాలుగా బాగుండడంతో అన్నదాతలు డ్రాగన్ ఫ్రూట్‌ను సాగు చేస్తున్నారు. సర్కారు కూడా సబ్సిడీపై పరికరాలు అందిస్తుండడంతో రైతన్నలు ముందుకొస్తున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు.
– దిలావర్పూర్, సెప్టెంబర్ 11
సంప్రదాయ పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై రైతన్నలు దృష్టి సారిస్తున్నారు. ప్రధానంగా విభిన్న పంటైన డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని ఎకరంలో సాగు చేయడానికి రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఖర్చవుతోంది. ఒక్కసారి పెట్టుబడి పెడితే 25 సంవత్సరాల వరకు రాబడి వస్తోంది. ఔషధ గుణాలు మెండుగా ఉండడం, మార్కెట్లో కూడా అధిక డిమాండ్ ఉండడం, తెగుళ్లు సోకే ప్రమాదం తక్కువగా ఉండడంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ పంటను వేసే రైతన్నలకు సర్కారు కూడా ప్రోత్సాహం అందిస్తున్నది. సబ్సిడీపై పరికరాలు ఇస్తున్నది.
– దిలావర్పూర్, సెప్టెంబర్ 11
నా పేరు హరిపటేల్. మాది నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం. నాకు అటవీ పరిసర ప్రాంతంలో భూమి ఉన్నది. చేతికందే దశలో అటవీ జంతువులు ఏ పంట వేసినా దాడి చేసి నాశనం చేస్తున్నాయి. నాకు ఓ ఆలోచన వచ్చింది. డ్రాగన్ ఫ్రూట్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని గమనించా. మెదక్ జిల్లాలో సాగు పద్ధతులు తెలుసుకున్నా. ఒక మొక్కను రూ.70 కొనుగోలు చేసి 500 స్తంభాలు వేసి ఒక్కొక్క మొక్కను నాటిన. ఎకరం భూమిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసేందుకు రూ.6 లక్షలు ఖర్చు అయింది. సొంత డబ్బులతో సాగు చేసిన. ఒక్కసారి పెట్టుబడి పెడితే 25 ఏండ్ల వరకు దిగుబడి వస్తుందని అధికారులు తెలిపారు. మొదటి సంవత్సరం నుంచి దిగుబడి వస్తున్నది. ఎకరానికి టన్ను చొప్పున దిగుబడి వస్తున్నది. ఈ పంటను పూర్తిగా సేంద్రియ పద్ధతితో సాగు చేస్తున్న. ఫలితంగా చీడపీడల బెడద తక్కువగా ఉంటున్నది. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.220 ఉన్నది. ఇతర పంటలతో పోలిస్తే డ్రాగన్ ఫ్రూట్ మేలనిపిస్తున్నది. నన్ను చూసి మా ఊరిలో మరో రైతు సాగు చేస్తున్నడు.
నాకున్న వ్యవసాయ భూమిలో ముందుగా అరెకరంలో మూడేండ్ల క్రితం డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నా. కరోనా సమయంలో ఈ పండుకు మంచి డిమాండ్ ఉండడంతోపాటు దిగుబడి కూడా బాగానే వచ్చింది. వర్షాకాలం ప్రారంభం నుంచి చలికాలం పూర్తయ్యే వరకు మూడు పంటలు వస్తాయి. నేను సాగు చేస్తున్న అరెకరంలో వర్షాకాలం నుంచి చలికాలం వరకు ఖర్చులు పోనూ రూ. ఒక లక్ష చేతికి వచ్చాయి. కరోనా సమయలో అనుకున్న దానికంటే అధిక ఆదాయం వచ్చింది. ఇతర పంటలతో పోలిస్తే తెగుళ్లు సోకే ప్రమాదం కూడా చాలా తక్కువ.
– గన్నారపు సూర్య, కాల్వ.