బోథ్, జనవరి 22 : బోథ్‌లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనం సంతరించుకున్నది. ప్రజలు వాకింగ్ చేస్తూ ఆహ్లాదం పొందుతున్నారు. మహాలక్ష్మీ పోచమ్మ ఆలయ సమీపంలో ఎకరం భూమిలో రూ.7.05 లక్షలతో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. టేకు, జామ, గుల్మొహర్, పలు రకాల పూల, తదితర నీడనిచ్చే చెట్లు పెంచుతున్నారు. ప్రజలు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసేందుకు సౌకర్యంగా ఉండేలా నడకదారి ఏర్పాటు చేశారు. పిల్లలు ఆడుకోవడానికి జారుడు బల్లలు, ఊయలలు ఏర్పాటు చేశారు. వారాంతలో వన భోజనాలు వండుకునేందుకు వీలుగా ఓపెన్ షెడ్డును నిర్మించారు. గ్రామ పంచాయతీ అధికారులు ఎప్పటికప్పుడు సందర్శిస్తూ మొక్కల సంరక్షణకు చర్యలు చేపడుతున్నారు. సర్పంచ్ సురేందర్యాదవ్తో పాటు ఈజీఎస్ ఏపీవో జగ్దేరావు, పంచాయతీ కార్యదర్శి అంజయ్య ప్రకృతి వనాన్ని పర్యాటకులు సేదతీరేందుకు వీలుగా ఆహ్లాదంగా తయారు చేయించారు.
పల్లె ప్రకృతి వనంలో మొక్కల సంరక్షణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైన సమయంలో నీరు పట్టిస్తున్నాం. కొమ్మలు కత్తిరిస్తున్నాం. పిల్లలు ఆడుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఊయల, జారుడు బల్లలకు అవసరమైన మరమ్మతులు చేయిస్తున్నాం. ఒక్కసారి వచ్చి వెళ్లితే మళ్లీ రావాలనే అనుభూతి కలిగేలా ప్రకృతి వనాన్ని అందంగా తీర్చిదిద్దాం.
-జీ సురేందర్‌యాదవ్, సర్పంచ్, బోథ్