నెన్నెల, జనవరి17 : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి కోసం కనీసం ఒక్కటైనా కొత్త పని తీసుకొచ్చారా అంటూ బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రశ్నించారు. శుక్రవారం నెన్నెలలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఎమ్మెల్యే వినోద్ పైసా పని చేయలేదని ఆరోపించారు. కేసీఆర్ సర్కారు ఎన్నికలకంటే ముందే నియోజకవర్గ అభివృద్ధికి రూ . 30 కోట్లు ఇచ్చిందని, ఎన్నికలు రావడంతో పనులు ఆగిపోయాయన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత అవే పనులు చేస్తూ కాంగ్రెస్సే చేపడుతుందని చెప్పు కోవడం సిగ్గు చేటన్నారు.
నెన్నెల మండలంలోని ప్రతి గ్రామానికీ రోడ్డు నిర్మాణం చేపట్టాలన్న తపనతో విడుతల వారీగా నిధులు తీసుకువచ్చామని గుర్తు చేశారు. కోణంపేట రోడ్డు, ఎర్రవాగు వంతెన, నెన్నెల ప్రధాన రోడ్డు, కుష్నపల్లి-నెన్నెల రోడ్డు, కొత్తగూడెం, బొప్పారం బీటీ రోడ్డుకు నిధులు మంజూరయ్యాయన్నారు. ఊరూరా మహిళా శక్తి భవనాల కోసం రూ. 25 లక్షల చొప్పున మంజూరు చేయిస్తే.. ఆ నిధులను ఇతర పనులకు బదలాయించుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదని, ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి నట్టేట ముంచిందని విమర్శించారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో చేయలేదని, రెండుసార్లు రైతులకు అందాల్సిన రైతుబంధు (రైతు భరోసా) ఇప్పటి వరకూ దిక్కులేదన్నారు.
మహిళలకు ప్రతి నెలా రూ. 2500 ఇస్తామని, వృద్ధులకు రూ.4 వేల పింఛన్ ఇస్తామని చెప్పి మాట తప్పిందని మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో వంద కోట్ల ధాన్యం బుక్కిన మిల్లర్లపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు వందలకోట్ల అవినీతికి పాల్పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే ఇసుకలోనూ దోపిడీలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విద్యాసాగర్‌గౌడ్, పీఏసీఏస్ చైర్మన్ మేక్ల మల్లేశ్, నాయకులు ప్రతాప్‌రెడ్డి, రాంచందర్, మాజీ సర్పంచ్‌లు బాపు, తిరుపతిరెడ్డి, శంకర్, మల్లేశ్, మాజీ ఎంపీటీసీలు ఇబ్రహీం, తిరుపతి, రమేశ్, నాయకులు మోహన్, ప్రేమ్సాగర్గౌడ్, శివప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, ప్రవీణ్, కృష్ణస్వామి పాల్గొన్నారు.
పరామర్శ
నెన్నెల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త పూదరి సత్యనారాయణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, శుక్రవారం బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సత్యనారాయణ మృతి గురించి ఆయన కుమారులు పూదరి అంజన్న(పార్టీ గ్రామ మాజీ అధ్యక్షుడు), నరేశ్, సురేశ్‌లను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు సాగర్‌గౌడ్, నాయకులు మేకల మల్లేశ్, భీమాగౌడ్,ప్రతాప్‌రెడ్డి, రాంచందర్, తిరుపతి, ఇబ్రహీం, శ్రీనివాస్‌గౌడ్ ఉన్నారు.