కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో పలుచోట్ల ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. పల్లెల్లో ప్రజలు ఉదయం నుంచే బారులు తీరగా.. పట్టణ ప్రాంతాల్లోని కేంద్రాల వద్ద పెద్దగా సందడి కనిపించలేదు. కొన్ని కేంద్రాల వద్ద మధ్యాహ్నం ఒంటి గంట అయినా జనాలు రాలేదు. ఆసిఫాబాద్ మండలం మాలన్గొందిలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, కాగజ్‌నగర్‌లో మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్ పాల్గొన్నారు.
కాగజ్‌నగర్‌లోని పలు వార్డుల్లో ఉదయం 10 గంటలైనా ప్రజలు కనిపించలేదు. 26వ వార్డులో మధ్యాహ్నం ఒంటిగంట అయినా అర్జీల స్వీకరణ ప్రారంభం కాలేదు. పెంచికల్పేట్ మండలం కొండపల్లిలో 10 గంటల తర్వాత దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాల వద్ద అధికారులు మౌలిక సదుపాయాలు కల్పించారు. అర్జీదారుల దరఖాస్తులను నింపేందుకు ప్రత్యేకంగా కొందరిని నియమించారు. జిల్లాలో మొదటి రోజు 6,186 దరఖాస్తులు వచ్చాయి.