తాండూర్ : రైతులు వరి పంటను కోసిన అనంతరం వరి కొయ్యల ( Paddy Stubble) అవశేషాలు కాల్చడం ద్వారా అపారమైన నష్టాలు ఉంటాయని తాండూర్ వ్యవసాయ అధికారి కే సుష్మ ( Susma ) అన్నారు. బుధవారం మండలంలోని అచ్చలాపూర్, తాండూర్ గ్రామాల్లో వరి పంట క్షేత్ర ప్రదర్శనలో భాగంగా రైతులకు అవగాహన కల్పించారు.
వరి పంట, మొక్కజొన్న, పత్తి పంట కోత అనంతరం మిగిలిన అవశేషాలు కాల్చడం వలన గాలి కాలుష్యం అవుతుందని, భూసారం తగ్గుతుందని. నేలలోని సేంద్రియ పదార్థాలు పంటకు అవసరమయ్యే సూక్ష్మజీవులు నశించి భూసారం తగ్గుతుందని వెల్లడించారు.
పంట అవశేషాలు కాల్చకుండా భూమిలోనే కలియ దున్నడం వల్ల పంటకు సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుందన్నారు. రైతులు ఎవరైనా పంట అవశేషాలు కాలిస్తే జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. వ్యవసాయాధికారి వెంట ఏఈవోలు వీవీ ధనలక్ష్మి, యం వెంకటేష్, రైతులు ఉన్నారు.