కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో దాడులు జరుగుతున్నా రేషన్ బియ్యం అక్రమ దందా ఆగడం లేదు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేస్తున్నా అక్రమార్కుల్లో మార్పు రావడం లేదు. స్థానిక అధికారుల అండదండలు, రాజకీయ నాయకుల సహాయ సహకారాలతోనే బియ్యం దందా యథేచ్ఛగా కొనసాగుతున్నదనే అనుమానాలు కలుగుతున్నాయి.
బియ్యం రవాణా చేస్తూ పట్టుబడుతున్న వారిపై కేసులు నమోదవుతున్నప్పటికీ అక్రమ బియ్యం దందా మాత్రం ఆగడం లేదు. అక్రమార్కులు వివిధ మార్గాల్లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ప్రతి నెలా ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నది.
బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెంచి పట్టుకున్న అధికారులు ఇటీవల అక్రమ రవాణాపై దృష్టి సారించకపోవడంతో అక్రమ వ్యాపారులు చెలరేగిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా మాఫియాగా మారింది. కాగజ్‌నగర్ అడ్డాగా ఇటు మంచిర్యాల, బెల్లంపల్లి నుంచి, మరో వైపు ఆసిఫాబాద్ నుంచి సిర్పూర్-టీ మీదుగా చౌక బియ్యం పొరుగుకు రాష్ర్టానికి రవాణా అవుతున్నది. ఈ దందా ప్రతి నెలా రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులకు బియ్యం ఇవ్వడం నుంచి మొదలవుతున్నది.
మహారాష్ట్రకు అక్రమంగా తరలింపు..
కొంతమంది వ్యాపారులు ప్రత్యేకంగా రేషన్ బియ్యం కొని వాటిని విక్రయించడమే వృత్తిగా పెట్టున్నారు. కొన్ని ప్రాం తాల్లో లబ్ధిదారుల నుంచి రేషన్ షాపు వద్దనే కొనడం, మరి కొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారులకు ఇవ్వకుండానే నేరుగా రేష న్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు వ స్తున్నాయి. కిలో బియ్యాన్ని రూ.12కు కొనుగోలు చేసి మ హారాష్ట్రలోని సరిహద్దు ప్రాంతాల్లో రూ.20కు వరకు విక్రయిస్తున్నారు.
మహారాష్ట్రకు తరలి వెళ్తున్న బియ్యాన్ని పట్టుకునేందుకు మధ్యలో ఎక్కడ చెక్‌పోస్టులు లేవు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, చిన్న వ్యాన్లలో జిల్లాలో వాంకిడి, సిర్పూర్-టీ మండలంలోని వెంట్రావ్పేట్, తదితర మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడ గోదాముల్లో డంప్ చేసి, అక్కడి నుంచి భారీ వాహనాల్లో గొందియా, బల్లార్షలోని రైస్‌మిల్లులకు తరలిస్తున్నారు.
దాడులు నిర్వహించినా ఆగని రవాణా..
టాస్క్‌ఫోర్స్ అధికారులు పక్కా సమాచారంతో దాడులు నిర్వహిస్తూ కేసులు పెడుతున్నా ఎలాంటి భయం లేకుండా అక్రమార్కులు దందాను కొనసాగిస్తున్నారు. ఇటీవల టాస్క్‌ఫోర్స్ అధికారులు పెంచికల్పేట్లో ఓ వ్యాపారి ఇంట్లో సోదాలు చేసి రవాణాకు సిద్ధంగా 15 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఇటీవల కాగజ్‌నగర్ చింతగూడా కోయవాగు వద్ద అక్రమంగా మహారాష్ట్రకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న 122 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు.
ఈ నెల 18న వాంకిడి మండలంలో సరాండి టోల్ ప్లాజా వద్ద 123 క్వింటాళ్ల బియ్యం వ్యాన్‌లో తరలిస్తుండగా తనిఖీ చేసి అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారంలో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహిస్తే తప్పా స్థానిక అధికారులు అక్రమ బియ్యం రవాణాను అడ్డుకున్న దాఖలాలు ఎక్కడ లేవు. దీంతో స్థానిక అధికారుల సహకారాలు అక్రమార్కులకు అందుతున్నాయన్నా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉన్నతాధికారులు నిఘా పెట్టి, అక్రమారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.