నిర్మల్, జూన్ 9(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో మట్టి, మొరం మాఫియా రెచ్చపోతున్నది. కొందరు అక్రమార్కులు అనుమతులు లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో అక్రమంగా మట్టిని తవ్వేస్తున్నారు. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా ఇష్టారాజ్యంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఈ అక్రమ దందాకు కొందరి రాజకీ య నాయకుల అండదండలున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడులు చేయడానికి వెనుకాడడం లేదనే విమర్శలు వెల్లువె త్తుతున్నాయి. తాజాగా.. కొందరు అక్రమార్కులు ఓ చెరువును చెరబట్టి అం దినకాడికి దండుకున్నారు.
ఇది జరిగి వారం రోజులవుతున్నా వారిపై చర్యలు తీసుకొనేందుకు అధికారులు వెనకడుగు వేస్తున్నారు. నిర్మల్ జిల్లా బాసర మండలంలోని బిద్రెల్లి గ్రామ శివారులో గల పెద్ద చెరువులో యథేచ్ఛగా మ ట్టి తవ్వకాలు జరిగాయి. ముథోల్ నియోకవర్గ స్థాయి నేత అండదండలతో ఓ రైల్వే కాంట్రాక్టర్, మరికొందరు స్థానిక నాయకులు కలిసి చెరువులో పెద్ద ఎత్తున మట్టి, మొరం తవ్వకాలకు తెరలేపారు. పక్షం రోజులుగా వందలాది టిప్పర్ల ద్వారా బాసర సమీపంలోని మహారాష్ట్ర వైపు సాగుతున్న రైల్వేట్రాక్ పనుల కోసం నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నారు.
అయినప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. బిద్రెల్లి చెరువులో సాగుతున్న ఈ అక్రమ దందాపై సమాచారం అందుకున్న బీఆర్ఎస్ ముథోల్ నియోజకవర్గ నేత డాక్టర్ పడకంటి రమాదేవి, తన అనుచరులతో కలిసి ఇటీవల తవ్వకాలు జ రుగుతున్న ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించారు. అక్క డ జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను ఆమె స్వయంగా అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండానే చెరువును గుల్ల చేస్తున్న తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ అక్రమ తవ్వకాలపై రమాదేవి వెంటనే ఇరిగేషన్, మైనింగ్ శాఖల అధికారులకు సమాచారం అందించారు. అంతేకాకుండా మొరం తరలించేందుకు వినియోగిస్తున్న టిప్పర్లు, జేసీబీ వాహనాల నంబర్లను అధికారులకు అందజేశారు. ఇది జరిగి దాదాపు వారం రోజులు అయినప్పటికీ అక్రమార్కుల పై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. కనీసం అ క్రమ రవాణాకు వినియోగించిన వాహనాలను సీజ్ చేయడానికి కూడా అధికారులు వెనుకాడడం వెనుక స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లే కారణమనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. స్థానిక నియోజకవర్గ నేత అండదండలతోనే ఈ దందా యథేచ్ఛ గా సాగుతున్నదని, అందుకే అధికారులు చర్య లు తీసుకొనేందుకు వెనుకాడుతున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి బిద్రెల్లి చెరువును కాపాడాలని, ఈ అక్రమ దందా కు సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తు లు, పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.

ఆక్రమణలో పెద్ద చెరువు
దాదాపు 195 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువును కొంతమంది ఇప్పటికే ఆక్రమించగా, మిగిలిన చెరువు భూమిలో అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు. మహారాష్ట్ర రైతులకు నల్లమట్టిని తరలిస్తున్నామని చెబుతూనే, మరోవైపు ఓ బడా కాంట్రాక్టర్‌కు పెద్ద ఎత్తున మొరం తరలిస్తూ కొందరు అక్రమార్కులు లక్షలు దండుకుంటున్నారు. దీని వెనుక నియోజకవర్గ స్థాయి నేత అండదండలున్నాయనే ప్రచారం ఉం ది. బిద్రెల్లి గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి, మరికొందరితో కలిసి గత కొన్ని రోజులుగా ఈ చెరువును చెరబట్టినట్లు చెబుతున్నారు. పైకి రైతుల పేరు చెబుతూ.. తెర వెను క ఓ రైల్వే కాంట్రాక్టర్‌తో చేతులు కలిపి పెద్ద ఎత్తున నల్లమట్టితో పాటు మొరం తవ్వకాలు జరిపిన వైనం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం బాసర నుంచి మహారాష్ట్రలోని బాలాపూర్ వరకు జరుగుతున్న రైల్వే ట్రాక్ రెండవ లైన్ పనులను ఆసరాగా చేసుకొని ఈ దందాకు తెరలేపినట్లు తెలుస్తున్నది.
సదరు రైల్వే పనులను దక్కించుకున్న కాంట్రాక్టు కంపెనీ నిర్వాహకులు, బిద్రెల్లి గ్రామానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులతో కుమ్మక్కైనట్లు సమాచారం. ఇరిగేషన్, మైనింగ్ శాఖల నుంచి ఎలాంటి ముంద స్తు అనుమతులు తీసుకోకుండానే, ఇక్కడి చెరువులో పది రోజుల పాటు జేసీబీ యంత్రాల సహాయంతో యథేచ్ఛగా తవ్వకాలు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. చెరువులో నుంచి వాహనాలు బయటకు వెళ్లేందుకు ఏకంగా ఓ తా త్కాలిక రోడ్డును కూడా వేసుకున్నారు.
మహారాష్ట్రలోని ఉద్గిర్ ప్రాం తం నుంచి ప్రత్యేకంగా టిప్పర్లను తెప్పించి రాత్రిపూట సద రు రైల్వే పనులకు అక్రమంగా మొరం తరలించినట్లు స్థానికులు చెబుతున్నారు. చెరువులో ఏర్పడ్డ భారీ గుంతలను చూస్తే ఇప్పటి వరకు వందల సంఖ్యలో టిప్పర్ల మొరం తరలించినట్లు ఎవరికైనా అర్థమవుతుంది. నల్లమట్టి అడుగు భాగంలో ఉన్న నాణ్యమైన మొరంను జేసీబీ యంత్రాల సహాయంతో తవ్వి, రైల్వే ట్రాక్ పనుల కోసం తరలించి ఒక్కో టిప్పర్‌ను రూ.4వేల నుంచి 5వేలకు విక్రయించినట్లు సమాచారం. అక్రమార్కులు కొల్లగొట్టిన నల్లమట్టి, మొరం విలువను లెక్కించి జరిమానా విధించడంతోపాటు వారిపై కేసులు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
భారీ తవ్వకాలతో పొంచి ఉన్న ప్రమాదం
ఇక్కడి చెరువులో పది రోజులపాటు అడ్డూఅదుపూ లేకుండా జరిపిన తవ్వకాలతో ఎక్కడికక్కడ భారీగా గుంతలు ఏర్పడ్డాయి. ఒక్కో గుంత 20 నుంచి 30 అడుగుల లోతు వరకు ఉండడంతో అవి ప్రమాదకరంగా మారాయి. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో చెరువులో నీరులేక ఈ గుంతలు బయటకు కనిపిస్తున్నాయి. వచ్చే వానకాలంలో చెరువులోకి కొత్త నీరు చేరి నిండిపోతే, ఈ లోతును అంచనా వేయడం సాధ్యం కాదు. దీంతో చెరువు సమీపంలోకి వెళ్లే గ్రామానికి చెందిన ప్రజలతోపాటు, దాహార్తిని తీర్చుకోవడానికి వచ్చే వందలాది పశు సంపద ఆ మృత్యుకూపాల్లో పడిపోయి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్నది. పర్యావరణాన్ని నాశనం చేస్తూ, ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న ఈ నల్లమట్టి, మొరం అక్రమ దందాపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
అనుమతి ఇవ్వలేదు..
బాసర-బాలాపూర్ సమీపంలో జరుగుతున్న రైల్వే ట్రాక్‌కు సంబంధించి పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ అవసరమైన గ్రావెల్ కోసం పక్షం రోజుల క్రితం మమ్మల్ని సంప్రదించారు. బిద్రెల్లిలోని పెద్ద చెరువులో ఆక్రమణకు గురైన భూమి నుంచి 40 వేల క్యుబిక్ మీటర్ల మొరం తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జిల్లా మైనింగ్ శాఖ అధికారులకు లెటర్ పంపాము. వాటికి ఆమోదం లభించకముందే, సదరు కాంట్రాక్టర్ స్థానిక నాయకులతో కలిసి మొరం తరలించుకుపోయినట్లు మా దృష్టికి వచ్చింది.
చెరువు నుంచి గ్రావెల్ తరలించేందుకు రైల్వే కాంట్రాక్టర్‌కు అనుమతి ఇవ్వలేదు. సమాచారం తెలిసిన వెంటనే మొరం తరలింపును నిలిపివేశాం. తరలించిన మట్టిని అంచనా వేసి జరిమాన విధించడమే కాకుండా, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం. అలాగే ఇక్కడి చెరువు మొత్తం 195 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, దాదాపు 130 ఎకరాలు ఇప్పటికీ రైతుల ఆధీనంలోనే ఉన్నాయి. కేవలం 65 ఎకరాల్లోనే చెరువు నీరు నిలిచి ఉంటున్నది. రెవెన్యూ శాఖ సహకారంతో త్వరలోనే చెరువు పూర్తి విస్తీర్ణంపై సర్వే నిర్వహించి, ఆక్రమణదారుల నుంచి చెరువు భూములు కాపాడుతాం.
– అనీల్, నీటిపారుదల శాఖ ఈఈ, నిర్మల్.
కఠిన చర్యలు తీసుకోవాలి..
బీజేపీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీల అండ చూసుకొని రైల్వే కాంట్రాక్టర్ విలువైన సంపదను అడ్డంగా దోచేశారు. ఈ అక్రమ దందాపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా ఇరిగేషన్, మైనింగ్ అధికారులు స్పందించకపోవడం దారుణం. బిద్రెల్లి చెరువులో పక్షం రోజులుగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారంతో కొంతమంది పార్టీ కార్యకర్తలతో కలిసి అక్కడికి వెళ్లాం. స్థానికంగా గల కొందరు నాయకులు, రైల్వే కాంట్రాక్టర్లతో కుమ్మక్కై చెరువు లోపలి వరకు తవ్వి పెద్ద ఎత్తున మట్టిని, మొరాన్ని రైల్వే ట్రాక్ పనులకు తరలించారు. ఈ విషయమై ఇరిగేషన్ ఈఈతో పాటు, మైనింగ్ ఏడీతో ఫోన్లో మాట్లాడా. వారు ఇక్కడి చెరువులో మట్టి, మొరం తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు.
అనుమతి లేకుండా చెరువులో తవ్వకాలు ఎందుకు జరిపారని అక్కడున్న వారిని నిలదీస్తే.. మాకు అన్ని అనుమతులు ఉన్నాయి. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ మమ్మల్నే దబాయించారు. మేము తవ్వకాలను అడ్డుకొనేటప్పటికే పది రోజుల్లో వందల సంఖ్యలో టిప్పర్ల మట్టి, మొరంను తరలించేశారు. చెరువులో ఇంత పెద్ద ఎత్తున మైనింగ్ తవ్వకాలు జరుగుతుంటే స్థానిక ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవడంలేదు. దీని వెనుక ఎమ్మెల్యే, ఎంపీ హస్తం ఉన్నట్లు మాకు అనుమానాలు ఉన్నాయి.
ఇంత యథేచ్ఛగా చెరువులను తవ్వుకొనే అధికారం వీరికి ఎవరు ఇచ్చారు? చెరువులో నుంచి మొరం తరలించడానికి సిద్ధంగా ఉన్న టిప్పర్లు, జేసీబీ నంబర్లను ఇరిగేషన్ అధికారులకు ఇచ్చినప్పటికీ, వాటిని సీజ్ చేయలేదు. ఈ అక్రమ దందాలో ఇటు అధికారులతోపాటు స్థానిక బీజేపీ నాయకుల హస్తం ఉంది. దీనిపై ఉన్నతాధికారులు పూర్తి విచారణ జరిపించి అక్రమంగా మొరం తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతాం.
– డాక్టర్ పడకంటి రమాదేవి, బీఆర్ఎస్ ముథోల్ నియోజకవర్గ నేత.