దశాబ్దాల తరబడి భూ రికార్డుల గజి బిజి, గందరగోళానికి చరమగీతం పాడుతూ.. రైతన్నల శ్రేయస్సే లక్ష్యంగా.. భూ పరిపాలనలో కొత్త శకానికి నాంది పలుకుతూ.. యావత్ దేశానికే మార్గదర్శనంగా నిలుస్తూ.. అత్యంత పారదర్శకంగా, సులువుగా, వేగంగా భూ రిజిస్ట్రేషన్లు కావడానికి తీసుకొచ్చిన ‘ధరణి’ పోర్టల్‌ను ఎత్తేయడానికి కాంగ్రెసోళ్లు కుట్రలు పన్నుతున్నరు. మళ్లీ పాత పద్ధతైన పటేల్, పట్వారీ, దళారీ వ్యవస్థను తీసుకొస్తామని ప్రకటనలు చేస్తున్నరు.
గతంలో భూ రిజిస్ట్రేషన్లు కావడానికి ఏండ్ల తరబడి తహసీల్దార్, రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరిగినా పని అయ్యేది కాదు. చేయి తడపందే ఫైలు ముందుకు కదిలేది కాదు. ఒకరి పేరిట ఉన్న భూములను పట్టాదారుకు తెలియకుండా పలుకుబడి ఉన్న వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేసేవారు. ప్రస్తుతం రైతుతోపాటు కౌలుదారుకు కూడా హక్కులు కల్పిస్తామని కాంగ్రెసోళ్లు ప్రకటనలు చేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ తెచ్చిన ధరణే బాగుందని అన్నదాతలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు.
– ఆదిలాబాద్/నిర్మల్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ)
రూరల్, నవంబర్ 20 : నా పేరు పెందూర్ వసంత్. మాది ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చింతగూడ. మాది ఉమ్మడి కుటుంబం. తల్లిదండ్రులు ఆనందరావు, రత్నాబాయి. ముగ్గురు అన్నదమ్ములం (సుధాకర్, వసంత్, గణేశ్). అందరికీ పెండ్లిళ్లు కావడంతో మా తండ్రి ఆనందరావు పేరిట పదెకరాలు ఉండగా.. మా తల్లి, మా అన్నదమ్ముల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్నం. గత నెల ఆదిలాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లినం. ధరణి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకుంటే మరుసటి రోజు రమ్మన్నరు. మా తండ్రి పేరిట ఉన్న భూమిని అన్న సుధాకర్ పేరిట రెండెకరాలు, నా(వసంత్) పేరిట ఎకరంన్నర, మా తమ్ముడు గణేశ్ పేరిట ఎకరంన్నర, మా తల్లి రత్నాబాయి పేరిట ఐదెకరాలు రిజిస్ట్రేషన్ చేశారు. ఈ పక్రియ అంతా అరగంటలోపే పూర్తి చేసి, భూమి పట్టా ఇచ్చారు. మా తండ్రి ఆశ్చర్యానికి గురయ్యాడు. గతంలో భూమి రిజిస్ట్రేషన్ కావాలంటే సంవత్సరాలు పట్టేదని చెప్పాడు. చాలా డబ్బులు ఖర్చయ్యేవని తెలిపాడు. తొందరగా కావడంతో మా తండ్రితోపాటు మేము కూడా చాలా సంతోషించాం. ఇటువంటి ధరణిని తీసేయాలని చూస్తున్న కాంగ్రెసోళ్లకు తగిన బుద్ధి చెబుతాం.
ఆదిలాబాద్/నిర్మల్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ధరణి పోర్టల్‌తో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తున్నది. రైతులు వ్యవసాయ భూములు కొనాలన్నా.. అమ్మాలన్నా గతంలో మాదిరిగా దళారులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆఫీసుల చుట్టూ తిరగడం, అనవసర వ్యయ, ప్రయాసలు తప్పాయి. మీ సేవలో స్లాట్ బుక్ చేసుకున్న తేదీలో రిజిస్ట్రేషన్‌తోపాటు మ్యుటేషన్ కాపీ అందుతున్నది. గతంలో రోజుల తరబడి కాని పని ధరణి ద్వారా నిమిషాల్లో పూర్తవుతుండడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు అధికారుల చేయి తడపనిదే డాక్యుమెంట్లు ముందుకు కదిలేవి కాదు. ఇప్పుడు అదనంగా నయా పైసా ఖర్చు లేకుండా పారదర్శకంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో భూముల వివరాలు సక్రమంగా లేకపోవడంతో గ్రామాల్లో నిత్యం భూ తగాదాలు జరుగుతుండేవి. ఇలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ భూ రికార్డుల క్రమబద్ధీకరణకు శ్రీకారం చుట్టారు. రికార్డులను ఆన్లైన్ చేసి ధరణి పోర్టల్‌లో నిక్షిప్తం చేయడంతోపాటు కొత్త పాస్‌బుక్‌లను అందించారు. ధరణికి ముందు మాన్యువల్ రికార్డులు ఉండగా, ఎవరి భూములు ఎవరికి సొంతమో తెలియని అయోమయ దుస్థితి ఉండేది.
అప్పట్లో రిజిస్ట్రేషన్ ఓ ప్రహసనం. మ్యుటేషన్ చేయించుకోవడానికి నెలల సమయం పట్టేది. ధరణి వచ్చాక నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్.. ఆ వెంటనే మ్యుటేషన్ పూర్తయిన పత్రాలు చేతికందుతున్నాయి. భూముల క్రయవిక్రయాలతోపాటు ధరణి పోర్టల్‌లో భూముల పూర్తి వివరాలు నిక్షిప్తం చేయడం వల్ల రైతులకు అనేక రకాల ప్రయోజనాలు చేకూరుతున్నాయి. ముఖ్యంగా ధరణిలో ఉన్న వివరాల ఆధారంగానే ప్రతి సీజన్లో రైతుబంధు సాయాన్ని ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నది. అలాగే.. రైతుబీమాను వర్తింప జేస్తోంది. రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరపాలంటే ధరణి పోర్టల్ వల్లనే సాధ్యమవుతున్నది. ఇలా అన్ని రకాలుగా రైతులకు మేలు చేసేలా ఉన్న ధరణిని.. కాంగ్రెస్ నాయకులు తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామంటున్నారు.
మళ్లీ దళారీ వ్యవస్థను ప్రోత్సహించేలా ఉన్న కాంగ్రెస్ తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టా పాస్‌బుక్‌లో కౌలుదారు పేరును చేర్చి, రైతుతో సమానంగా వారికి కూడా హక్కులు కల్పిస్తామని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతులు భయాందోళనకు గురవుతున్నారు. కాంగ్రెస్ నేతల మాటలతో ఇకపై రైతులు ఎవరు కూడా తమ భూములను కౌలుకిచ్చే పరిస్థితి ఉండదని, దీంతో నోటికాడి బుక్కను దక్కకుండా చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై కౌలుదారులు తిరగబడే పరిస్థితి ఉంటుందంటున్నారు. అంతేకాకుండా మళ్లీ పాత పద్ధతిలోనే పటేల్, పట్వారీ వ్యవస్థను తీసుకొచ్చి అవినీతికి ఆస్కారమిచ్చేలా కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలపై రైతులు మండిపడుతున్నారు. పకడ్బందీగా ధరణిని అమలు చేసి రైతులకు మేలు చేస్తున్న బీఆర్ఎస్ సర్కారుకే అండగా ఉంటామని రైతులు స్పష్టం చేస్తున్నారు.
దస్తురాబాద్, నవంబర్ 20 : ధరణితో భూ సమస్యలు లేకుండా అయ్యాయి. ఒకేసారి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ నిమిషాల్లోనే పూర్తవుతున్నది. పారదర్శకంగా సేవలు అందుతున్నాయి. రైతులు అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేదు. అరగం టలోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తిచేసి పట్టా పాస్‌బుక్, రిజిస్ట్రేషన్ పత్రాలు అందున్నాయి. సమయం వృథా కాదు. ఎవరి చుట్టూ తిరిగే పని లేదు. ధరణి వచ్చాకే రైతు బంధు, రైతు బీమా వచ్చి అండగా నిలుస్తున్నాయి. భూమిని అమ్మాల న్నా, కొనాలన్నా ఇబ్బందులు తొలిగినయ్. పైరవీలు లేకుం డా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయ్. భూ సమస్యలకు ధరణితో చెక్ పడింది. అనవసరంగా విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నా యి. ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తే రైతుల బతుకులు ఆగమవు తాయి. భూ రికార్డుల భద్రంగా ఉన్నాయి. గతంలో భూము లు వివరాలు తెలుసుకోలంటే అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ధరణితో కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగకుండా రైతుల వివరాలను ఆన్లైన్లో సులువుగా చూసుకునే వీలు కలిగింది.
– తేలు తిరుపతి, రైతు, భూత్కుర్.
ఉట్నూర్ రూరల్, నవంబర్ 20 : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి వల్ల మా భూములకు భరోసా కలిగింది. మా పేరిట ఉన్న భూమి మేము సంతకం, వేలు ముద్ర పెడితే తప్పా ఇంకొకరికి మార్పుకాదు. ఇది చాలా మంచిది. గతంతో ఎవరి అనుమతి లేకుండా ఒకరి భూమి మరొకరికి ఇష్టారాజ్యంగా మార్పు చేసేవారు. ఇప్పుడు అలా లేదు. మేము ఉన్నన్ని రోజులు మా భూమి ఇంకొకరికి పోదు అనే భరోసా కలిగింది. ధరణిలో ఎప్పుడైతే అప్పుడు చూసుకోవచ్చు. దీని ప్రకారమే రైతుబంధు కూడా నేరుగా మా ఖాతాలో జమ అయిపో తోంది. ఎవరు ఎన్ని చెప్పినా ధరణి వల్ల మంచి జరిగిందే తప్పా చెడు జరుగలేదు. దీనిని తొలిగించకుండా ఇలాగే కొనసాగించాలే.
– జాడి లింగన్న, రైతు, గంగన్నపేట్.
లక్ష్మణచాంద, నవంబర్ 20 : కాంగ్రెసోళ్లు ధరణిని తీసేస్తమం టున్నరు. ధరణి పోర్టల్ వచ్చిన సంది ఒకే దగ్గర రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అయిపోతున్నది. రైతులకు తిరుగుడు తిప్పల తప్పింది. ధరణిని రద్దు చేస్తే రైతులు రిజిస్ట్రేషన్ ఆఫీస్‌ల వెంబడి తిరగాలే. వీఆర్వోలు, పట్వారీల వెంబడి తిరుగాలే. అయినా పని కాదు. ముందు రైతులు ఆఫీసుల వెంబడి తిరగాల్సి వచ్చేది. అయినా పని అయ్యేది కాదు. ఇప్పుడు కేసీఆర్ సారు ముఖ్యమంత్రి అయినంక రైతుల అవస్థలు పోయినవి. కాంగ్రెస్ సర్కారు వస్తే రైతుల తిప్పలు మళ్ల సురు అవుతయ్. పటేల్, పట్వారీ వ్యవస్థ తెస్తామంటున్నరు. రైతులు బ్రోకర్ల వెంబడి, పటేల్, పట్వారీల వెంబడి తిరిగి లంచాలు ఇవ్వాల్సి వస్తది. ఇప్పుడు పటేల్, పట్వారీ వ్యవస్థ ఎందుకు. వారితో ఏం పని. సక్కగ నడుస్తున్న పనిని కుంటుపడనీయడానికి కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది.
– వై.రాజారెడ్డి, ధర్మారం, లక్ష్మణచాంద మండలం.
లక్ష్మణచాంద, నవంబర్ 20 : కాంగ్రెసోళ్లు ధరణిని రద్దు చేస్తామంటున్నరు. పాత పటేల్ పట్వారీ వ్యవస్థను తెస్తమంటున్నరు. భూముల సమస్యలు తీరలేక అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ల వీఆర్వోల వెంబడి కాళ్లరిగేలా తిరిగితిమి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంక ధరణిని తీసుకురావడంతో రైతుల బాధలు తప్పినవి. కాంగ్రెస్ గవర్నమెంట్ల భూ సమస్యలకు వీఆర్వోలు, దళార్ల వెంబడి తిరగడానికే బతుకులు సరిపాయే. ఇప్పుడు రైతులు ప్రశాంతంగా ఉంటున్నరు. గప్పటి పరిస్థితి మళ్లీ తెస్తే భూముల పట్టాలు ఆగమైతవి. పాతోళ్లకు పట్టాలు ఇస్తమంటరు. వారికి పట్టాలిస్తే మా బతుకులు ఏం కావాలే. లేని పంచాయితీలు పెంచడానికేనా మీకు ఓటేసేది. రిజిస్ట్రేషన్ దగ్గర, మ్యుటేషన్ దగ్గర లంచం ఇచ్చే పరిస్థితి ఉండేది.
రిజిస్టేషన్ చేసుకున్నార వీఆర్వోలకు, ఎంఆర్వోలకు పైసలు ఇవ్వకుంటే పట్టా అయ్యేది కాదు. వీఆర్వోలు, ఎంఆర్వోల దయ మీద పట్టాలు ఆధారపడేవి. డబ్బులిచ్చినా కొన్నేండ్లకు పట్టాలు వచ్చేవి. మా ఊర్లో అప్పట్లో భూమికొన్న వారికి మ్యుటేషన్ చేస్తామని లంచాలు తీసుకున్న వీఆర్వోలు 7వ నంబరు ఫారం రాయకుండానే పట్టా పాస్‌బుక్‌లు ఇచ్చిరి. ఇప్పుడు ఆన్లైన్లో చూస్తే అమ్మినవారి పేరే ఉండే. ముఖ్యమంత్రి కేసీఆర్ సారు వచ్చినంక ఆ సమస్యలు తీరిపాయే. గిప్పుడు కాంగ్రేసోళ్లు మల్లా పాత పద్ధతి తేస్తామంటున్నరు. వారి కల్లబొల్లి మాటలు నమ్మి చేతుకు ఓటేస్తే రైతుల పరిస్థితి వీఆర్వోలు, ఎంఆర్వోల చేతులు తడపడానికి సరిపోతది. పట్టా పుస్తకంలో కౌలు రైతుల పేర్లు ఇస్తే కౌలు రైతులు, పట్టా రైతుల పంచాయితీ మొదలైతది. రైతులు ప్రశాంతంగా ఉండడం కాంగ్రెసోళ్లకు ఇష్టం లేనట్లు ఉన్నది.
– గుర్రం బొర్రన్న, పీచర, లక్ష్మణచాంద మండలం.
సారంగాపూర్, నవంబర్ 20 : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి పథకాన్ని రద్దు చేసి భూమాత పోర్టల్‌ను ప్రవేశపెట్టడం మూలంగా రైతులకు తీవ్ర నష్టం జరుగుతది. భూమాత ప్రవేశపెడితే మళ్లి పట్వారీ వ్యవస్థ వస్తది. దీంతో రైతుల భూముల్లో పట్వారీలు అవకతవకలకు పాల్పడి అసలైన రైతులకు వేరే రైతులకు పట్టామార్పిడి చేయడం మూలంగా రైతు నష్టపోతాడు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణి మూలంగా అసలైన రైతుకు భూమి చెందుతది. ధరణి ఉంటేనే రైతులు సంతోషంగా ఉంటరు.
– బాబన్న, రైతు, జామ్