జన్నారం, జనవరి 5 : కవ్వాల్ టైగర్ రిజర్వ్డ్ ఫారెస్ట్‌లో జన్నారం డివిజన్ తాళ్లపేట రేంజ్‌లోని మాకులపేట, ఇందన్‌పెల్లి రేంజ్‌లోని ఘనిశట్టి కుంట ప్రాంతాల్లో ఆదివారం ‘బర్డ్‌వాక్ ఫెస్టివల్’ నిర్వహించారు. జన్నారం, ఇందన్‌పెల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారులు సుష్మారావు, కారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన 15 మంది పర్యాటకులు, వారి కుటుంబ సభ్యులను సఫారీలో అడవిలోకి తీసుకెళ్లి వివిధ ప్రాంతాలను చూయించారు. ఈ సందర్భంగా కింగ్ ఫిషర్, కామన్ ఫిష్ ఈగల్, తండర్ కింగ్‌ఫిషర్, సర్పంట్ఈగల్తో పాటుగా మరో 16 రకాల పక్షులను పర్యాటకులు గుర్తించి కెమెరాల్లో చిత్రీకరించారు. పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా వసతులు కల్పించినట్లు జన్నారం రేంజ్ ఆఫీసర్ సుష్మారావు తెలిపారు.
Adilabad
200 అరుదైన పక్షులను గుర్తించాను..
నాకు పక్షులంటే చాలా ఇష్టం. 15 సంవత్సరాలుగా కవ్వాల్ అడవుల్లో అరుదైన పక్షులపై అధ్యయనం చేస్తున్న. ఇప్పటి వరకు 200 అరుదైన పక్షులను గుర్తించిన. ఎక్కడ బర్డ్‌వాక్ జరిగినా వెళ్తాను. హైదరాబాద్‌లో దూలపెల్లి అకాడమీ నుంచి శిక్షణ కోసం వచ్చే ఎఫ్‌బీవోలు, సెక్షన్, ఎఫ్ఆర్వోలకు పక్షులు, వన్యప్రాణులపై అవగాహన కల్పిస్తున్న.
-లింగంపెల్లి కృష్ణ, పక్షుల ప్రేమికుడు, ఆదిలాబాద్
కవ్వాల్కు మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది
కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అరుదైన పక్షులకు నిలయంగా ఉన్నాయి. ఎటు చూసినా దట్టమైన అడవి..వివిధ వృక్ష జాతులు, వన్యప్రాణులతో పాటు ఎన్నో రకాలు పక్షులున్నాయి. పక్షుల కిలకిల రాగాలు ఆనంద భరితంగా ఉన్నాయి. అధికారుల సహకారం బాగున్నది. కవ్వాల్ అడవికి మళ్లీ మళ్లీ రావాలనిపిస్తున్నది.
– సైఫ్ మహ్మద్, పక్షుల పేమికుడు, కరీంనగర్
చెన్నూర్ రేంజ్లో ఆకట్టుకున్న బర్డ్‌వాక్
చెన్నూర్ రూరల్/భీమారం జనవరి 5: చెన్నూర్ రేంజ్‌లోని కిష్టంపేట, భీమారం, బూరుగుపల్లి అటవీ ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో బర్డ్ వాక్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. శనివారం సాయంత్రం కిష్టంపేటలోని అంబేద్కర్ ఎకో టూరిజం పార్కులో పర్యాటకులు రిజిస్ట్రేషన్ చేసుకొని రాత్రి క్యాంప్ ఫైర్ నిర్వహించారు. ఆదివారం ఉదయం 5 గంటలకు సఫారీ వాహనాల్లో బూరుగుపల్లి సమీపంలో గొల్లవాగు ప్రాజెక్టుకు చేరుకొని బర్డ్ వాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ రకాల పక్షులను గుర్తించి తమ కెమెరాల్లో ఫొటోలు తీసుకున్నారు. అక్కడి నుంచి కిష్టంపేట అర్బన్ పార్కుకు చేరుకొని సీతాకోక చిలుకలను వీక్షించారు.