నెరవేరనున్న రైతన్నల చిరకాల వాంఛ
ఎత్తిపోతల టెండర్ల ప్రకటనపై సంబురాలు
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతగా భారీ ర్యాలీ
పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతన్నలు
పటాకులు పేల్చి.. మిఠాయిలు పంచుకుని..
రైతుబాంధవుడి చిత్రపటానికి పాలాభిషేకం
చెన్నూర్, మార్చి 8 : మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ సిగలో మరో జల నగ చేరింది. అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ సమావేశాల్లో సోమవారం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి టెండర్లు పిలుస్తామని ప్రకటించారు. ఏడు దశాబ్దాల కల కండ్ల ముందు సాక్షాత్కరించనుండడంతో రైతన్నల సంబురాలు అంబరాన్నంటాయి. కాళేశ్వరం నుంచి గోదారి జలాలు పరవళ్లు తొక్కుకుంటూ రానుండడంతో ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని, పసిడి పంటలు పండుతాయని రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదేశాల మేరకు.. సెగ్మెంట్లో సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతగా ర్యాలీ నిర్వహించారు. చెన్నూర్, క్యాతన్‌పల్లి, మందమర్రి మున్సిపాలిటీలతోపాటు, కోటపల్లి, భీమారం, జైపూర్, మందమర్రి మండలాల నుంచి భారీ సంఖ్యలో రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు తరలివచ్చారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి.. స్వీట్లు పంచుకున్నారు. పటాకులు పేలుస్తూ డప్పుచప్పుళ్ల మధ్య భారీ ర్యాలీ తీసి, ధన్యవాదాలు తెలిపారు.
చెన్నూర్ నియోజకవర్గ రైతన్నల చిరకాల వాంఛ నెరవేరుస్తూ చెన్నూర్ సిగలో మరో నగను సీఎం కేసీఆర్ చేర్చారు. ఇందుకుగాను చెన్నూర్ నియోజకవర్గ రైతులకు కాళేశ్వరం ఎత్తి పోతల పథకాన్ని ముఖ్యమంత్రి గిఫ్ట్‌గా ఇచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో సోమవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో అన్నదాతలకు రైతు బాంధవుడు తీపికబురు అందించారు. నియోజకవర్గ భూములను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సాగు నీరందించే చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి (చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం) త్వరలో టెండర్లు పిలిచి, పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. దీంతో చెన్నూర్ నియోజకవర్గంలోని రైతులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ సంబురాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపు మేరకు చెన్నూర్‌లో మంగళవారం సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతా ర్యాలీ తీశారు. నియోజకవర్గంలోని చెన్నూర్, క్యాతన్‌పల్లి, మందమర్రి మున్సిపాలిటీలతో పాటు, చెన్నూర్, కోటపల్లి, భీమారం, జైపూర్, మందమర్రి మండలాల నుంచి పెద్ద ఎత్తున రైతులు, ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ఈ ర్యాలీకి తరలి వచ్చారు.
ముందుగా సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. స్వీట్లు పంచుతూ, పటాకులు పేలుస్తూ, డప్పుచప్పుళ్లతో పట్టణంలోని ప్రధాన రహదారుల్లో సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతా ర్యాలీ తీసి, ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రైతాంగానికి రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ, సకాలంలో ఎరువులు, విత్తనాలు, ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. చెన్నూర్ ఎత్తిపోతల పథకం ద్వారా తమ బీడుభూములకు నిరంతరాయంగా సాగు నీరు అందనుందని సంతోషం వ్యక్తం చేశారు.
రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ ఎల్లప్పుడు మద్దతుగా నిలుస్తామన్నారు. చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ర్యాలీలో చెన్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల సమ్మయ్య, కోటపల్లి వైస్ ఎంపీపీ వాలా శ్రీనివాస్ రావు, ఎంపీపీ మంత్రి బాపు, జడ్పీటీసీ తిరుపతి, నియోజకవర్గంలోని రైతులు, మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, రైతు బంధు కమిటీల చైర్మన్లు, సభ్యులు, సింగల్ విండో చైర్మన్లు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం
నార్నూర్,మార్చి8: మండల కేంద్రంలోని కుమ్రం భీం కాంప్లెక్స్‌లో ఆదివాసీ నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి మంగళవారం పాలాభిషేకం చేశారు. ఆదివాసీల ఆరాధ్య దైవమైన పెర్సపేన్ ఆలయ నిర్మాణానికి నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తంచేశారు. నిధులు మంజూరు చేసేలా అహర్నిశలు కృషి చేసిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తొడసం నాగోరావ్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు యుర్వేత రూప్‌దేవ్, రాయిసెంటర్ జిల్లా సార్మేడి మెస్రం దుర్గుపటేల్, ఎంపీపీ తనయుడు కనక ప్రభాకర్, జామడ సర్పంచ్ మడావి ముక్తా రూప్‌దేవ్, సహకార సంఘం డైరెక్టర్ దుర్గే కాంతారావ్, సుర్పం నాగోరావ్, సయ్యద్ ఖాసీం, మాజీ ఎంపీటీసీ రాథోడ్ రమేశ్ ఉన్నారు.