మంచిర్యాల, మార్చి 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : “మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్ విస్తరణలో భాగంగా జైపూర్ మండలంలోని దుబ్బపల్లిలో చేసిన భూసేకరణలో భారీగా అక్రమాలు జరిగాయి. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం చేసిన సోషల్ ఎకనామిక్ సర్వేలో అనర్హులకు చోటు కల్పించారు. దుబ్బపల్లిలో మొత్తం 168 ఇండ్లు ఎక్స్టెన్షన్లో పోతుంటే కేవలం 103 ఇండ్లకే పరిహారం అందించారు. ఇండ్లు పోతున్న వారిని కాదని నాన్ లోకల్స్ పేర్లను లిస్టులో చేర్చి వారికే పరిహారం అందేలా చేశారు. ఇందుకోసం ఒక్కో ఇంటికి రూ.50 వేల నుంచి రూ.లక్ష దాకా.. ఇలా రూ.50 లక్షలకు పైచిలుకు వసూలు చేశారు. మంచిర్యాలలో ఆర్డీవో ఆఫీసులో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేసిన కమల్‌సింగ్ మొత్తం వ్యవహారాన్ని దగ్గరుండి నడిపించి, పాత ఆర్డీవో వేణుకు ముడుపులు అందజేశారు” అని బాధితులు హైదరాబాద్ ప్రజావాణిలో సీఎం రేవంత్‌రెడ్డి పేరుతో ఫిర్యాదు చేశారు. పాత ఆర్డీవోకు సంబంధించి 13 అంశాలపై 150 పేజీల ఫిర్యాదు కాపీని ‘నమస్తే తెలంగాణ’కు అందజేశారు. అలాగే తాళ్లపల్లి గ్రా మంలో ఓసీపీ కోసం భూములు సేకరించినప్పుడు 225 మంది మేజర్స్ అని చెప్పి అక్రమంగా పరిహారం చెల్లించారన్నారు. కాకపోతే భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో వారంతా మైనర్లు అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పునరావాస కాలనీల్లో హౌస్‌సైట్స్ కేటాయింపుల్లోనూ 11మంది అనర్హులకు స్థలాలు ఇచ్చారని, అలాగే ఇంటి పెరిట స్థలాల నష్టపరిహారాన్ని పట్టాదారులతో సంబంధం లేకుండా వేరే వారికి ఇచ్చి 60 శాతం కమిషన్ తీసుకున్నారని ఆరోపించారు. అన్నారం బ్యారేజీ భూసేకరణ కోసం 2019లో అవాైర్డెన భూములకు నిబంధనలకు విరుద్ధంగా సబ్ అవార్డు చేశారన్నారు. అంతటితో ఆగకుండా ఇరిగేషన్ అధికారులతో కలిసి థర్డ్ పార్టీలతో కుమ్మకై సదరు భూముల్లో బోర్‌వెల్స్, పైప్లైన్లు ఉన్నట్లు చూపించి పెద్ద ఎత్తున నిధులు మళ్లీంచుకున్నారన్నారు. అలాగే వివాదాల్లో ఉన్న భూములను పాత ఆర్డీవో వదల్లేదని ఫిర్యాదులో ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఇందారం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎల్లారం శివారులోని సర్వే నంబర్ 43లో 13.06 ఎకరాల భూమిపై కోర్టులో కేసు ఉండడంతో అంతకు ముందున్న ఆర్డీవో రమేశ్ నష్టపరిహారం చెల్లింపులు నిలిపివేశారు. కానీ.. ఆర్డీవో దాసరి వేణు వచ్చాక అపోజిట్ పార్టీలకు పరిహారం చెల్లించి కమీషన్లు అందుకున్నారని ఆరోపించారు. టేకుమట్ల శివారులోని 516 సర్వే నంబర్లో 2.16 ఎకరాలు ఏడీసీసీబీలో 14 ఏండ్ల నుంచి మార్టిగేజ్లో ఉంది. అందుకని వారికి పరిహారం చెల్లించొద్దని బ్యాంక్ అధికారులు భూసేకరణ సమయంలోనే హైకోర్టును ఆశ్రయించారు. కానీ.. వారి నుంచి కమీషన్లు తీసుకుని విషయం కోర్టులో ఉన్నా పట్టించుకోకుండా నష్టపరిహారం చెల్లించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి వరకు ఫిర్యాదు వెల్లడంతో ఇందారం, శ్రీరాంపూర్ ఓసీపీ భూసేకరణల్లో జరిగిన అక్రమాలపై స్టేట్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ సీరియస్‌గా ఆరా తీస్తున్నది. పాత ఆర్డీవో దాసరి వేణు, డిప్యూటీ తహసీల్దార్ కమల్సింగ్పై వచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వాలని కలెక్టర్ బదావత్ సంతోష్‌ను కోరింది. దీనిపై అదనపు కలెక్టర్ బి.రాహుల్‌ను విచారణ అధికారిగా నియమించినట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. వీరిచ్చే ప్రాథమిక రిపోర్టు ఆధారంగా విజిలెన్స్ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న పాత ఆర్డీవో వేణు ప్రస్తుతం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ)గా పని చేస్తున్నారు. ఈ విషయమై ఆయనను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్ ఆన్సర్ చేయలేదు. కాగా.. ఈ ఆరోపణలన్నీ నిజమని తేలితే ఆయా ప్రాంతాల్లో గతంలో పని చేసిన ఎంఆర్వోలు, సింగరేణి అధికారులపైనా చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.