నిర్మల్(నమస్తే తెలంగాణ)/మంచిర్యాల టౌన్, నవంబర్ 15 : కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఏది కొందామన్నా పిరం పలుకుతున్నాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతున్నది. యేటా కార్తీక మాసంలో కూరగాయల ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. దీనికితోడు ఈ వానకాలంలో భారీ వర్షాలు కురియడంతో చాలా చోట్ల కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి.
చేతికొచ్చే దశలో ఉన్న కూరగాయలు, ఆకుకూరల దిగుబడిపై మొంథా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ప్రస్తుతం ఏ కూరగాయల ధర చూసినా కిలో రూ.80 నుంచి రూ.150 వరకు పలుకుతున్నది. ధరల పెరుగదలతో ఒక్కో కుటుంబంపై నెలకు రూ.1000 వరకు భారం పడుతున్నది. మంచిర్యాల, నిర్మల్, ఖానాపూర్, భైంసా పట్టణాల్లోని కూరగాయల మార్కెట్లకు సమీప గ్రామాల నుంచి రోజూ రైతులు కూరగాయలు తెచ్చి విక్రయిస్తుంటారు.
కొంతమంది రైతులు నేరుగా ప్రజలకు అమ్ముతుండగా.. మరికొందరు వేకువజామునే మార్కెట్‌కు వచ్చి మధ్య దళారులకు విక్రయించి వ్యవసాయ పనుల కోసం వెళ్తుంటారు. అయితే ఈ దళారుల కారణంగా కూడా ధరలు రెట్టింపవుతున్నాయని చెబుతున్నారు. నిర్మల్‌లోని ప్రధాన కూరగాయల మార్కెట్లో దళారులదే రాజ్యం అన్నట్లుగా దందా యథేచ్చగా సాగుతున్నది. కొంతమంది బడా వ్యాపారులు నిర్ణయించిన ధరలే మార్కెట్లో చలామణి అవుతున్నాయి.
ప్రస్తుతం స్థానికంగా డిమాండ్‌కు సరిపడా కూరగాయలు అందుబాటులో లేకపోవడంతో ఇక్కడి వ్యాపారులు దూరప్రాంతాల నుంచి తెప్పిస్తున్నారు. ఈ కారణంగానే ధరలు అమాంతం పెరిగాయని అంటున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు పప్పు దినుసులతోనే సరిపెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. మంచిర్యాల జిల్లాలోని మార్కెట్‌కు ఛత్తీస్‌గఢ్, మహా రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్,మన రాష్ట్రంలోని హైదరాబాద్ నుంచి కూరగాయలు దిగుమతి అవుతుంటాయి.
ధరలు మండిపోతున్నయి..
మంచిర్యాల మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నయి. ఏం కొనే పరిస్థితి లేదు. ఏది చూసినా కిలోకు రూ. 100 చెబుతున్నరు. అడిగితే మాకే పడటం లేదంటున్నరు. పల్లెటూర్ల నుంచి వచ్చి అమ్ముకునే వారు కూడా రేట్లు బాగానే చెబుతు న్నరు. ధరలు ఇలాగే ఉంటే సామాన్యులు బతుకుడు కష్టమే. కూరగాయల ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది.
– పద్మావతి, మంచిర్యాల
వర్షాలతో దిగుబడి తగ్గింది..
యేటా వానకాలంలో నాకున్న మూడెకరాల్లో కూరగాయలు సాగు చేస్త. ఈసారి కూడా టమాట, వంకాయ, బెండకాయ, కొత్తిమీర వేసిన. భారీ వర్షాలతో ఆశించిన దిగుబడి రాలేదు. పెట్టుబడి ఖర్చులు మీద పడ్డయ్. నాతోపాటు మా గ్రామానికి చెందిన చాలా మంది రైతులు నష్టపోయారు. పల్లెల్లో కూరగాయలు లేకుండా అయినయ్. మా అవసరాల కోసం నిర్మల్‌కు వెళ్లి తెచ్చుకుంటున్నం. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు.
– శ్రీనివాస్‌రెడ్డి, రైతు, సిద్దులకుంట
ధరలు విపరీతంగా పెరిగినయి
20 రోజుల కిందటి వరకు కూరగాయలు కొంచెం తక్కువ ధరలోనే దొరికాయి. ఈ వారం పది రోజుల నుంచి విపరీతంగా పెరిగాయి. ఏది కొందామన్నా కిలో రూ.100కు పైనే ఉంది. గల్లీలు, రోడ్ల పక్కన పెట్టి అమ్మే వారి దగ్గర ఇంకా ఎక్కువకు కొనాల్సి వస్తున్నది. ఏటా ఈ సీజన్లో ఇంత ధరలు ఎప్పుడూ చూడలేదు. ఎండాకాలంలో ఉండే ధరలు ఇప్పుడు పలుకుతున్నయ్. ఇలాగే ఉంటే రోజు కూలీ చేసుకొని బతికే మాలాంటోళ్లకు కష్టమే. పచ్చళ్లు, పప్పులతోనే సరిపెట్టుకుంటున్నం. రైతు బజార్లలో తక్కువ ధరలకు కూరగాయలు అమ్మేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– సాయిలు, రాంనగర్
మంచిర్యాలలో కూరగాయల ధరలు(కిలో రూ.)
కొత్తిమీర : 160
పాలకూర : 120
చిక్కుడు : 100
బెండకాయ : 100
తోటకూర : 100
బీరకాయ : 80
వంకాయ : 80
కాకర : 80
క్యాబేజీ : 80
దొండ : 80
అల్సింత : 80
క్యారెట్ : 80
క్యాప్సికం : 80
సోరకాయ : 60
టమాట : 50
పచ్చిమిర్చి : 50