దహెగాం, అక్టోబర్ 26 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం గెర్రె గ్రామంలో ఆదివాసీ గర్భిణి తలండి శ్రావణిది ముమ్మాటికి కుల ఉన్మాద హత్యేనని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.తిరుపతయ్య అన్నారు. మానవ హక్కుల వేదిక బృందంతో కలిసి ఆదివారం గెర్రె గ్రామంలోని శ్రావణి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతయ్య మాట్లాడుతూ ఆధునిక కాలంలో కూడా కులాలు, మతాల కారణంగా హత్యలు జరగడం శోచనీయమన్నారు.
శ్రావణి తొమ్మిది నెలల గర్భిణి కావడం..బిడ్డకు జన్మనిస్తే ఆమెను అడ్డుతొలగించుకోవడం సాధ్యం కాదని పథకం ప్రకారమే శ్రావణి భర్త శివార్ల శేఖర్ అతని తండ్రి శివార్ల సత్తయ్య మిగతా కుటుంబ సభ్యులతో కలిసి అతి కిరాతకంగా హత్యచేశారని ఆరోపించారు. ముఖ్యంగా ప్రేమ పేరుతో యువతులను కులాంతర వివాహాలు చేసుకొని హత్యలు చేస్తున్న సంఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఇలాంటి హత్యల విషయంలో ప్రభుత్వం స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి నిందితులకు సాధ్యమైనంత త్వరగా కఠినంగా శిక్షించాలన్నారు. శ్రావణి కుటుంబానికి న్యాయ, ఆర్థికపరంగా సహాయాన్ని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎఫ్స్వోపై చర్యలు తీసుకోవాలి
ఇటీవల ఒడ్డగూడకు చెందిన పశువుల కాపర్లు బుజాడి రామయ్య, బామండ్లపల్లి భూషయ్యపై దాడిచేసిన అటవీశాఖ అధికారి(ఎఫ్ఎస్వో) సద్దాంపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.తిరుపతయ్య బృందం డిమాండ్ చేశారు. ఆదివారం ఒడ్డుగూడలోని పశువుల కాపరి బుజాడి రామయ్య ఇంటికి వెళ్లి ఆయనతో దాడి వివరాలను తెలుసుకున్నారు. అమాయకులైన పశువుల కాపరులపై అటవీ అధికారులు దాడిచేయడం హేయనీయమన్నారు. దాడి చేసిన ఎఫ్ఎస్వోపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ఎఫ్ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు సుజాయిత్ ఖాన్, రాష్ట్ర సభ్యులు ఎండీ అన్వర్, కే బక్కయ్య, వీ దిలీప్, ఎస్ అచ్యుత్‌కుమార్ పాల్గొన్నారు.