నిర్మల్, జూన్ 11(నమస్తే తెలంగాణ) : వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న జనగణనకు సన్నాహకంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన ఇండ్ల లెక్కింపు ప్రక్రియ ఈనెల 9వ తేదీతో పూర్తయింది. గత నెల 11వ తేదీ నుంచి ఈ నెల 9వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో మొత్తం 2,14,686 ఇండ్లు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో పట్టణాల్లో 49,968, పల్లెల్లో 1,64,718 ఇండ్లు ఉన్నట్లు తేల్చారు. ఈ ప్రక్రియలో మొత్తం 1405 మంది ఎన్యుమరేటర్లు క్షేత్రస్థాయిలో పాల్గొనగా, వారి పనితీరును 242 మంది సూపర్వైజర్లు పర్యవేక్షించారు.
ప్రతి గృహాన్ని కవర్ చేసేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఆన్లైన్ ద్వారా తమ వివరాలు తెలియజేసేందుకు సెల్ఫ్ ఎన్యుమరేషన్కు కూడా అధికారులు అవకాశం కల్పించారు. గత ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు జిల్లాలోని చాలామంది విద్యావంతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ప్రస్తుతం పూర్తయిన ఇండ్ల గణన ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అధికారిక సెన్సస్ ప్రారంభించనున్నారు. జనాభా వివరాలు, కుటుంబ నిర్మాణం, గృహ సౌకర్యాల అంశాలపై సమగ్ర డేటా సేకరించేందుకు ఇది పునాదిగా ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.
పట్టణాల్లో 49,968 ఇండ్లు
జన గణనలో భాగంగా పట్టణాల్లో 49,968 గృహాలుండగా, 1,88,369 మంది జనాభా ఉన్నట్లు గుర్తించారు. అలాగే పల్లెల్లో 1,64,718 ఇండ్లు ఉండగా, 6,06,300 జనాభా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అందులో నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో 28,917 గృహాలు, భైంసా మున్సిపాలిటీ పరిధిలో 12,172, ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 8,879 ఇండ్లు ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల పరిధిలో మొత్తం జనాభా 1,88,369 మంది ఉన్నారు. ప్రస్తుతం హౌస్ లిస్టింగ్ ప్రక్రియ పూర్తికాగా, 2027 ఫిబ్రవరి నుంచి దేశ వ్యాప్తంగా డిజిటల్ పద్ధతిలో జనగణన జరగనున్నది. మరోసారి ఇంటింటికీ వెళ్లి పూర్తి వివరాలను యాప్లో నమోదు చేయనున్నారు. పల్లెల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోతే ఆఫ్లైన్లో జనగణన వివరాల నమోదుకు అవకాశం కల్పించారు.
29 శాతం పెరిగిన కుటుంబాలు
2011 జనాభా లెక్కలతో పోల్చితే ప్రస్తుతం జిల్లాలోని కుటుంబాల సంఖ్య 29 శాతం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. అలాగే జనాభా 12 శాతం పెరిగింది. 2011లో జిల్లా వ్యా ప్తంగా మొత్తం 1,65,763 కుటుంబాలు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 2,14,686కు చేరింది. అలాగే 2011 సెన్సస్ ప్రకారం జిల్లా జనాభా 7,09,418 ఉండగా, ప్రస్తుతం 7,94,669కి చేరింది. అయితే పట్టణాల్లో మాత్రం 2011తో పోల్చితే కుటుంబాల సంఖ్య ప్రస్తుతం దాదాపు మూడింతలు పెరిగింది. 2011లో నిర్మల్, ఖానాపూర్, భైంసా పట్టణాల్లో 18,274 ఇండ్లు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 49,968కి చేరింది. ఆయా పట్టణాల్లో 2011లో 1,56,457 మంది జనాభా ఉండగా, ప్రస్తుత జనాభా 1,88,369కి చేరింది. ఇదిలా ఉంటే పల్లెల్లో 2011 లెక్కల ప్రకారం 1,47,489 ఇండ్లు ఉండగా 5,52,961మంది జనాభా ఉన్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 1,64,718 కుటుంబాలు ఉన్నట్లు తేల్చారు. ఆయా కుటుంబాల్లో మొత్తం 6,06,300 మంది జనాభా ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.