ఇంద్రవెల్లి, ఫిబ్రవరి17: కేంద్రప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సర్వోదయ సంస్థాన్ ఆధ్వర్యంలో భూదాన్ పోచంపల్లి నుంచి మహారాష్ట్రలోని సేవాగ్రామ్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఆల్ ఇండియా రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ అధ్యక్షురాలు మీనాక్షి నటరాజన్ తెలిపారు. మండలంలోని అమరవీరుల స్తూపం వద్ద మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి గురువారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. దేశంలో ఉన్న పేదలకు న్యాయం జరిగే దాకా పోరాటాలు చేస్తామని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను మోసగిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ కన్వీనర్ రాజమల సిద్ధేశ్వర్, టీపీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్, ఉట్నూర్ జడ్పీటీసీ చారులత, జిల్లా నాయకులు వెడ్మ బొజ్జు, జాదవ్ నరేశ్, మీర్జా యాకుబ్‌బేగ్, సోమోరే నాగోరావ్, వెంకట్రావ్, ఎండీ జహీర్, విశాల్, తులసీరాం పాల్గొన్నారు.