తాండూర్, ఆగస్టు 18 : మండలంలోని గిరిజన గ్రామాల పరిధిలో హై లెవెల్ వంతెనలు, రోడ్ డ్యాంలు నిర్మించాలని ఆదివాసీ సంఘం నాయకులు డిమాం డ్ చేశారు. సోమవారం తాండూర్ తహసీల్ కార్యాలయం ఎదుట వారు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ మండలాధ్యక్షుడు కుర్పెంగ బాబురావు మాట్లాడుతూ సింగరేణి చెక్‌పోస్ట్ నుంచి నర్సాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాలకు వెళ్లే దారిలో భీమన్న వాగుపై ఒక హైలెవెల్ వంతెన, లచ్చుగూడ వద్ద మరో వంతెన నిర్మించాలని కోరారు.
వర్షాల వల్ల దెబ్బతిన్న కల్వర్టులు, రోడ్లు తక్షణమే బాగు చేయాలని డిమాండ్ చేశారు. వరదలు వచ్చినప్పుడు తాత్కాలిక చర్యలతో సరిపెట్టడం వల్ల గిరిజనులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై అధికారులు వెంటనే స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోయం సురేశ్, నైతం సోము, ఎల్ముల శ్రీను, సోయం పర్వాత్రావు, జంగు, కుర్సెంగ లచ్చు, తొడసం జోగు, సోయం మోతీరాం, తుడుందెబ్బ, రాయిసెంటర్, నాయక్‌పోడ్, కోలాం, కొలవార్, తోటి అనుబంధ సంఘాల ఆదివాసులు పాల్గొన్నారు.