మంచిర్యాల, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘ఓజీ’ సినిమా టికెట్ ధరలను పెంచుకోడానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. గురువారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టికెట్లు బెనిఫిట్ షోలకు రూ.800, వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.150 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. కాగా ప్రభుత్వం ఇచ్చిన ఈ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ హైకోర్టు జస్టిస్ ఎన్వీ శ్రావణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
బుధవారం మధ్యాహ్నమే ఉత్తర్వులు వచ్చినప్పటికీ మంచిర్యాల జిల్లా కేంద్రంలో బెన్ఫిట్షోలు ప్రదర్శిస్తున్న ఎస్వీసీ సినిమాస్ జెమిని(లక్ష్మి), శ్రీనివాస థియేటర్లు బెనిఫిట్ షో టికెట్లను రూ.800లకు విక్రయించారు. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్‌లో ఈ థియేటర్లకు సంబంధించి ఒక్కో టికెట్ ధర రూ.800లకు బుక్ అయ్యింది. దీంతో హైకోర్టు చెప్పిన ఉత్తర్వులను పాటించని ఈ థియేటర్లపై చర్యలు తీసుకోవాలని సిని మా ప్రేమికులు కోరుతున్నారు.
టికెట్ ధరలు ఎక్కువ గా ఉండడంతో సినిమా చూడలేక మరో రోజుకు వాయి దా వేసుకున్నామంటూ కొందరు పవన్ కల్యాణ్ అభిమానులు వాపోతున్నారు. హై కోర్టు చెప్పినా ఓజీ సిని మా బెనిఫిట్ షో టికెట్‌కు రూ.800లకు విక్రయించిన విషయమై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సినీ థియేటర్ల కా ర్మికుల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణరావును వివరణ కోరగా.. టికెట్లు ఇప్పటికే ఇష్యూ అవ్వడంతో ఏం చేయలేమన్నారు. మంచిర్యాలలోనే కాకుండా చా లా చోట్ల ఇప్పటికే టికెట్లు విక్రయించారన్నారు.
సింగిల్ స్క్రీన్‌లో రూ.110 టికెట్లను సినిమా పడిన రోజు రూ.275కు విక్రయించుకోవచ్చన్న గతంలో ఇచ్చిన జీవో మేరకు రేపటి టికెట్ల ధరలు రూ.275 ఉంటాయన్నారు. కోర్టు పెంచడానికి అనుమతి నిరాకరించినా టికెట్ల ధరల విషయంలో థియేటర్ల నిర్వాహకులు కాంప్రమైజ్ కాకపోవడం గమనార్హం. దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాల్సి ఉంది.
మంచిర్యాల థియేటర్లకు నిబంధనలు పట్టవు..
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మల్టీ స్క్రీన్లు ఉన్న ఓ థియేటర్ నిబంధనలు పాటించడం లేదన్న విమర్శలున్నాయి. 2021లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు జీవో ఎంఎస్ నంబర్ 121 ప్రకారం.. సింగిల్ స్క్రీన్ ఉన్న థియేటర్లలో మాత్రమే వాహనాల పార్కింగ్ చార్జీలు తీసుకోవాలి.
టూ వీలర్ రూ.20, ఫోర్ వీలర్ రూ.30 తీసుకోవచ్చు. రెండు లేదా అంతకంటే ఎక్కువ స్క్రీన్లు ఉన్న థియేటర్లలో వాహనాల పార్కింగ్ ఫీజు తీసుకోడానికి వీలులేదు. కానీ మంచిర్యాల జిల్లా కేంద్రంలో మల్టీ స్క్రీన్లు ఉన్న ఓ థియేటర్ నిర్వాహకులు ఇవేవి పట్టించుకోవడం లేదు. విచ్చలవిడిగా పార్కింగ్ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇలా నిబంధనలు పాటించని థియేటర్లపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తున్నది.