కన్నెపల్లి/దండేపల్లి/కాసిపేట/తాండూర్/నెన్నెల, నవంబర్ 1 : మంచిర్యాల జిల్లాలో గురువారం రాత్రి నుంచి కురిసిన అకాల వర్షానికి పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. భీమిని మండలం వడాల గ్రామంలో విఠల్‌కు చెందిన ఎకరం వరి నేలకొరిగింది. అలాగే పలు గ్రామాల్లో తీయడానికి సిద్ధంగా ఉన్న పత్తి తడిసిముద్దయ్యింది. దండేపల్లి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో చేతికొచ్చిన పంట నేలకొరగడంతో రైతన్న కుదేలవుతున్నాడు. మామిడిపెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దమ్మన్నపేటకు చెందిన గడ్డం నాగమ్మ(31) పిడుగుపడి శుక్రవారం మృతిచెందింది. నాగమ్మ తన భర్త ప్రశాంత్‌తో కలిసి పత్తి చేనులో పనిచేస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడి నాగమ్మ స్పృహతప్పి పడిపోయింది.
స్థానికులు 108లో దవాఖానకు తరలించే లోపే మృతి చెందింది. ప్రశాంత్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కాసిపేట మండలంలో భారీ వర్షం పడగా, చాలాచోట్ల వరి పంట నేలకొరిగింది. మలేపల్లి, దేవాపూర్, పెద్దనపల్లి గ్రామాల్లో వర్షానికి దెబ్బ తిన్న పంటలను మండల వ్యవసాయాధికారి ప్రభాకర్, ఏఈవోలు దీప్తి, రమ్య పరిశీలించారు. తాండూర్ మండలంలో శుక్రవారం ఉదయం ఈదురు గాలులతో భారీ వర్షం పడింది. ఏరిడానికి సిద్ధంగా ఉన్న పత్తి నేలరాలింది. కూరగాయల నారుమడులు సైతం చెల్లాచెదురయ్యాయి. గోపాల్‌నగర్‌కు చెందిన రైతు శ్రీనివాస్‌కు చెందిన 5 ఎకరాల వరి నేలకొరగడంతో వ్యవసాయ విస్తరణ అధికారి శంకర్ పరిశీలించారు.
నెన్నెల మండల కేంద్రంలో రైతు సంఘం (ఏఐకేఎంఎస్) మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. రైతు సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శి కొండు బానేష్ మాట్లాడుతూ రెండు రోజులుగా కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల పంటలు నేలమట్టమై రైతన్నలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పంటనష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని, పత్తికి ఎకరాకు రూ. 40 వేలు, వరికి ఎకరాకు రూ. 20 వేలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గంట రైతు సంఘం మండల సహాయ కార్యదర్శి అనిల్ కుమార్, రైతు సంఘం గ్రామ కార్యదర్శి దుర్గం మొండయ్య, కొండు సాయి కుమార్, సునారర్ లింగయ్య, దుర్గం ఇస్తారి, మిరం పోశం, సాగర్, రాంటెంకి దేవయ్య, తాళ్లపల్లి లింగన్న, దుర్గం పోచమ్మ, మల్లేశ్, దుర్గం రాజం, సునరర్ శంకర్, దుర్గం పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.