ఉట్నూర్, ఆగస్టు 10 : ఏజెన్సీలోని ఆదివాసీ గూడేలు, తండాలు, పల్లెల్లో నివాసం ఉంటున్న ఆదివాసీ గిరిజనులు వంతెనలు, రహదారులు లేక దుర్భర జీవనం సాగిస్తున్నారు. వందలాది గ్రామాలకు రవాణా సౌకర్యం లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే అంతులేని కష్టాలను అనుభవిస్తున్నారు. భారీ వర్షాలతో వాగులు ఉప్పొంగడంతో మండల, పట్టణాలకు నిత్యావసరాలకు, వ్యవసాయ పనులకు వెళ్లాలంటే కష్టమవుతున్నది. పాము లు, తేళ్లతో సహవాసం చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో కొట్టుకుపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. శవాలను కూడా వాగులో తీసుకెళ్లేవారు. బండ్లను కూడా తమ భుజాలపై మోసుకుని పోయేవారు. రాపిడ్ ఫీవర్ సర్వేలు, వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వైద్య సిబ్బంది గ్రామానికి వెళ్లి ప్రజలకు వైద్యసేవలతోపాటు అవసరమైన వారికి మందులు పంపిణీ చేస్తుంటారు. ఇటువంటి సందర్భాలలో కూడా అవస్థలు పడుతున్నారు. కాగా. చాలా వంతెనలు, రహదారుల నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు పంపించారు. నిధులు రాకపోవడంతో నిలిచాయి. స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జును కలిసి వంతెన నిర్మాణానికి గిరిజనులు వినతులు సమర్పించారు. అయినప్పటికీ ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది.
ఆదిలాబాద్ జిల్లాలోని రూ.2.50 కోట్లతో ఉట్నూర్ మండలంలోని నర్సాపూర్(జే), గంగాపూర్ నుంచి వంకతుమ్మ వంతెన రూ.3.50 కోట్లు, ధర్మాజీపేట్ రూ. ఒక కోటి, చాందూరి నుంచి రాజుల వంతెన రూ.1.50 కోట్లు, కొమ్ముగూడ నుంచి కన్నాపూర్ వంతెనకు రూ.2 కోట్లు, ఇంద్రవెల్లి మండలంలోని అర్జుని, వడ్గావ్ నుంచి మోహన్తాండ వరకు రూ.3.50 కోట్లు, గాదిగూడ మండలంలోని చిత్తగూడ 50 లక్షలు, ఖాండ్వా నుంచి కట్టగూడ రూ.20 లక్షలు, మారుగూడ వంతెన రూ.3.50 కోట్లు, నార్నూర్ మండలంలోని బారిక్‌రావుగూడ వంతెనకు రూ.3.50 కోట్లు, గుండాల రోడ్డు నుంచి చిత్రగూడ రూ.70లక్షలు, సిరికొండ మండలంలోని కన్నాపూర్ తాండ రూ.3 కోట్లు, లెండిగూడ నుంచి ధర్మసాగర్ వరకు రెండు వంతెనలు రూ.60లక్షలు, ఆదిలాబాద్ మండలంలోని లోహర బీటీ రోడ్డు నుంచి చిలటిగూడ వంతెనకు రూ.20 లక్షలు, చిచ్దరి ఖానాపూర్ బీటీ రోడ్డు నుంచి లోకారి రూ.35 లక్షలు, మగ్లి వంతెనకు రూ.30 లక్షలు, గుడిహత్నూర్ మండలంలోని మచ్చపూర్ నుంచి ముత్నూర్ వంతెనలు రూ.35 లక్షలు, బెల్లూరి వంతెనకు 20 లక్షలు, బేల మండలంలోని రాయ్‌పూర్ వంతెనకు రూ.40 లక్షలు, బోథ్‌లోని పరుపులపల్లి రూ.35 లక్షలు, ఇచ్చోడ మండలంలోని లింగాపూర్ వంతెనలకు రూ. 40 లక్షలతో ప్రతిపాదనలు పంపారు. ఈ వంతెనలు నిర్మాణం పూర్తయితే గిరిజనుల కష్టాలు తీరనున్నాయి. ప్రతిపాదనలు పంపామని ఉట్నూర్ ఐటీడీఏ ఇంజినీరింగ్ ఈఈ తానాజీ తెలిపారు.
ఉట్నూర్ డివిజన్లోని వంకతుమ్మ వాగులో నీరు అధికంగా ఉంటే రాంజీగూడ, రాజుల మడుగు, ఎర్రగుట్ట, ఉమాపతికుంట, కన్నాపూర్, పిట్ల గూడేలు.. ఇక నర్సాపూర్(జే) అధికంగా పారితే దాటి చుట్టూ పక్క గ్రామాలైన భీంగూడ, ఆడగూడ, నర్సాపూర్(జే) గ్రామాల ప్రజలు దంతన్‌పెల్లి ఆసుపత్రికి, ఇతర సామగ్రికి రాలేకపోతున్నారు.
ఉట్నూర్ మండలంలోని వంకతుమ్మ గ్రామానికి చెందిన రైతు కాత్లె మారుతి చేనుకు కాపాలా వెళ్లగా పాముకాటు వేసింది. వెంటనే పక్క చేలలో ఉన్న రైతు లు ఉట్నూర్‌లోని దవాఖానకు తీసుకెళ్ల డానికి వాగు వద్దకు వచ్చారు. భారీ వర్షా లు కురియడంతో వాగులో నుంచి మోకా ళ్ల లోతు నీటిని దాటుకుంటూ అతికష్టం మీద ఇవతలి ఒడ్డుకు చేరుకున్నారు. ఒడ్డుకు చేరుకోగా మృత్యువాత పడ్డారు. వాగుపై వంతెన ఉంటే బతికేవాడని గ్రామస్తులు తెలిపారు.
ఉట్నూర్ మండలంలోని కన్నాపూర్ పంచాయతీ పరిధిలో వంకతుమ్మ, రాజంపేట శివారు గ్రామాల ప్రజలు ఉట్నూర్ మండల కేంద్రానికి రావాలంటే వంకతుమ్మ వాగును దాటాలి. వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నది. ఆదివారం మండల కేంద్రంలో వారసంత కావడంతో వంకతుమ్మ, రాజంపేట గ్రామస్తులు వారసంతకు రావాలంటే ఈ వాగును దాటాలి. వారసంతలో తిరగడానికి బైక్ అవసరం ఏర్పడింది. వంకతుమ్మ గ్రామస్తులు బైక్ మధ్య కట్టే కట్టి ఇద్దరు వ్యక్తులు వాగులో నుంచి మోసుకుంటూ వాగు దాటారు. అతి కష్టం మీద వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నప్పటికీ ప్రాణాలను పణంగా పెట్టి దాటారు.
మాది ఉట్నూర్ మండలంలోని రాంజీగూడ. మా ఊరికి పోవాలంటే గంగాపూర్ వంకతుమ్మ వాగు దాటాలి. వర్షాకాలం వచ్చిందంటే వాగు దాటలేం. నెల రోజులకు అవసరమైన కిరాణ సరుకులు తెచ్చుకుని ముందే పెట్టుకుంటం. వర్షాలు రాక ముందే విత్తనాలు, ఎరువులు వాగు దాటిత్తం. వర్షాలు బాగా పడితే వాగు దాటుడు ఉండదు. అత్యవసరం అయితే లక్షేటిపేట్ మీదుగా ఉట్నూర్‌కు పోతం. ఇంక వర్షాకాలం వచ్చిందంటే మాకు భయం అయితది. – సిడాం రాజు, రాంజీగూడ.
మాది ఉట్నూర్ మండలంలోని ఎర్రగుట్ట గ్రామం. మాకు వర్షాకాలం వచ్చిందంటే పరేషాన్ ఉంటది. విత్తనాలు, ఎరువులు, కిరాణం సామగ్రి, హాస్పిటల్‌కు ఉట్నూర్‌కు పోవుడే. వర్షాకాలం బాగా వర్షం పడితే నీళ్లు అస్తే అందరం కలిసి వాగు దాటుతం. ఆదివారం ఉట్నూర్‌కు అంగడికి పోయిన అందరం కలిసి వాగు దాటుతాం. అవసమైన సామాను ముందే తెచ్చుకుని పెట్టుకుంటం. ఎందుకంటే వర్షం బాగా పడితే వాగుదాటుడూ ఉండదు కాబట్టి. దవాఖానకు పోతే మాత్రం ఎండ్లబండి కట్టి, లక్షేటిపేట్ మీదుగా పోతం. వాగు అవతనే బండ్లు, ఆటోలు ఉంచుకుంటం. ప్రభుత్వం మాకు బ్రిడ్జి కట్టించాలి. అప్పుడే ఆటోలు మా ఊరిదాక వస్తయ్.
– మడావి లేతు, ఎర్రగుట్ట.