ఆదిలాబాద్, జూన్ 26(నమస్తే తెలంగాణ) ః ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. వానకాలం ప్రారంభమైన తర్వాత గురువారం అధిక వర్షం పడింది. జిల్లాలో 85.6 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదు కాగా.. అధికంగా జైనథ్ మండలంలో 137.7 మిల్లీ మీటర్ల వర్షం పడింది. తాంసిలో 135.3, భోరజ్‌లో 126.3, తలమడుగులో 121.3, ఇచ్చోడలో 117.7, గుడహిత్నూర్లో 111.6, బేలలో 105.6, ఆదిలాబాద్ అర్బన్‌లో 104.8 వర్షం పడింది. భారీ వర్షం కారణంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కుంటాల జలపాతానికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ వర్షం వల్ల పత్తి, సోయాబిన్ పంటలకు ప్రయోజనం ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. కానీ.. కొన్ని చోట్ల లోతట్టు చేలలో నీరు నిలిచి జలమయం అయ్యాయి.
కుంటాలకు జలకళ
ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరున్న కుంటాల జలపాతం వద్ద జలకళ సంతరించుకున్నది. ఎగువ ప్రాంతంలో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో కడెం నదిలోకి వరద నీరు చేరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో భారీగా వచ్చిన వరద నీరు జలపాతం వద్ద పోటెత్తుతోంది. జలపాతం ఎగువ నుంచి కిందకు దుంకుతున్న నీటితో జలపాతం కళకళలాడుతున్నది. అలాగే బోథ్ సరిహద్దు ప్రాంతంలోని మహారాష్ట్రలో ఉన్న సాసర్‌కుండ్ జలపాతానికి జలకళ సంతరించుకుంది. జలపాతం నిండుగా పారుతుండడంతో మహారాష్ట్రతోపాటు తెలంగాణ సరిహద్దు గ్రామాల ప్రజలు గురువారం అక్కడికి వెళ్లి జలపాతం అందాలను వీక్షించారు.
చేపలు పడుతుండగా యువకుడి గల్లంతు
ఆదిలాబాద్ జిల్లాలో గురువారం వాగులో చేపలు పట్టడానికి వెళ్లిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని నిషాన్ఘాట్ వాగు వద్దకు చేపలు పట్టడానికి ఆదిలాబాద్ పట్టణంలోని కుర్షిద్నగర్కు చెందిన ముగ్గురు స్నేహితులు కృష్ణజాదవ్, శేఖర్, ఆకాశ్‌లు వెళ్లారు. చేపలు పడుతుండగా వాగు ఉధృతి పెరగడంతో శేఖర్ వాగులో చిక్కుతున్నాడు. ఆకాశ్‌కు ఈత రావడంతో శేఖర్‌ను కాపాడేందుకు వాగులో దిగగా వరద ప్రవాహం ఎక్కువ ఉండడంతో ఫలితం లేకుండా పోయింది. దీంతో శేఖర్(18) వాగులో కొట్టుకుపోగా ఆకాశ్ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.