ఆదిలాబాద్, మే 27(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఈ దురుగాలులతో కూడిన వర్షం కారణంగా జనం ఇబ్బందులు పడ్డారు. వీధులు జలమయంగా మారాయి. డ్రెయినేజీ వ్య వస్థ అస్తవ్యస్తంగా మారింది. రెండు రోజులుగా ఎండ ప్ర భావం కారణంగా వాతావరణం వేడిగా మారగా.. మం గళవారం కురిసిన వానతో ఒక్కసారిగా చల్లబడింది.
ఇచ్చోడ, మే 27 : ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బోరిగామ వాగు పొర్లింది. ఐదారు రోజులుగా కురుస్తున్న వర్షానికి రైతులు వ్యవసాయ పనులను మొదలు పెట్టారు. వ్యవసాయ మార్కెట్ కేంద్రాల్లో జొన్న తడవకుండా టార్పాలిన్లు కప్పారు.
జైనథ్, మే 27 : మండల కేంద్రంలో ని మార్కెట్ యార్డుకు తమ వాహనాల్లో జొన్న పంటను రైతులు తీసుకొచ్చారు. మార్కెట్ యార్డు లో జొన్న పంట భారీ వర్షానికి తడిసి ముద్దయింది. దీంతో రైతులు తీవ్ర మానసిక ఆం దోళనకు గురవుతున్నారు.
భీంపూర్, మే 27: వర్షానికి ఆర్అంబ్బీ రహదారులు బురదమయంగా మారాయి. ఆదిలాబాద్- కరంజి(టి) 50 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణానికి వీలులేకుండా పోయింది. ఆర్టీసీ ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని గ్రామాల్లో కోతలు కాని జొన్న పంటకు నష్టం వాటిల్లింది. పలు గ్రామాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పెన్‌గంగకు నీరు వచ్చి చేరుతున్నది.
ఖానాపూర్, మే 27: ఖానాపూర్ పట్టణంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. సుభాష్‌నగర్, విద్యానగర్, పాత బస్టాండు మార్కెట్ ఏరియాలో రోడ్లపైకి వర్షపు నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మార్కెట్ యార్డులో ధాన్యం తడవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
కుంటాల, మే 27 : కొనుగోలు కేంద్రాల్లో జొన్నలు, వడ్లు ఉండడంతో వీటిని కాపాడుకోవడానికి టార్ఫాలిన్ కవర్లు కప్పారు. తడిసిన ధాన్యాన్ని కొనాలని, తూకం వేసిన ధాన్యాన్ని తరలించాలని రైతులు వేడుకుంటున్నారు.
బోథ్, మే 27 : బోథ్ మండలంలో సుమారు రెండు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దుక్కులు దున్నిన పొలాల్లో వర్షపు నీరు నిలిచింది. మరో వైపు కోత దశలో ఉన్న నువ్వు పంటకు స్వల్పంగా నష్టం వాటిల్లింది. మార్కెట్ యార్డుకు జొన్నలు అమ్మడానికి తీసుకెళ్లిన రైతులు తడవకుండా ఉండేందుకు అవస్థలు పడ్డారు. టార్పాలిన్లు కప్పారు. మరో వైపు బోథ్ వారసంతలో వర్షం మూలంగా కూరగాయలు, ఇతర వస్తువులు తడిసి ముద్దయ్యాయి.
ఇంద్రవెల్లి, మే 27 : మండలంలోని పోల్లుగూడలో జుగ్నాక్ వంశీయుల కుల దేవత పెర్సపేన్(పెద్దదేవుడు) ఆలయంపై పిడుగు పడడంతో ఆలయ గోపురం పలిగిపోయి, కలశం ఊడిపోయిందని గ్రామస్తులు జుగ్నాక్ భరత్, కాశీరాం, మానిక్రావ్లు తెలిపారు. మామిడిగూడ, హీరాపూర్, గోపాల్పూర్ గ్రామాల్లో మట్టిరోడ్లు చిత్తడిగా మారాయి. దీంతో గ్రామస్తులు, ద్విచక్ర వాహనదారులు, ఆటోవాలాలు ఇబ్బంది పడుతున్నారు.