మంచిర్యాల, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించడం జిల్లా ప్రజల పాలిట శాపంగా మారిందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య వివాదాలతో రాష్ట్ర ప్రభుత్వం మంచిర్యాలను చిన్నచూపు చూస్తున్నది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వచ్చిన వరదలు మంచిర్యాల జిల్లాను ముంచెత్తాయి.
వాగులు, వంకలు ఉప్పొంగి ఇండ్లలోకి వరద చేరింది. చాలా ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. వరి, పత్తి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ఒక్క మంచిర్యాల జిల్లాలోనే భారీ వర్షాలు, వరదలతో 7,952 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇంత జరిగినా జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక మంత్రి వివేక్ వెంకట స్వామి, ఎమ్మెల్యేలు వరదల్లో మునిగిపోయిన పంటలను పరిశీలించలేదు. రెండు రోజుల క్రితం ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో పర్యటించిన ఇన్చార్జి మంత్రి అక్కడి అధికారులతో సమీక్షించారు. ఇదే సమయంలో ఏడు వేల ఎకరాల్లో పంట నష్టపోయిన మంచిర్యాల జిల్లాలో మంత్రి ఎందుకు పర్యటించలేదు ? ఎందుకు సమీక్షించలేదన్నది ? చర్చనీయాంశంగా మారింది.
ఒక్క సమీక్షకు నోచుకోని మంచిర్యాల..
జిల్లా ఇన్చార్జి మంత్రిగా జూపల్లి బాధ్యతలు చేపట్టి రెండు, మూడు నెలలు కావస్తున్నది. ఈ సమయంలో ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఆయన అధికారులతో సమీక్షించారు. కానీ మంచిర్యాల జిల్లాలో ఇప్పటి దాకా ఆయన అడుగే పెట్టలేదు. మంచిర్యాల ఎమ్మెల్యే పీఎస్ఆర్, చెన్నూర్, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు వివేక్, వినోద్ మధ్య రాజకీయ వైరమే ఇందుకు కారణమనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్నప్పుడు సైతం ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకేసారి సమీక్షలకు హాజరైన దాఖలాలు లేవు. దీంతో మంచిర్యాల జిల్లాలో అభివృద్ధి పనులపై మంత్రి స్థాయిలో సమీక్ష జరగడం లేదు. ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలోనైనా అన్ని జిల్లాల్లో మంత్రి సమీక్ష ఉంటుందనుకుంటే, మంచిర్యాల తప్ప మిగిలిన జిల్లాలకే ఆయన పరిమితమయ్యారు. పోనీ వరద ప్రభావిత ప్రాంతాల వాసులకు ఏదైనా భరోసా కల్పించారా…? పంట నష్టపోయిన రైతులకు పరిహారంపై హామీ ఇచ్చారా ? అంటే అదీ లేదు. కేవలం సమీక్షలు చేపట్టి చేతులు దులుపుకున్నారు.
ఇక మంచిర్యాల జిల్లాలో అది కూడా లేకపోవడం గమనార్హం. వర్షాలు, వరదలనే కాదు. ఇతర ప్రభుత్వ పథకాల అమలుపైనా సమీక్షించే నాథుడు కరవయ్యారు. యూరియా, ఎరువుల కొరత, ఇందిరమ్మ ఇండ్లు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల అస్వస్థతలు, విద్య, వైద్య ఆరోగ్యశాఖ, దెబ్బతిన్న రోడ్లు, సాగు-తాగునీటి సరఫరా ఇలా ముఖ్యమైన అంశాలపై సమీక్షించి, అధికారులకు దిశానిర్దేశం చేసే దిక్కులేకుండా పోయింది. దీంతో ‘అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లుగా.. ముగ్గురు ఎమ్మెల్యేలున్న మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై అటు ప్రభుత్వం, ఇటు అధికార పార్టీ నాయకుల పట్టింపు కరువైపోయింది.
తలనొప్పిగా భావిస్తున్న ఇన్చార్జి మంత్రి..?
మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం తెలివిగా తప్పించుకుంటున్నారని తెలిసింది. మంత్రి వర్గంలో పీఎస్ఆర్కు చోటు దక్కలేదు. వివేక్‌ను మంత్రి పదవి వరించింది. పీఎస్ఆర్ బహిరంగంగానే అసంతృప్తి, విమర్శలు గుప్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్చార్జి మంత్రిగా జూపల్లి వచ్చారు. దీంతో పీఎస్ఆర్ వర్సెస్ గడ్డం ఫ్యామిలీ మధ్య ఉన్న విబేధాలపై ఆయన ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. ఎవరి పక్షాన ఉన్నా తనకు తలనొప్పి ఎందుకని ఆయన సైలెంట్ అయిపోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు సైతం ఆయనకు కత్తిమీద సవాలుగా మారనున్నాయి. ఈ నెలలోనే ఓరియంట్ సిమెంట్ ప్యాక్టరీ ఎన్నికలున్నాయి. ఇక్కడ గుర్తింపు సంఘం ఎన్నికల్లో పీఎస్ఆర్ తమ్ముడు పోటీ చేస్తున్నారు. మరోవైపు బెల్లంపల్లి, చెన్నూర్ ఎమ్మెల్యేలు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జుతో కలిసి కాంగ్రెస్ అభ్యర్థిగా మరో వ్యక్తిని బరిలోకి దించుతున్నారు. దీంతో వివాదాలు తారాస్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముందు ఉండి బాధ్యత తీసుకోవాల్సిన ఇన్చార్జి మంత్రి అసలు జిల్లాను పట్టించుకోకపోవడంపై క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్లలో తమ పరిస్థితి ఏంటని అయోమయ పడిపోతున్నారు.
వారాంతాల్లోనే ఎమ్మెల్యేలు..
ఇన్చార్జి మంత్రి విషయం పక్కనపెడితే స్థానిక ఎమ్మెల్యేలు సైతం జిల్లాను పట్టించుకోవడం లేదు. ఎన్నికలకు ముందు జరిగిన ప్రచారానికి తగ్గట్లే ఎమ్మెల్యే టూరిస్టులుగా మారిపోయారు. వారానికోసారి వచ్చి వెళ్లడం తప్ప నియోజకవర్గాన్ని పట్టుకొని ఉండే ఎమ్మెల్యేలు లేరు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో మంత్రులు ఎలాగూ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించలేదు. పోనీ స్థానిక ఎమ్మెల్యేలైనా వచ్చారా? అంటే అదీ లేదు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ స్థానిక రాంనగర్ ఏరియాలో పర్యటించారు తప్పితే.. పెద్ద మొత్తంలో పంట నష్టం వాటిల్లిన భీమిని, తాండూర్, నెన్నెల, వేమనపల్లి, కన్నేపల్లి మండలాల వైపు కన్నెత్తి చూడలేదు.
చెన్నూర్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి వివేక్ ఆగస్టు 15న పార్టీలో చేరికల కార్యక్రమానికి హాజరయ్యారు. ఇప్పటి దాకా మళ్లీ ఇటువైపు రాలేదు. భారీ వరదలకు నీట మునిగిన పంటలను పరిశీలించలేదు. పంట నష్టం వాటిల్లిన కోటపల్లి, మందమర్రి మండలాల్లో పర్యటించలేదు. గతంలో బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు ప్రాణహిత వరద దాటికి నీట మునిగిన పంటలకు నష్ట పరిహారం డిమాండ్ చేసిన ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి అయ్యాక అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మంచిర్యాల ఎమ్మెల్యే పీఎస్ఆర్ కాలికి శాస్త్రచికిత్స కారణంగా విశ్రాంతిలో ఉన్నారు. దీంతో ఆయన కూడా వరదల సమయంలో జిల్లాలో పర్యటించకలేకపోయారు. దీంతో జిల్లా వాసులు అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకొని మంచిర్యాల జిల్లాకు తగిన ప్రాధాన్యమిచ్చి, క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని కోరుతున్నారు.