ఆదిలాబాద్, ఆగస్టు 29 ( నమస్తే తెలంగాణ): ఆగస్టు 16న జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షం కారణంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలకు నష్టం జరిగింది. వరద నష్టంపై అధికారులు నిర్వహించిన సర్వే నివేదికలో పలు కాలనీల ప్రస్తావన లేకపోవడంతో స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కుండపోత వర్షం కారణంగా వాగులు, కుంటలు, నాళాలు పొంగి ప్రవహించడంతో పలు కాలనీలు జలమయం, పలు ఇళ్లు కూలిపోగా మరికొన్ని ఇండ్లు దెబ్బతిన్నాయి. కాలనీలు జలమయం కావడంతో వరద నీరు ఇండ్లల్లోకి చేరింది. ఇండ్లల్లోకి నీరు రావడానికి కారణాలపై సమగ్ర నివేదికలు ఇవ్వాలని వివిధ శాఖల అధికారులను కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు.
కలెక్టర్ సూచనల మేరకు రెవెన్యూ, మున్సిపాలిటీ, ఇరిగేషన్ శాఖల అధికారులతో పాటు ప్రత్యేకాధికారి పట్టణంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సర్వే చేపట్టారు. మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డులు ఉండగా 15 వార్డుల్లో వరదల ప్రభావం ఉందని, 254 ఇండ్లు వరద ప్రవాహానికి గురయ్యాయని సర్వేలో నిర్ధారించారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో కుంటలు, వాగులు, నాళాల ఆక్రమణలతో వర్షం నీరు బయటకు పోవడానికి అవకాశం లేకపోవడంతో పాటు చెరువుల బఫర్ జోన్లలో నిర్మాణాలు ఉండడంతో వరద నీరు కాలనీలు ఇండ్లలోకి ప్రవేశిస్తుందని అధికారులు నివేదికల్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ను అధికారులు కలెక్టర్‌కు చూపించారు.
చెరువులు, కుంటల నీరు బయటకు పోయే విధంగా చర్యలు తీసుకోవాలని ఆక్రమణలు తొలగించాలని సూచించారు. పలు వార్డుల్లో మురుగు కాల్వలు నిర్మించడంతో పాటు నాళాలు వెడల్పు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఎక్కువగా ప్రభావతమైన వార్డు నంబర్ 3లోని జీఎస్ ఎస్టేట్‌లోకి నీరు రాకుండా రిటేయినింగ్ గోడ నిర్మించాలని సూచించారు. ప్రత్యేకాధికారిగా ఉన్న జిల్లా యువజన, క్రీడలు అధికా మున్సిపాలిటీ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారుల నిర్వహించిన సర్వేపై పలు కాలనీ వాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సర్వేలో వరద ప్రభావిత ప్రాంతాలను పూర్తిస్థాయిలో పొందుపర్చాలని కోరుతున్నారు. సర్వే నివేదికపై సమావేశం నిర్వహించిన కలెక్టర్ రాజర్షి షా బఫర్‌జోన్, నాళాల ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
ఈ ఫొటోలోని ప్రాంతం ఆదిలాబాద్ పట్టణంలోని ఆరో వార్డు. ఈ నెల 16న కురిసిన వర్షాలతో ఇక్కడ కుమ్మరికుంట కాలువ పొంగి ప్రవహించింది. మత్తడి ప్రాంతాలు ఆక్రమణలకు గురికావడంతో ఇండ్ల మధ్య నుంచి నడుం లోతుకు పైగా వరద ప్రవహించింది. పలు ఇండ్లల్లోకి నీరు ప్రవేశించగా ఒక ఇల్లు కూలిపోయింది. అధికారులు ఈ వార్డులో పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు. బాధితుడికి రూ. 4 వేల ఆర్థికసాయంతో పాటు 10 కిలోల బియ్యం పంపిణీ చేశారు. సర్వేలో ఈ వార్డు ప్రస్తావన లేకపోవడం, ఇండ్లలోకి నీరు ప్రవేశించి నష్టం జరగడం లాంటి వివరాలు లేకపోవడంతో వార్డు వాసులు ఆందోళన చెందుతున్నారు.