ఇంద్రవెల్లి, సెప్టెంబర్ 29 : ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా, రోగులకు మౌలిక వసతులు కల్పించకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ దవాఖానల యజమానులపై చర్యలు తీసుకుంటామని ఏజెన్సీ డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయ్‌కుమార్ హెచ్చరించారు. మండలకేంద్రంలోని పలు ప్రైవేట్ దవాఖానలను గురువారం తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్యశాఖ పరమైన నిబంధనలు పాటించి దవాఖానలు నిర్వహిస్తున్నారా? లేదా? అనేది పరిశీలించారు. దవాఖానలో ఏర్పాటు చేసిన మెడికల్‌లో అందుబాటులో ఉన్న మందులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన దవాఖానలకు అనుమతులు ఉన్నాయా? లేదా? అనేవి పరిశీలించామన్నారు. దవాఖానల్లో పని చేస్తున్న వైద్య సిబ్బంది అర్హతలు, తదితరవి పరిశీలించినట్లు పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఈవో శ్రీనివాస్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మళ్లీ వస్తా.. పత్రాలన్నీ ఉంచాలి
ఎదులాపురం, సెప్టెంబర్ 29 : రెండు వారాల తర్వాత మళ్లీ వస్తా.. అప్పటిలోగా దవాఖానకు సంబంధించి అన్ని సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచుకోవాలని, లేకుంటే ప్రభుత్వ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ వైద్యశాలలను డీఐవో వైసీ శ్రీనివాస్, అడిషనల్ డీఎంహెచ్‌వో మెట్పెల్లివార్ శ్రీకాంత్‌తో కలిసి తనిఖీ చేశారు. ముందుగా నేతాజీ చౌక్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానను తనిఖీ చేసి, సంబంధిత పత్రాలను పరిశీలించారు. వైద్య అర్హత ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రైవేట్ వైద్యశాలలకు రెండు వారాల సమయం ఇస్తున్నామని, అన్ని పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. లేకుంటే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బృందం సభ్యులు వెంకట్ రెడ్డి, రాంప్రసాద్ ఉన్నారు.