రక్తహీనతకు చెక్
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు ప్రయోజనం
ఆదిలాబాద్, మార్చి 8 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలకు వైద్య సేవలు సరిగా అందేవి కావు. గిరిజన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులతో గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. తండాలు, ఆదివాసీ గూడేల్లో మలేరియా, టైఫాయిడ్, డయేరియా స్థానికులను పట్టి పీడించేవి. ఇవేకాకుండా వివిధ రకాల వ్యాధులతో సైతం ప్రజలు మరణించేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక ధృష్టి సారించింది. జిల్లా వైద్యశాలలు, కమ్యూనిటీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి చర్యలు తీసుకున్నది. ఫలితంగా సీజనల్ వ్యాధుల నియంత్రణతో పాటు ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. కరోనా లాంటి వ్యాధులకు సైతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లో వైద్యసేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నందుకు గానూ ఉమ్మడి జిల్లాలో పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు జాతీయ స్థాయిలో అవార్డులు లభించాయి. గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులు వైద్యానికి పట్టణాలకు రాకుండా పీహెచ్‌సీల్లోనే స్కానింగ్ పరీక్షలు చేయడంతో పాటు ప్రసవాలు జరిగేలా సర్కారు తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలిస్తున్నాయి. ప్రతి పీహెచ్సీలో నెలకు 30 నుంచి 40 డెలివరీలు అవుతున్నాయి.
రక్తహీనతకు చెక్..
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో గిరిజన ప్రాంతాల్లో రక్తహీనత సమస్యగా మారింది. గర్భిణులకు పోష్టికాహారం అందకపోవడంతో ప్రసవం సమయంలో వారు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. పిల్లల్లో పోషకాహార సమస్య కారణంగా ఎదుగుదల లోపించడం, మందబుద్ధి లాంటి సమస్యలు వస్తున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యలక్ష్మి, అమ్మఒడి, కేసీఆర్ కిట్ లాంటి పథకాలు గర్భిణులు, బాలింతలు, శిశువులకు ఎంతో ప్రయోజనకరంగా మారాయి. రక్తహీనత సమస్య పరిష్కారం సైతం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రెండు జిల్లాల్లో గిరిజన ప్రాంతాల్లోని మహిళలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను అందించనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగంలో సూచించారు. పలు రకాల పోషక విలువలతో కూడిన కిట్లతో రక్తహీనత సమస్యకు పరిష్కారం లభించనుంది. ప్రభుత్వం తమకు పౌష్టికాహారం పంపిణీ చేయడంపై రెండు జిల్లాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ పౌష్టికాహార కిట్లు ఒక వరం
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నది. ఇప్పుడు నవజాత శిశువు రక్తహీనతతో బాధపడకుండా గర్భిణులకు సీఎం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు అందజేసేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించడం సంతోషకరం. ఈ కిట్లతో లక్షల మంది తల్లీబిడ్డలకు, తద్వారా కుటుంబాలకు ప్రయోజనం చేకూరనున్నది. ఆరోగ్యవంత సమాజ సాకారంలో ఇదొక కీలక పథకమని భావించవచ్చు. మా పంచాయతీలో కూడా పేద, మధ్యతరగతి గిరిజన మహిళలకు ఈ కిట్లు మేలు చేకూరుస్తాయని భావిస్తున్నాం. సర్కారు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ద్వారా కౌమార దశలోని 15-19 ఏండ్లలోపు యువతులకు కూడా ఈ పౌష్టికాహార కిట్లు అందజేయాలనుకోవడం హర్షణీయం. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– తాటిపెల్లి లావణ్య, సర్పంచ్,కామట్‌వాడ జీపీ, భీంపూర్ మండలం
కేసీఆర్ కిట్లంత అమూల్యం.. న్యూట్రిషన్ కిట్లు
తెలంగాణ సర్కారు అచ్చిన తర్వాత గ్రామాల్లో ఉపకేంద్రాలు, మండల కేంద్రాల్లో పీహెచ్‌సీలపై ఎంతో నమ్మకం పెరిగింది. మా భీంపూర్ పీహెచ్‌సీలనే సురక్షిత ప్రసవాలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఇస్తున్న కేసీఆర్ కిట్ల అంత అమూల్యం ఇప్పుడు సర్కారు బడ్జెట్లో ఉంచిన కేసీఆర్ పౌష్టికాహార కిట్లు. మా పంచాయతీలో ఉన్న పేద, మధ్యతరగతి, గిరిజన కుటుంబాలకు ఈ కిట్లతోని ఎంతో లాభమవుతదని అనుకుంటున్నం. గర్భిణులకు ఈ ఆహార కిట్లు ఇచ్చుడుతోని పిల్లలకు రక్తహీనత సమస్య క్రమంగా దూరమవుతది. మారుమూల, గిరిజన గ్రామాలకైతే ఈ కిట్లు ఒగ వరంతీరే అని చెప్పచ్చు. ఒక సర్పంచ్‌గా సర్కారుకు కృతజ్ఞతలు. – జీ స్వాతిక, సర్పంచ్, కరంజి(టీ), భీంపూర్ మండలం