ఉపాధ్యాయులంటే మార్గదర్శకులు. ఆ బాటలోనే యావత్ భావితరం అడుగులు వేస్తోంది. అందుకే గురువులు కాలానికనుగుణంగా తన పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ఒక విజ్ఞానగనిలా మారుతున్నారు. అను నిత్యం సమసమాజం కోసం పరితపిస్తూ.. రేపటి పౌరుల భవిష్యత్‌ను తీర్చి దిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
– చెన్నూర్ టౌన్, సెప్టెంబర్ 4
చెన్నూర్ టౌన్, సెప్టెంబర్ 4: ఉపాధ్యాయుడు సృష్టి స్థితి లయల నిర్దేశకుడు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దే వోభవ అన్నారు పెద్దలు. తల్లి.. తండ్రి తర్వాత స్థానం గురువుదే అని స్పష్టం చేశారు. అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అనే పేరు స్థిరపడిపోయింది. గురు బ్రహ్మా, గురు విష్ణు, గు రు దేవో మహేశ్వరహ.. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః.. మనిషి పుట్టినప్పటి నుంచి మరణిం చే దాకా ప్రతి అడుగులోనూ, ప్రతి క్షణంలోనూ అత ను ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుర్తుగా ఒక గురువు దాక్కునే ఉంటాడు. కానీ, ఆ గురువును మ నమందరం ప్రత్యక్షంగా చూడగలిగేది తరగతి గదిలో విద్యనభ్యసించినప్పుడే. ప్రతి విద్యార్థి గురువును దైవంగా భావిస్తూ, తన భవిష్యత్‌కు ఆయన అనుభవాన్ని వారధిగా చేసుకొని ముందుకు సాగుతాడు.
నేడు గురువులకు సన్మానం..
ప్రేమ, ఆప్యాయతలకు చిహ్నంగా నిలిచే గురువు విద్యార్థుల కలలను నిజం చేసే ప్రత్యక్ష దేవం. భారతీయ సంప్రదాయంలో గురువుకు గల ప్రాధాన్యత గణనీయమైంది. గురువు సమక్షంలో నేర్చుకునే విద్య మనిషి జీవితానికి అర్థాన్ని, పరమార్థాన్ని చేకూరుస్తుందన్న భావన యుగాల నాటి నుంచి గురుశిష్య బాంధవ్యాన్ని చిరంజీవిగా నిలుపుతున్నది. పురాణేతిహాసాలు సైతం పిల్లల భవితవ్యాన్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల తర్వాత గురువు ప్రధాన పాత్ర పోషిస్తారని తెలిపాయి. అందుకే గురువుకు దైవత్వాన్ని ఆపాదించిపెట్టాయి. సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషించే ఉపాధ్యాయుడి పేరు మీద ఒక ప్రత్యేక రోజును ఏర్పాటు చేసి.. ఆ వృత్తిని గౌరవిస్తుండడం మన సంస్కృతిలోఅంతర్భాగమై పోయింది. ఇది గర్వించదగిన విషయం. సర్వత్రా వాంఛనీయం. ఈ రోజును ప్రతి విద్యాలయంలోనూ ఘనంగా నిర్వహిస్తారు. తనలోని జ్ఞాన సంపదను విద్యార్థులకు పంచడం ద్వారా వారి భావి జీవితానికి బంగారు బా టలు వేసిన గురుదేవుడిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అందరి మనసుల్లో చిరస్మరణీయులుగా నిలిచిపోయారు.
ఉపాధ్యాయ వృత్తికి అపారమైన గౌరవా న్ని తెచ్చిపెట్టిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుత్తణిలో 1888వ సంవత్సరం సెప్టెంబర్ 5న జన్మించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో పలు కీలక బాధ్యతలు నిర్వహించిన రాధాకృష్ణన్ విద్యారంగంలో పలు నిర్ణయాత్మక సంస్కరణలకు మార్గదర్శకులయ్యారు. తన అనిర్వచనీయమైన సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక భారతరత్న పురస్కారం ఆయనను వరించింది. 1962లో అత్యుత్తమైన రాష్ట్రపతి పదవికి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. తాను చేపట్టిన రంగంలో అద్వితీయ ప్రతిభను కనబర్చిన రాధాకృష్ణన్ తన 79వ ఏట 1975, ఏప్రిల్ 17న చెన్నై నగరంలో కన్నుమూశారు. ఉపాధ్యాయ వృత్తిపై తన ప్రేమను చాటుకున్న రాధాకృష్ణన్ కోరిక మేరకు సెప్టెంబర్ 5న దేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తుండడం గమనార్హం. ఉపాధ్యాయుల సేవలను గౌరవిస్తూ సెప్టెంబర్ 5న వారిని సత్కరిస్తున్నారు. ఈ యేడు కూడా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను సన్మానించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.