బెల్లంపల్లి, మార్చి 14: చాకెపల్లి శివారులో దాదాపు పదెకరాల్లో గున్నికుంట చెరువు ఉన్నది. చుట్టూబోర్లు ఉండడంతో రైతులు వ్యవసాయ పనులకు ఈ చెరువును వినియోగించడం లేదు. వానాకాలంలో మాత్రమే చెరువులో నీరు ఉంటుండగా, వేసవిలో నిల్వ ఉండడం లేదు. ఇదే అదనుగా భావించిన మాజీ ఎంపీపీ, ఇతర సీనియర్ నాయకులు చెరు వు కబ్జాకు తెరలేపారు. నాలుగు రోజుల నుంచి తూము, మత్తడిని ధ్వంసం చేసి, చెరువు స్థలాన్ని ఎక్స్కవేటర్తో చదును చేయించారు.
ఈ విషయం తెలుసుకున్న మత్స్యకారులు ఇరిగేషన్ అధికారులకు సమాచారం అందించారు. ఏఈఈ సంగీత, వర్క్ ఇన్స్పెక్టర్ శంకర్ అక్కడికి చేరుకుని కబ్జా స్థలాన్ని, చెరువును పరిశీలించారు. విచారణ జరిపి, కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఈ విషయంపై తాళ్లగురిజాల పోలీస్స్టేషన్లో మత్య్సకారులు ఫిర్యాదు చేశారు. చెరువు స్థలం కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.