నస్పూర్,నవంబర్ 17 : మంచిర్యాల జిల్లాలో మొదటి రోజు గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా సాగాయి. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రతిభ జూనియర్ కళాశాల, శ్రీచైతన్య పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 48 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, 15038 మంది అభ్యర్థులకుగాను 8246 మంది హాజరయ్యారన్నారు. పరీక్ష నోడల్ అధికారి, పోలీసు నోడల్ అధికారి, రీజియన్ కో ఆర్డినేటర్లను నియమించినట్లు తెలిపారు.
ప్రతి కేంద్రంలో ముఖ్య పర్యవేక్షకులు, ఇన్విజిలేటర్లు, వైద్య సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. హాల్ టికెట్ వెరిఫికేషన్ కోసం మహిళా సిబ్బందిని నియమించామన్నారు. ఈ నెల 18న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపరు-3 పరీక్ష ఉంటుందన్నారు. కాగా, కేంద్రాలకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అనుమతించలేదు.
ఆసిఫాబాద్ టౌన్/ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్/కాగజ్నగర్,నవంబర్ 17 : జిల్లాలో మొదటి రోజు గ్రూప్-3 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సాగాయి. 18 కేంద్రాల్లో ఉదయం నిర్వహించిన పరీక్షకు 4471 మందికి అభ్యర్థులకుగాను 2794 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన రెండో పేపర్లో 4471 మందికి గాను 2779 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల, పీటీజీ గురుకుల పాఠశాలలు, కాగజ్నగర్ పట్టణంలోని సెయింట్ క్లారెటీ, వివేకానంద డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సందర్శించారు. అంతకుముందు కలెక్టరేట్లోని స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచిన పరీక్షా పత్రాలు, ఓఎంఆర్ షీట్లను కేంద్రాలకు తరలించే ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్, నోడల్ అధికారి దీపక్ తివారీతో కలిసి పరిశీలించారు. పరీక్షల ప్రాంతీయ సమన్వయకర్త లక్ష్మీనరసింహా ఉన్నారు.
జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, సెయింట్ మేరీస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సెంటర్లను ఆయన పరిశీలించారు. అభ్యర్థులను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపించాలని, ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించకూడదని తెలిపారు.