నమస్తే బృందం : ఊరూరా సీతారాముల కల్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తజనం పెద్ద సంఖ్యలో తరలివచ్చి వివాహ ఘట్టాన్ని తిలకించి తన్మయత్వంలో మునిగితేలింది. ‘శ్రీరామ.. జయరామ జయజయ రామ..’ నామస్మరణతో ఆలయాలన్నీ మార్మోగాయి. శ్రీరాంపూర్, పాతమంచిర్యాలలోని ఆలయాల్లో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు-రాజకుమారి దంపతులు పట్టు వస్త్రాల సమర్పించి పూజలు చేశారు.
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ రావు పాల్గొన్నారు. కాసిపేట మండలం దేవాపూర్‌లోని ఆలయాల్లో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రత్యేక పూజలు చేశారు. ఆయన స్వయంగా భక్తులకు మంచినీరు పోసి, భోజనం వడ్డించారు. ఆసిఫాబాద్ పట్టణంలోని జనకాపూర్ కోదండ రామాలయంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి-దంపతులు తలంబ్రాలు.. పట్టు వస్త్రాలు సమర్పించారు. దహెగాంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్సీ దండె విఠల్, భీమారం, జైపూర్‌లో జరిగిన కల్యాణోత్సవంలో చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ పాల్గొన్నారు.