మంచిర్యాల, మే 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రతి గ్రామ పంచాయతీకి ఓ కార్యదర్శి, చెత్త సేకరణకు ఒక ట్రాక్టర్, ప్రతి ఊరిలో ఒక శ్మశానవాటిక, డంప్ యార్డు, పల్లె ప్రకృతి వనాలు.. ఇలా ఎన్నో అద్భుతాలతో కేసీఆర్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పల్లెలు.. నేడు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు పంచాయతీలకు ఒక్క పైసా కూడా నిధుల రూపంలో విడుదల చేయలేదు.
పంచాయతీల బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవడంతో పాలన పడేసింది. నిధులు ఇవ్వకపోగా కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు గతేడాది ఇచ్చిన నిధులు 2023-24 సంవత్సరానికి సంబంధించి పంచాయతీల్లో మిగిలిన డబ్బులను ఏప్రిల్ నెలలో వెనక్కి తీసుకుంది. అలాంటప్పుడు ప్రతినెలా ఇవ్వాల్సిన డబ్బులైనా సమయానికి ఇస్తుందని ఆశ పడితే.. మొండిచేయి చూపిస్తున్నది. కేసీఆర్ హయాంలో పంచాయతీలకు ప్రతినెలా ఠంఛన్‌గా నిధులు వచ్చేవి. దీంతో నిర్వహణకు ఇబ్బందులు లేకుండేవి. ట్రాక్టర్లు, పారిశుధ్య పనులు, సిబ్బంది జీతాలు అన్నింటికీ సకాలంలో డబ్బు సమకూరేవి.
కానీ.. ఇప్పుడా పరిస్థితి గ్రామాల్లో కనిపించడం లేదు. మల్టీ పర్సస్ వర్కర్లకు మూడు, నాలుగు నెలలుగా జీతాలు రావడం లేదు. ఇక ఊర్లలోని పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణకు నియమించుకున్న కార్మికులకు కూడా డబ్బులు ఇవ్వలేని దుస్థితి. పంచాయతీ కార్యదర్శులు సొంత డబ్బులతో కరెంట్ బిల్లులు కట్టాల్సిన దుస్థితి. వీధి దీపాలు, డంపింగ్ యార్డులు, ట్రాక్టర్ల నిర్వహణ ఈ భారమంతా పంచాయతీ కార్యదర్శలపైనే పడుతున్నది.
గడిచిన పదేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది రాష్ట్రంలో తాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యాయి. పైప్లైన్లకు మరమ్మతు చేయలేక చాలా గ్రామాల్లో తాగునీటి సరఫరా నిలిచింది. దీంతో జిల్లాస్థా యి ఉన్నతాధికారులు తాగునీటి సరఫరా కు ప్రత్యేకమైన నిధులు వస్తున్నాయి. ప్రతి పంచాయతీకి రూ.లక్ష ఇస్తాం. ముందైతే ఇబ్బందులు లేకుండా నీటి సరఫరా చేయాలంటూ పంచాయతీ కార్యదర్శులకు చెప్పారు. ఈ విషయంలో ఇబ్బందులు వస్తే ఉన్నతాధికారులు కార్యదర్శులనే బాధ్యులను చేశారు.
దీంతో చేసేది ఏం లేక ఒక్కో కార్యదర్శి రూ.30 వేల నుంచి రూ. ఒక లక్ష వరకు అప్పులు తెచ్చి తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, వీధి దీపా ల ఏర్పాటు ఇలా రకరకాల పనులపై పెట్టా రు. తీరా ఇప్పుడు పనులైపోయాక ఆ లక్ష రూపాయాల విషయం కూడా మాట్లాడే నాథుడే కరువయ్యారు. అప్పుల పాలై పోతున్నాం సార్ అంటూ పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. పంచాయతీల్లో పాలకవర్గానికి గడువు ముగియడంతో స్పెషల్ ఆఫీసర్లను నియమించినా.. వారు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియడం లేదు. పాలకవర్గాలు లేకపోవడం, స్పెషల్ ఆఫీసర్ రాకపోవడంతో ప్రతి దానికి మేమే బాధ్యత వహించాల్సి వస్తుందంటూ బాధపడుతున్నారు.
మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండలంలో 22 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఇందులో 14 పంచాయతీల ట్రాక్టర్ల ఈఎంఐలు పెండింగ్‌లో ఉన్నాయి. కోనూర్, కొండాపూర్, కోమటిచేను, పెద్దనపల్లి, కాసిపేట పంచాయతీల్లో మల్లీపర్సస్ వర్కర్ల జీతాలు ఐదారు నెలలుగా రావడం లేదు. పంచాయతీ కార్యాలయాల కరెంట్ బిల్లులు కట్టాల్సి ఉంది. తాండూర్ మండలంలో 15 పంచాయతీలు ఉండగా మేజర్ పంచాయతీలో మినహా మిగిలిన 14 పంచాయతీల బ్యాంక్ ఖాతాలు ఖాళీగా ఉన్నాయి.
కిష్టంపేట, రాజీవ్‌నగర్, రేచిని, నీలాయిపల్లి గ్రామాల్లో సిబ్బందికి వేతనాలు, కరెంట్ బిల్లులు రావాలి. దండేపల్లి మండలంలోని 31 గ్రామాల్లో ధర్మరావుపేట పంచాయతీలో ట్రాక్టర్ ఈఎంఐ పెండింగ్‌లో ఉంది. హాజీపూర్ మండలంలో 17 పంచాయతీలు ఉండగా ప్రతి గ్రామంలో మల్టీపర్సస్ ఉద్యోగులకు వేతనాలు నాలుగైదు నెలలవి చెల్లించాలి. కొన్ని పంచాయతీలు కరెంట్ బిల్లులు బకాయిలు ఉన్నాయి. నెన్నెల మండలంలో 19 పంచాయతీలు ఉండగా పలు పంచాయతీల్లో వేతనాలు కొన్ని నెలలవి ఇవ్వలేదు. భీమారం మండలంలో 11 పంచాయతీలు ఉండగా..
భీమారం మేజర్ పంచాయతీలో రూ.5,85,500 విద్యుత్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ధర్మారం గ్రామంలో రూ.లక్ష, పొలంపల్లిలో రూ.21 వేలు, కొత్తపల్లిలో రూ.30 వేలు, ఎల్కేస్వరంలో రూ.50 వేలు, దంపూర్లో రూ.30 వేలు, కాజీపల్లిలో రూ.30 వేల విద్యుత్ బిల్లులు బకాయిలు చెల్లించాలి. జైపూర్ మండలంలో 20 గ్రామ పంచాయతీలు ఉండగా.. మూడు, నాలుగు గ్రామ పంచాయతీల్లో వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. మందమర్రి మండలంలో 8 పంచాయతీలు ఉండగా సారంగపల్లి, పొన్నారం, మామిడిగట్టు, అదిల్‌పేట్, చిర్రకుంట గ్రామాల్లో వర్కర్లకు జీతాలు చెల్లించాలి. చెన్నూర్ రూరల్, బెల్లంపల్లి రూరల్, కన్నేపల్లి, భీమిని మండలాల్లోనూ దాదాపు ఇదే దుస్థితి నెలకొంది.
పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు త్వరలోనే మంజూరవుతాయి. అప్పుడు పెండింగ్ పడిన వేతనాలు, ట్రాక్టర్ల ఈఎంఐలు అన్ని చెల్లిస్తాం. పంచాయతీల్లో పనులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్స్ కొన్ని నెలలుగా పెండింగ్ ఉన్నాయి. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే నిధులు వస్తాయి.
– వెంకటేశ్వర్రావు, జిల్లా పంచాయతీ అధికారి, మంచిర్యాల.