కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లు కేటాయిస్త్తూ సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో ఉన్న 335 సర్పంచ్ స్థానాలు, 2874 వార్డు స్థానాలకు రిజర్వేషన్లు ప్రకటించారు. 335 సర్పంచ్ స్థానాలుండగా, వీటిలో నాన్‌షెడ్యూల్, షెడ్యూల్ ప్రాంతాల వారీగా రిజర్వేషర్లు ఖరారు చేశారు. నాన్ షెడ్యూల్ ఏరియాలో ఎస్టీలకు 27, ఎస్సీలకు 32, బీసీలకు 20, జనరల్‌కు 85 స్థానాలు కేటాయించారు.
ఇక పూర్తి గిరిజన ప్రాంతమైన ఎస్టీ షెడ్యూల్ ఏరియాలోని 163 సర్పంచ్ స్థానాలను పూర్తిగా ఎస్టీలకే కేటాయించారు. 100 శాతం గిరిజన ప్రాంతాలైన 8 గ్రామ పంచాయతీల్లో 2 గిరిజన మహిళలు, 6 ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. ఇక నాన్ ఏజెన్సీలో వార్డు సభ్యుల స్థానాల్లో ఎస్టీలకు 232, ఎస్సీలకు 226, బీసీలకు 231, జనరల్‌కు 757 వార్డులు కేటాయించారు. పూర్తిగా గిరిజన ప్రాంతాలైన షెడ్యూల్ ఏరియాలో 1000 వార్డులకు ఎస్టీలు, అన్‌రిజర్వుడ్ 368 వార్డులను కేటాయించారు. మొత్తం 2874 వార్డుల్లో మహిళలకు 1276, జనరల్‌కు 1598 స్థానాలు కేటాయించారు.
