తాండూర్ : ప్రభుత్వ బడులు ( Government Schools) నిలబడాలి, చదువుల్లో అంతరాలు పోవాలని తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఆలుగుబెల్లి నర్సిరెడ్డి (Alugubelli Narsi Reddy) అన్నారు. తెలంగాణ పౌరస్పందన వేదిక ప్రచార జాత రెండో విడతలో భాగంగా మంచిర్యాల జిల్లా తాండూర్ ఐబీ చౌరస్తాలో బుధవారం ప్రచార జాతా నిర్వహించారు. వారికి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) మంచిర్యాల జిల్లా కమిటీ స్వాగతం పలికింది.
ఈ సందర్భంగా నర్సిరెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ చదువుల్లో మార్పురావాలని కోరారు. ఉన్నోడి పిల్లలైనా, లేనోడి పిల్లలైనా ఒకే బడిలో, ఒకే కళాశాలలో, ఒకే యునివర్సిటీలో చదువుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ పౌర స్పందన వేదిక పనిచేస్తుందని వెల్లడించారు. అంతరాలు లేని చదువులకు అందరూ మాట్లాడాలని, కార్యాచరణలోకి రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పౌరస్పందన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కేవి మంగ, ఏ నాగమణి, ధనమూర్తి, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చక్రపాణి, జిల్లా బాధ్యులు శివానంద్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాగం రాజారాం, తదితరులు పాల్గొన్నారు.