ఉట్నూర్, ఏప్రిల్ 11 : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ బస్‌డిపోపై సర్కారు చిన్నచూపు చూస్తున్నది. మారుమూల గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం ఉట్నూర్ డివిజన్ కేంద్రంలో 1993 మార్చి 13న బస్‌డిపోను ప్రారంభించింది. ఉట్నూర్ డిపో ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ పట్టణాలకు మధ్యలో ఉండడం, ఎటుచూసిన 60 నుంచి 100 కిలోమీటర్ల దూరం ఉండడంతో మంచి ఆదరణ లభించింది. హైదరాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, బెల్లంపల్లి, మహారాష్ట్రలోని యావత్మాల్ వంటి ప్రాంతాలకు బస్సులు నడపడం, రైలు మార్గం లేకపోవడంతో మంచి ఆదాయాన్ని సమకూర్చుకున్నది. ప్రభుత్వాలు మారుతున్న కొద్ది డిపోపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. గతంలో 45 బస్సులతో నడిచిన డిపో కేవలం 20 సొంత, 16 ప్రైవేట్ బస్సులతో నడుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కొత్త బస్సులు, కొత్త రూట్లు పెరగకపోవడంతో 2022 సంవత్సరంలో డిపోను ఎత్తివేశారు. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల ఆందోళనలు మిన్నంటడంతో సబ్డిపోగా నడుపుతున్నారు. డిపోకు మేనేజర్ లేకపోగా.. ఆదిలాబాద్ డిపో మేనేజర్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. బస్సులకు మరమ్మతు అయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిందే. చిన్న చిన్న మరమ్మతును మాత్రం ఇక్కడి మెకానిక్‌లతో చేయిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలకు కొత్త బస్సులు వస్తున్న ఉట్నూర్ డిపోకు రెండు మాత్రమే వచ్చాయి. ఇక ఎలక్ట్రిక్ బస్సుల ఉసేలేదు. ఆదాయం పెంచే ఆలోచనలో ఆర్టీసీ లేకపోవడం బాధాకరం.
ఆదాయం రూట్లపై పట్టింపేదీ?
గతంలో ఉట్నూర్ డిపోకు కడెం వయా హైదరాబాద్, కరీంనగర్ వయా హైదరాబాద్, నిర్మల్, నిజామాబాద్, చెన్నూర్, బెల్లంపల్లి, జగిత్యాల పట్టణాలకు బస్సులు నడపడంతో ఆదాయంతోపాటు సరుకులు సరఫరా అయ్యేవి. డిపో పునఃప్రారంభం తర్వాత ఆర్టీనరీ పాత బస్సులను మాత్రమే ఉంచి ఎక్స్‌ప్రెస్‌లను ఇతర డిపోలకు పంపించారు. ఉన్న ఆర్డినరీ బస్సులకు వచ్చే ఆదాయంతోపాటు రిపేర్లు అదేస్థాయిలో వస్తూ నష్టాన్ని మిగిల్చాయి. దీనికితోడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మీ పథకం ‘బస్సులు ఫుల్.. ఆదాయం నిల్’గా మార్చాయి. మహాలక్ష్మీ స్కీం రీయింబర్స్మెంట్ ఆలస్యం కావడంతో నష్టాలే మిగిలాయి. మళ్లీ డిపోకు ఆదాయాన్ని పెంచేలా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే ఉట్నూర్ బస్టాండ్ ప్రధాన రహదారికి అనుకొని ఖాళీ స్థలం ఉంది. ఇందులో షెట్టర్లు, షాపింగ్ మాల్స్ నిర్మిస్తే ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కనీసం.. 50కిపైగా ప్రధాన రహదారికి అనుకొని షట్టర్లు నిర్మించే అవకాశం ఉంది. కోట్ల రూపాయల విలువ చేసే భూమి ఉన్న పట్టించుకోవడం లేదు.
ప్రైవేట్‌కే మక్కువ
ఆర్టీసీ యాజమాన్యం డిపోలను ప్రైవేట్ పరం చేసేందుకే ఆసక్తి కనబరుస్తున్నది. ఉట్నూర్ డిపోలో 20 ఆర్టీసీ బస్సులు ఉండగా.. 16 ప్రైవేట్ వాహనాలు ఉన్నాయి. ప్రైవేట్ వాహనాలకు డ్రైవర్, డీజిల్‌తోపాటు మెకానిక్ ఖర్చు కూడా ఉండకపోవడంతో ఎక్కువగా ప్రైవేట్‌కే మొగ్గు చూపుతున్నారు. ఉట్నూర్ డిపో నుంచి సరైన బస్సులు హైదరాబాద్‌కు నడపకపోవడంతో సుమారు నాలుగు ప్రైవేట్ వాహనాలు నడుపుతూ ఆదాయానికి గండికొడుతున్నారు. ఉన్న వాహనాలు పాతబడడం, సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలకే మొగ్గు చూపుతున్నారు. ఆర్టీసీ చార్జీలు తక్కువ ఉన్నా ప్రైవేట్నే ఆశ్రయిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
మినీ బస్సులు ఏర్పాటు చేయాలి..
గతంలో ఉట్నూర్ బస్ డిపో నుంచి నాన్‌స్టాప్ ఆదిలాబాద్‌కు మినీ బస్సులు ఉండేవి. తక్కువ సమయంలో ఉద్యోగస్తులు, ఇతర వ్యాపారస్తులు ఆదిలాబాద్‌కు గంటలో ప్రయాణం చేసేవారు. మహాలక్ష్మీ పథకం ద్వారా బస్సులో సీటు దొరకడం గగనమైపోయింది. బస్సులు తక్కువగా ఉండి సీటు దొరకక, ఆర్టీసీ సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఏరియాలో రైలుమార్గాలు లేనందున మినీ బస్సులు నడిపి ప్రయాణికులను ఆకర్షించాలి. ఉట్నూర్ నుంచి నాలుగు ప్రైవేట్ సంస్థలు ఏసీ బస్సులు నడుపుతుంటే ఆర్టీసీ మాత్రం నామమాత్రంగా బస్సులు నడుపుతున్నది. బస్టాండ్ నిర్వహణ అధ్వాన్నంగా ఉంది. అధికారులు స్పందించి బస్సుల సంఖ్యను పెంచాలి.
– భరత్ చౌహాన్, లంబాడా జేఏసీ రాష్ట్ర నాయకులు, ఉట్నూర్.
సీట్లు దొరుకుతలేవు..
నేను నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి ఉట్నూర్ పట్టణానికి అర్థోమిషన్ వ్యాపారం గురించి వస్తుంటా. కానీ.. బస్సులలో సీట్లు దొరకక చాలా ఇబ్బంది అవుతున్నది. అలాగే నేరుగా ఉట్నూర్‌కు బస్ లేదు. దీంతో గుడిహత్నూర్ వరకు వచ్చి అక్కడి నుంచి మళ్లీ ఉట్నూర్ ఆదిలాబాద్ నుంచి వచ్చే బస్సు కోసం వేచి చూడాల్సి వస్తున్నది. ఈ ప్రాంతానికి రావాలంటే భయపడాల్సి వస్తున్నది. పెరిగిన జనాభాకు అనుగుణంగా బస్సులు పెంచాలి.
– అవుజా వెంకటేశ్వర్లు, వ్యాపారి, నిర్మల్.రాష్ట్ర నాయకులు, ఉట్నూర్.