కౌటాల, సెప్టెంబర్ 28 : సిర్పూర్ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే ద క్కుతుందని, ఆయన హయాంలోనే ఇక్కడ అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పేర్కొన్నారు. ఇటీవల కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరి, మొదటిసారి కాగజ్‌నగర్‌కు వచ్చిన ఆయనకు అభిమానులు, కా ర్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రైల్వేస్టేషన్లో దిగగానే ఆయనకు పూల దండలు వేసి ఆహ్వానించారు.
జై కేసీఆర్.. జై జై కోనప్ప.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ నుంచి వినయ్ గార్డె న్ వరకు భారీ మోటర్ సైకిల్ ర్యాలీ తీశారు. ప్రధాన రహదారులన్నీ గులాబీమయమయ్యాయి. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కోనే రు రమాదేవి, మహిళా కార్యకర్తలు బతుకమ్మలతో ఆయనకు స్వాగతం పలికారు. కోనప్ప తెలంగాణ విగ్రహానికి పూలమాల వేశారు. పట్టణంలోని వినయ్ గార్డెన్లో కోనప్పకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పూల గుచ్చంతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కోవ లక్ష్మి మాట్లాడుతూ మళ్లీ నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయని, కేసీఆర్ పాలనలో కోనప్పతో కలిసి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. ఎమ్మెల్సీ దండే విఠల్ ప్రాణహిత ప్రాజెక్టు కట్టకుంటే ఎన్నికల్లో పోటీ చేయనని అంటున్నాడని, అసలు ప్రాణహిత ప్రాజెక్టును 2008లో ప్రారంభించింది కోనప్ప అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కోనప్ప మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో సిర్పూర్ నియోజకవర్గం ఎంతో ప్రగతి సాధించిందన్నారు.
కనిపిస్తున్న అభివృద్ధి కేసీఆర్ సార్ చేసింది కాదా అని కొనియాడారు. సిర్పూర్లో రెండు వర్గాలున్నాయని చెబుతున్నారని.. అసలు ఇక్కడ ఉన్నది ఒక్కటే వర్గమని.. అది కేసీఆర్ వర్గమని తెలిపారు. ఎమ్మెల్యే హరీశ్‌బాబు పోడు పట్టాలిస్తానని ఎన్నికలప్పుడు మాయ మాటలు చెప్పి రైతులను జైలు పాలు చేశాడన్నారు.
రైతులు యూరియా కోసం రాత్రింబవళ్లు ఇబ్బందులు పడుతుంటే వేల మెట్రిక్ టన్నులు తెస్తున్నామని ఉత్తుత్తి మాటలు చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. కేసీఆర్ పాలనలో రైతులు ఏనాడైనా యూరియా కోసం ఇబ్బందులు పడ్డారా అని ప్రశ్నించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు తన వెంట ఉన్న కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొమురం మాంతయ్య, నియోజక వర్గంలోని అన్ని మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు.