చెన్నూర్ టౌన్, ఏప్రిల్ 27 : చెన్నూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్-2లో లోన్ కోసం తనఖా పెట్టిన బంగారం తమకు ఎప్పుడిస్తరని అధికారులను బాధితులు ప్రశ్నించారు. ఈ మేరకు బాధితులు చెన్నూర్‌లోని ఎస్బీఐ బ్రాంచ్ 2లో సోమవారం ఆందోళన చేపట్టారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. తొమ్మిది నెలలుగా తమ బంగారం ఇవ్వకుండా బ్యాంకు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు మేనేజర్‌తో పాటు సంబంధిత అధికారులను ప్రశ్నించారు.
అనంతరం గోల్డ్‌లోన్ బాధితులు మాట్లాడారు. సెప్టెంబర్ 11, 2025న తాము రాతపూర్వకంగా అభ్యర్థన అందజేశామని, విచారణ కొనసాగుతున్నదని, విషయాలు తర్వాత వెల్లడిస్తామని బ్యాంకు మేనేజర్ సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నారు. దాదాపు తొమ్మిది నెలలు గడుస్తున్నా ఈ విషయంలో ఇప్పటి వరకూ ఏ విధమైన స్పష్టత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రికవరీ అయిన బంగారం బ్యాంకు కస్టడీకి ఇచ్చారని చెబుతున్నారు కానీ, దానికి అధికారికంగా రుజువు చూపడంలేదని తెలిపారు.
ఒకవేళ బంగారం మొత్తం రికవరీ అయ్యి, బ్యాంకు కస్టడీలోనే ఉన్నప్పుడు ఖాతాదారుల బంగారాన్ని వారికి ఎప్పుడు అందజేస్తారనే విషయాన్ని రాతపూర్వకంగా స్పష్టం చేయాలన్నారు. ఇప్పటి వరకూ ఇచ్చిన హామీలేవీ నెరవేరలేదని, దీంతో నమ్మకం కోల్పోయామని బాధితులు పేర్కొన్నారు. ఇకనైనా బంగారం ఎప్పుడిస్తరో స్పష్టత ఇవ్వాలని కోరారు.