అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. భారీఎత్తున బహిష్కరణ డ్రైవ్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. సరైన పత్రాలు లేని దాదాపు 18,000 మంది భారతీయులు కూడా ఈ బహిష్కరణను ఎదుర్కొంటున్న వారిలో ఉన్నట్టు సమాచారం. ట్రంప్ యంత్రాంగం బహిష్కరణల కోసం సైనిక విమానాలను ఉపయోగించడానికి సిద్ధమవుతున్నది. బహిష్కరణను ఎదుర్కొంటున్న భారతీయ అక్రమ వలసదారులకు చట్టపరమైన పరిష్కారాలు దొరికే అవకాశం చాలా పరిమితంగా ఉండవచ్చని, చాలామందికి అప్పీళ్లు, అభ్యర్థనలు లేదా న్యాయపరమైన ప్రాతినిధ్యం పొందే అవకాశం ఉండకపోవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. మరోవైపు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) బృందాలు దేశవ్యాప్తంగా దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. అమెరికాలోని నాలుగు నగరాలైన న్యూయార్క్, టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూజెర్సీల్లో ఈ బహిష్కరణ ప్రచారం అక్రమ వలసదారుల జీవితాలను పూర్తిగా మార్చేసింది. డిటెన్షన్ సెంటర్లలో నిర్బంధించిన ప్రజలపై జరిగిన దుర్మార్గానికి సంబంధించిన కథనాలు కూడా వెలుగులోకి వచ్చాయి.
సిద్ధమైన రెండు కొత్త డిటెన్షన్ సెంటర్లు
బహిష్కరించబడుతున్న వలసదారులను ఉంచడానికి ట్రంప్ యంత్రాంగం ఎల్పాసో, కాలిఫోర్నియాలో రెండు భారీ గిడ్డంగులను కొనుగోలు చేసింది. వీటికోసం సుమారు రూ. 16,500 కోట్లు ఖర్చు చేశారు. వీటిని డిటెన్షన్ సెంటర్లుగా మార్చి ఐసీఈకి అప్పగించారు. దాదాపు 12 వేలమంది వలసదారులను ఇక్కడ ఉంచారు. గతంలో విచారణలు ఉండేవని, ఇప్పుడు నేరుగా డిటెన్షన్ సెంటర్లకు పంపుతున్నారని లాయర్లు చెప్తున్నారు. న్యూయార్క్ ఇమ్మిగ్రేషన్ అటార్నీ గ్రెగ్ సిస్కిండ్ మాట్లాడుతూ.. “నేను 30 ఏండ్లుగా ఇమ్మిగ్రేషన్ కేసులపై పోరాడుతున్నాను. ఏ అక్రమ వలసదారునికైనా వారి కేసును వాదించుకునే అవకాశం లభిస్తుంది. కానీ ఇప్పుడు ఐసీఈ దాడుల తర్వాత, ప్రజలను నేరుగా డిటెన్షన్ సెంటర్లకు పంపుతున్నారు” అని అన్నారు.
2025లో 3,567 మంది భారతీయుల బహిష్కరణ
2025లో అమెరికా 3,567 మంది భారతీయ పౌరులను బహిష్కరించింది. ఈ సమాచారాన్ని భారతదేశ విదేశాంగ మంత్రిత్వశాఖ 2026 జూన్‌లో అందించింది. 2026 జూన్ నాటికి 1,076 మంది భారతీయులను బహిష్కరించినట్టు విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. 5 ఫిబ్రవరి 2025న అమెరికా మొదటిసారిగా 104 మంది భారతీయులను సైనిక విమానంలో అమృత్‌సర్‌కు పంపింది.
ఇల్లు వదిలి బయటకు రావాలంటేనే భయం
కాలింగ్ బెల్ మోగగానే నా గుండె వేగం పెరుగుతున్నది. మనసులోకి వచ్చే మొదటి ఆలోచన అది ఐసీఈ ఏమోనని. ఒకవేళ మేమిద్దరం దొరికిపోతే పిల్లలను ఎవరు చూసుకుంటారు?
– న్యూయార్క్‌లో నివసిస్తున్న భారతీయుడు
ప్రతి సందేశం భయాన్ని పెంచుతున్నది
గతంలో వాట్సాప్ గ్రూపులలో ఉద్యోగాలు, ఇండ్ల గురించి చర్చలు జరిగేవి. ఇప్పుడు కేవలం దాడులు, చెక్పాయింట్లు, వెళ్లకూడని ప్రాంతాల గురించిన హెచ్చరికలు మాత్రమే వస్తున్నాయి. మేం ఏడాదికాలంగా ఈ భయాందోళనల మధ్యే జీవిస్తున్నాం.
– కాలిఫోర్నియాకు చెందిన వ్యక్తి
డిటెన్షన్ సెంటర్లలో అమానుషం
గత నెల నా పొరుగింట్లో ఉండే వ్యక్తిని, అతడి సోదరులను ఐసీఈ పట్టుకున్నది. వారిని టెక్సాస్‌లోని ఒక డిటెన్షన్ సెంటర్లో ఉంచారు.అక్కడ జరుగుతున్న దుర్మార్గాలు, అమానుషాల గురించి కథనాలు వినబడుతున్నాయి. చిన్నచిన్న విషయాలకే అధికారులు వారిని చితకబాదుతున్నారు.
-న్యూజెర్సీకి చెందిన వ్యక్తి