– 250 మంది రైతులకు హైబ్రిడ్ విత్తనాల పంపిణీ
– కిసాన్ మేళాకు 300 మంది రైతులు హాజరు
రుద్రంపూర్, సెప్టెంబర్ 19 : వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై గిరిజన రైతులు దృష్టి సారించాలని శాస్త్రవేత్తలు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే), హైదరాబాద్‌లోని ఐ ఐ ఓ ఆర్–ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌సీడ్స్ రీసెర్చ్ సంయుక్త ఆధ్వర్యంలో ఐసీఏఆర్–భారత నూనెగింజల పరిశోధనా సంస్థ గిరిజన ఉప ప్రణాళికలో భాగంగా శనివారం కేవీకే ప్రాంగణంలో కిసాన్ మేళా, పొద్దుతిరుగుడు హైబ్రిడ్ విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి సుమారు 300 మంది రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం వరంగల్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డా.ఎం. శ్రీధర్ మాట్లాడుతూ… ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితులు, వాటి ప్రభావంతో వ్యవసాయ రంగంలో ఎదురయ్యే మార్పులను వివరించారు. అనుకూల పరిస్థితుల్లో పొద్దుతిరుగుడును ప్రత్యామ్నాయంగా, లాభదాయకమైన నూనెగింజ పంటగా సాగు చేయవచ్చని తెలిపారు. రైతులు పంటల వైవిధ్యీకరణపై దృష్టి సారించాలని సూచించారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి ,భారత నూనెగింజల పరిశోధనా సంస్థ ప్రిన్సిపల్ సైంటిస్ట్ (అగ్రానమీ), గిరిజన ఉప ప్రణాళిక ఇన్చార్జి డా.జి.సురేష్ మాట్లాడుతూ గిరిజన ఉప ప్రణాళిక ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. పొద్దుతిరుగుడు సాగులో కలుపు నివారణ, సమతుల్య పోషక యాజమాన్యం, నీటి యాజమాన్యం వంటి శాస్త్రీయ పద్ధతులను పాటిస్తే మెరుగైన దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.
భారత వ్యవసాయ పరిశోధనా మండలి–భారత నూనెగింజల పరిశోధనా సంస్థ ప్రిన్సిపల్ సైంటిస్ట్ (ఎక్స్టెన్షన్) డా. జి.డి. సతీష్ కుమార్ మాట్లాడుతూ.. నూనెగింజ పంటల్లో విలువ ఆధారిత ఉత్పత్తులు, మార్కెటింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రైతులు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ద్వారా సమష్టిగా ఉత్పత్తి, విలువ జోడింపు, మార్కెట్ అనుసంధానం చేపట్టడం ద్వారా మెరుగైన ధరలు పొందడంతో పాటు బేరసారాల సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని వివరించారు. ఐ సి ఏ ఆర్– ఐ ఐ ఓ ఆర్ సీనియర్ సైంటిస్ట్ (ప్లాంట్ బ్రీడింగ్) డా. హెచ్.పి. మీనా మాట్లాడుతూ.. వివిధ పొద్దుతిరుగుడు హైబ్రిడ్ రకాల లక్షణాలు, దిగుబడి సామర్థ్యం, వివిధ వ్యవసాయ వాతావరణ పరిస్థితులకు వాటి అనుకూలతను రైతులకు వివరించారు. జిల్లా వ్యవసాయ అధికారి బాబు రావు మాట్లాడుతూ జిల్లాలోని వ్యవసాయ పరిస్థితులను వివరించారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు అనువైన ప్రత్యామ్నాయ పంటలు, ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్, సుజాతనగర్ సీనియర్ మేనేజర్ జి. సునీల్ కుమార్ రైతులకు అందుబాటులో ఉన్న పంట రుణాలు, వ్యవసాయ రుణ సదుపాయాలు, ప్రభుత్వ మద్దతుతో అమలవుతున్న బ్యాంకింగ్ పథకాలపై అవగాహన కల్పించారు. రైతులు సంస్థాగత రుణ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డా. ఎస్. ఓం ప్రకాష్ (ఎంటమాలజీ), కేవీకే భద్రాద్రి కొత్తగూడెం సీనియర్ సైంటిస్ట్, హెడ్ డా. టి. భరత్, గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమం, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు పాల్గొన్నారు.
ఐ సి ఏ ఆర్–ఐ ఐ ఓ ఆర్ గిరిజన ఉప ప్రణాళికలో భాగంగా 250 మంది రైతులకు మెరుగైన పొద్దుతిరుగుడు హైబ్రిడ్ విత్తనాలను పంపిణీ చేశారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా పొద్దుతిరుగుడును ప్రత్యామ్నాయ నూనెగింజ పంటగా సాగు చేసేందుకు ఈ విత్తనాల పంపిణీ దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. కిసాన్ మేళా ద్వారా రైతులకు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, బ్యాంకింగ్ ప్రతినిధులు, విస్తరణ సిబ్బందితో నేరుగా మాట్లాడే అవకాశం లభించింది. పొద్దుతిరుగుడు సాగు, పంట యాజమాన్యం, అధిక దిగుబడి హైబ్రిడ్ రకాలు, విలువ జోడింపు, మార్కెటింగ్, సంస్థాగత రుణాలపై రైతులు అవగాహన పొందారు.

గిరిజన రైతులకు పొద్దుతిరుగుడు సాగుపై అవగాహన