భీంపూర్, సెప్టెంబర్ 9 : ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని భగవాన్పురకు వెళ్లే రోడ్డు బురదమయమై 108 అంబులెన్స్ వెళ్లలేని దుస్థితి నెలకున్నది. ఇదే గ్రామానికి చెందిన గర్భిణీ చిత్రం ప్రియాంక 108 అంబులెన్స్ రాలేక.. మార్గ మధ్యలోనే పాపకు జన్మనిచ్చింది. అయితే పాప మృతి చెందింది. ఈ విషయంపై కలెక్టర్ రాజర్షి షా విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు మంగళవారం భగవాన్పురకు వాగు దాటి ఆరు కిలోమీటర్ల వరకు ఆదిలాబాద్ డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, పీఆర్ ఈఈ శివరాం సహా వైద్య సిబ్బంది మోటార్ సైకిళ్లపై వెళ్లారు. అక్కడ గ్రామస్తులు, బాలింత తల్లి గెడాం శకుంతలాబాయి, ఆశా కార్యకర్త మెస్రం కళావతి, అంగన్వాడి కార్యకర్త గిరిజ, అర్లి వెల్నెస్ సిబ్బంది, పీహెచ్సీ సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ.. ఇందులో వైద్య శాఖ తప్పిదం లేదని స్పష్టం చేశారు. అయినా సరే బాలింత తదనంతర వైద్యం కోసం భీంపూర్ పీహెచ్సీలో ఉన్నారన్నారు. రోడ్డు బాగుంటే శిశువును రక్షించే వారమన్నారు. చికిత్స పొందుతున్న ప్రియాంకతో మాట్లాడారు. ఈ నివేదికను కలెక్టర్కు సమర్పిస్తామన్నారు. భగవాన్పూర రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని ఈఈ శివరాం తెలిపారు. వారితో వైద్యాధికారి నిఖిల్ రాజ్, ఏఈ మహేందర్, వైద్య సిబ్బంది జ్ఞానేశ్వర్, నిఖిల్రాజ్, విష్ణు, మాయావతి, నఫీజ, నాయకులు లస్మన్న, బక్కి కపిల్ యాదవ్, రహూఫ్, నితిన్, నవీన్ ఉన్నారు.