ఇచ్చోడ(సిరికొండ), జూన్ 12 : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులు, క్షేత్ర సహాయకులకు మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. ఇప్పటికే చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్న వారికి సకాలంలో వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. వీరు ఉపాధి పని జరిగే ప్రదేశాల్లో అక్రమాలకు తావివ్వకుండా పారదర్శకంగా పనులు నిర్వహించేందుకు నిరంతరం పర్యవేక్షణ చేస్తారు. కూలీలతో సమానంగా ఎండలో పనులు చేస్తున్నా సకాలంలో వేతనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పస్తులుండాల్సిన దుస్థితి నెలకున్నది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
18 ఏళ్ల నుంచి ఉపాధి హామీలో పని చేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కూడా లేదని క్షేత్ర సహాయకులు వాపోతున్నారు. సకాలంలో జిల్లా ఉన్నతాధికారులకు మండల ఏపీవో, సాంకేతిక సహాయకులు, క్షేత్ర సహాయకులు(ఫీల్డ్ అసిస్టెంట్)లు వివిధ హోదాల్లో పని చేస్తున్న సిబ్బంది మొరపెట్టుకున్నా ఫలితం లేదు. కాగా.. వేతనాలు నిలిచిన మాట వాస్తవమే.. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే డబ్బులు జమ అయ్యేలా చూస్తామని ఆదిలాబాద్ డీఆర్డీవో రవీందర్ రాథోడ్ తెలిపారు.
పంచాయతీలు : 472
జాబ్ కార్డులు : 1,01,294
కూలీలు : 2 లక్షలు
ఏపీవోలు : 14
క్షేత్ర సహాయకులు : 225
ఈసీఎస్ : 14
సీవోఎస్ : 34
ప్రతి నెల వేతనాలు రాక కుటుంబ పోషణ భారంగా మారింది. ఇంటి అవసరాలతోపాటు పిల్లల చదువులకు ఫీజులు కట్టలేని పరిస్థితులు ఉన్నాయి. సకాలంలో వేతనాలు అందజేస్తే బాగుంటుంది. మూడు నెలల నుంచి వేతనాలు రాకుంటే మేం ఎలా బతకాలి. ప్రభుత్వం సమస్యను పరిషరించాలి.
– సుభాష్, టీఏ, సిరికొండ మండలం
ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు వేస్తామని చెప్పి వేయడం లేదు. దీంతో ఉపాధి హామీ సహాయకులకు కుటుంబ పోషణ భారంగా మారుతుంది. ప్రభుత్వం ఉపాధి హామీ సిబ్బందికి పే స్కేల్ ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ.. అమలు చేయడం లేదు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి ఒకటో తారీఖున వేతనాలు వేస్తే బాగుంటుంది.
– పొల్లిపెళ్లి రాజు, టీఏ రాష్ట్ర అధ్యక్షుడు