ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. బాలుర కంటే అమ్మాయిలే అత్యంత ప్రతిభ కనబరిచి పైచేయిగా నిలిచారు. మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్‌తో కలిసి ఫలితాలను విడుదల చేసిన విషయం విదితమే. రాష్ట్రస్థాయిలో ఆసిఫాబాద్ జిల్లా విద్యార్థులు అత్యంత ప్రతిభ చూపి ప్రథమ సంవత్సరంలో మూడు, ద్వితీయ సంవత్సరంలో రెండో స్థానంలో నిలిచారు. నిర్మల్ విద్యార్థులు ఫస్టియర్‌లో 8, సెకండియర్‌లో 9.. ఆదిలాబాద్ స్టూడెంట్స్ 10,12.. మంచిర్యాల విద్యార్థులు 18,17వ స్థానాల్లో నిలిచారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాలల యాజమాన్యాలు, అధికార యంత్రాంగం సన్మానించింది. ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, విద్యార్థులు మిఠాయిలు పంచుకున్నారు.
– నిర్మల్ అర్బన్/ఆదిలాబాద్ టౌన్, మే 9
మంచిర్యాల అర్బన్, మే 9 : ఇంటర్ ఫలితాల్లో ఫస్ట్, సెకండియర్లలో బాలికలదే పై చేయిగా నిలిచింది. ఇక రాష్ట్రస్థాయిలో జిల్లా సెకండియర్‌లో 17వ స్థానం, ఫస్ట్ ఇయర్లో 18వ స్థానంలో నిలిచింది. ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్‌లో మంచిర్యాల జిల్లా రాష్ట్ర స్థాయిలో 18వ స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా 5,656 మంది పరీక్షలు రాయగా, 3,229 (57 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 2,616 మందికి 1,215 మంది ఉత్తీర్ణత సాధించగా(46 శాతం), బాలికలు 3,040 మందికి 2,014 మంది ఉత్తీర్ణత(66 శాతం) సాధించారు. అలాగే ఒకేషనల్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో మంచిర్యాల 19వ స్థానంలో నిలిచింది. మొత్తం 1,254 మంది విద్యార్థులకుగాను 666 మంది (53 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 709 బాలురకు 302 (42 శాతం) మంది, 545 మంది బాలికలకు 364(66 శాతం) మంది పాసయ్యారు.
సెకండియర్‌లో స్టేట్ 17వ స్థానం..
ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్‌లో మంచిర్యాల జిల్లా రాష్ట్ర స్థాయిలో 17వ స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా 5,911 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 3,803 మంది (64 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 2,612 మందికి 1,454 మంది ఉత్తీర్ణత సాధించగా(55 శాతం), బాలికలు 3,298 మందికి 2,349 మంది (71 శాతం) ఉత్తీర్ణత సాధించారు. అలాగే ఒకేషనల్ విభాగంలో రాష్ట్రస్థాయిలో మంచిర్యాల జిల్లా ఏడో స్థానంలో నిలిచింది. మొత్తం 1,138 విద్యార్థులకు 853 (74 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 622 బాలురకు 412 (66 శాతం) మంది, 516 మంది బాలికలకు 441(85 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే జిల్లాలో సెకండియర్ ప్రైవేటుగా 895 మంది పరీక్ష రాయగా, 223 మంది(24 శాతం), ఒకేషనల్‌లో 47 మందికి 28 (59 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.
ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్ టౌన్, మే 9 : ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. బాలికలదే పై చేయిగా నిలిచింది. మొదటి సంవత్సరంలో 61 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 10వ స్థానం, రెండో సంవత్సరంలో 68 శాతం ఉత్తీర్ణతతో 12వ స్థానంలో నిలిచిందని డీఐఈవో రవీందర్ కుమార్ తెలిపారు. ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల సందర్భంగా ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో జనరల్ కేటగిరీ కింద 5,459 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 2,358 మంది బాలురు, 3,132 మంది బాలికలు ఉన్నారు. మరోవైపు ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 5,808 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. ఇందులో 2,602 మంది బాలురు, 3,206 మంది బాలికలు ఉన్నారు. ఒకేషనల్ విషయానికి వస్తే.. మొదటి సంవత్సరంలో 690 మంది ఉత్తీర్ణులు కాగా, ద్వితీయ సంవత్సరంలో 662 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు.
అ‘ద్వితీయం’
ఆసిఫాబాద్, మే 9 : ఇంటర్ ఫలితాల్లో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్‌తో కలిసి ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో జనరల్‌లో 4 వేల మంది పరీక్షలు రాయగా, 3,249 మంది ఉత్తీర్ణత సాధించారు. 81 శాతంతో కుమ్రంభీం జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. గతేడాదికన్నా 4 శాతం ఉత్తీర్ణత పెరిగిందని డీఐఈవో శ్రీధర్‌సుమన్ తెలిపారు. ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ ఫలితాల్లో 697 మందికి 544 మంది ఉత్తీర్ణత (78 శాతంతో మూడో స్థానం) సాధించారు. ప్రథమ సంవత్సరం జనరల్ ఫలితాల్లో 4,371 మంది పరీక్షలు రాయగా, 3,227 మంది ఉత్తీర్ణత సాధించారు. 74 శాతంతో రాష్ట్రంలో జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ప్రథమ సంవత్సరం ఒకేషనల్ ఫలితాల్లో 766 మందికి 521 మంది ఉత్తీర్ణత (68 శాతంతో రాష్ట్రంలో రెండో స్థానం) సాధించారు. ఇక ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు సత్తా చాటారు. ఎంజేపీ కళాశాల విద్యార్థిని దీపిక బిస్వాస్ 985/1000 మారులు, ఆసిఫాబాద్ మోడల్ సూల్ విద్యార్థి యశస్వి 976/1000 మారులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల జైనూర్ విద్యార్థి పెందూర్ రాజు 973/1000 మారులు, కాగజ్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి పవన్‌కల్యాణ్ 969 /1000 మారులు సాధించారు. అత్యుత్తమ ఫలితాలు సాధించడంతో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు మాధ్యమిక విద్యాధికారి కార్యాలయంలో మిఠాయిలు పంపిణీ చేశారు. డీఐఈవోకు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలోనే 9వ స్థానం
నిర్మల్ అర్బన్, మే 9 : ఇంటర్మీడియట్ ఫలితాల్లో నిర్మల్ విద్యార్థులు సత్తా చాటారు. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 62 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే 8వ స్థానంలో నిర్మల్ జిల్లా నిలువగా.. ద్వితీయ సంవత్సరంలో 69 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే 9వ స్థానంలో నిలిచింది. నిర్మల్ పట్టణంలోని ఎస్ఆర్ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని డి.శ్రేష్ఠ ఎంపీసీ విభాగంలో 467/470 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బాలుర కంటే బాలికలే ఉత్తీర్ణత శాతం అధికంగా ఉంది. ప్రథమ సంవత్సరంలో బాలురు 50 శాతం, బాలికలు 73 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో బాలురు 58 శాతం, బాలికలు 78 శాతం ఉత్తీర్ణత సాధించి పైచేయిగా నిలిచారు. జిల్లా విద్యార్థులు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చడంతో జిల్లా నోడల్ అధికారి పరశురాం అభినందనలు తెలిపారు.
ప్రథమ సంవత్సరంలో..
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 5,816 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇందులో బాలురు 2,642 మంది కాగా.. 1,331 మంది (50 శాతం)., బాలికల్లో 3,124 మందికి 2,319 మంది పాస్ కాగా 73 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 5,816 మందికి 3,650 మంది ఉత్తీర్ణులై 62 శాతంతో రాష్ట్రంలోనే 8వ స్థానంలో నిలిచారు. ఒకేషనల్ విభాగంలో 1,233 మందికి 515 మంది ఉత్తీర్ణులు అయ్యారు. బాలురు 720 మందికి 217 మంది ఉత్తీర్ణులు కాగా.. బాలికలు 513 మందికి 298 మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో 31వ స్థానంలో నిలిచారు.
ద్వితీయ సంవత్సరంలో..
5,664 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇందులో బాలురు 2,669 మందికి 1,566 మంది(58 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 2,995 మందికి 2,344 మంది(78 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 5,664 మందికి 3,910 మంది ఉత్తీర్ణులై రాష్ట్రంలోనే 9వ స్థానంలో నిలబెట్టారు. ఒకేషనల్‌లో 1,362 మందికి 796 మంది(58 శాతం)ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లాను 30వ స్థానంలో నిలబెట్టారు. బాలురు 666 మందికి 323 మంది ఉత్తీర్ణులు కాగా.. బాలికల్లో 410 మందికి 316 మంది పాస్ అయ్యారు.
కేజీబీవీల్లో ..
నిర్మల్ జిల్లాలోని కేజీబీవీ విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో ప్రతిభను కనబర్చారు. ప్రథమ సంవత్సరంలో 631 మంది పరీక్షకు హాజరు కాగా 579 మంది ఉత్తీర్ణులయ్యారు. 92 శాతం ఉత్తీర్ణతను సాధించారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 518 మందికి 484 మంది(93.4 శాతం)తో ఉత్తీర్ణత సాధించారు. పలు కళాశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు డీఈవో రవీందర్‌రెడ్డి, సెక్టోరియల్ అధికారిణి శ్రీదేవీ తెలిపారు.
ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ప్రతిభ
నిర్మల్ అర్బన్, మే 9: నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో అత్యంత ప్రతిభ చూపారు. బైపీసీ గ్రూప్‌లో బీ హాసిని 987 మార్కులతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకును సాధించారు. వీరితో పాటు ప్రియాంక 981, సానియా తబస్సుం 945, ఎస్.సంధ్య 919,సాత్వికా సింగ్ 901, ఎంపీసీ విభాగంలో దివ్యసాయి 898, సీఈసీ విభాగంలో ఎస్. కీర్తన 878, ఎన్ వైష్ణవి 852 మార్కులు సాధించారు. ప్రతిభ చూపిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్ , అధ్యాపకులు అభినందించారు. అలాగే మహాత్మ జ్యోతి బాఫూలే రాచాపూర్ గురుకుల కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించారని ప్రిన్సిపాల్ సంతోష్ కుమార్ తెలిపారు. ఎంపీసీ విభాగంలో మనోజ్ 974, అమర్నాథ్ 960, గణేశ్ 956, నరేంద్ర 954, రవితేజ 946, సూర్యకాంత్ 940, దీక్షిత్ 938, సిద్దార్థ 909, బైపీసీ విభాగంలో లోకేష్ 939, హరిసింగ్ 936, లక్ష్మణ్ 929, ప్రథమ సంవత్సరం ఎంపీసీలో రాజశేఖర్ 449, సంజీవ్ 441, ఉదయ్ 407, వరున్ 404, బైపీసీలో వివేక్ 359, అనిల్ 349, మల్లేశ్ 336, సీఈసీలో గణేశ్ 404 మార్కులు సాధించినట్లు తెలిపారు.
కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
మంచిర్యాల అర్బన్, మే 9 : ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని కేజీబీవీ విద్యార్థులు ప్రతిభ కనబర్చినట్లు ఎస్వో స్వప్న మంగళవారం తెలిపారు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో 470 మార్కులకుగాను బీ ప్రియంక 448 మార్కులు, బైపీసీ ఫస్ట్ ఇయర్లో 440 మార్కులకుగాను ఎల్ స్వర్ణ మంజలి 409, ద్వితీయ సంవత్సరం ఎంపీసీ సెకండియర్‌లో 1000 మార్కులకుగాను నిషాసింగ్ 972 మార్కులు సాధించగా, బైపీసీలో 1000 మార్కులకుగాను గుర్లె అనిత 946 మార్కులు సాధించినట్లు తెలిపారు.
బీసీ గురుకులాల హవా
ఎదులాపురం,మే 9: ఇంటర్ ఫలితాల్లో మహాత్మా జ్యోతీ బాపూలే గురుకుల జూనియర్ కళాశాలల విద్యార్థులు 53 మంది రాష్ట్రస్థాయిలో సత్తా చాటారని ఉమ్మడి జిల్లా బీసీ గురుకులం ఆర్సీవో గోపీచంద్ రాథోడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి సంవత్సరంలో వివిధ గ్రూపుల్లో 757 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 599 ఉత్తీర్ణులయ్యారు. 79.12 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెండో సంవత్సరంలో 728 విద్యార్థులు పరీక్ష రాయగా, 86.6 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లా వ్యాప్తంగా ఆరు బాలికలు, ఆరు బాలుర జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను అధికారులు, అధ్యాపకులు అభినందించారు. ఇంటర్ రెండో సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా స్టేట్ ర్యాంకులు సాధించారు. ఇందులో నిర్మల్ ఎంజేపీ ఖానాపూర్ బాలికల ఎంపీసీలో 21, ఆదిలాబాద్ బాలికలు ఎంపీసీలో 16, ఖానాపూర్ బైపీసీ 8, సీఈసీ 8 మంది విద్యార్థులకు రాష్ట్ర స్థాయి ర్యాంకులు వచ్చాయి.
గిరిజన గురుకులాల్లో..
ఉట్నూర్, మే 9: రాష్ట్రవ్యాప్తంగా విడుదలైన ఇంటర్ పరీక్షా ఫలితాల్లో గిరిజన విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 13 కళాశాలల్లో ఇంటర్ రెండో సంవత్సర ఫలితాల్లో 95.27 శాతం , మొదటి సంవత్సరంలో 85.12 శాతం ఫలితాలు సాధించినట్లు గురుకులం ఆర్సీవో గంగాధర్ మంగళవారం పేర్కొన్నారు. ఇంటర్ రెండో సంవత్సరం సీఈసీలో ఉట్నూర్ కళాశాల వర్షిత 946, ఆసిఫాబాద్ విద్యార్థిని సుధారాణి 945 మార్కులతో రాష్ట్రస్థాయిలో 4, 5 ర్యాంకులు సాధించారు. రెండవ సంవత్సర ఫలితాల్లో ఇంద్రవెల్లి, తిర్యాణి, ఆసిఫాబాద్, జైనూర్ బాలికల జూనియర్ కళాశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇంటర్ రెండో సంవత్సరంలో 1117 మందికి గాను 1068 మంది ఉత్తీర్ణత సాధించగా, 49 మంది ఫెయిలయ్యారు. అలాగే ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 1279 మందికి గాను 1104 మంది ఉత్తీర్ణులు కాగా, 175 మంది ఫెయిలయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గురుకుల జూనియర్ కళాశాలల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన వర్షిత, సుధారాణి, కార్త్తీకను ఐటీడీఏ ఇన్చార్జి పీవో వరుణ్‌రెడ్డి, గురుకులం ఆర్సీవో అభినందించారు.
‘ప్రతిభ’ ప్రభంజనం
మంచిర్యాల అర్బన్, మే 9 : జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ మహేందర్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఎంపీసీ సెకండియర్‌లో 1000 మార్కులకుగాను సీహెచ్ జీవన 985, ఎస్కే ఇర్ఫాన్ 984, ఎస్ అక్షయ 983, ఎన్ శ్రీజ 982, జీ సాత్విక్ 980 మార్కులు సాధించగా, బైపీసీలో 1000 మార్కులకుగాను ఏ లక్ష్మీ ప్రసన్న 985, ఏ సాయి కీర్తన 984, జీ నయనశ్రీ 984 మార్కులు, సీఈసీలో సీహెచ్ పావణి 946 మార్కులు సాధించారన్నారు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో 470 మార్కులకుగాను ఎం తేజశ్విణి 465 మార్కులు, కే అశ్విత 463, పీ కావ్య 462, పీ శ్రీరాం కౌశిక్ 461, పటాన్ ఆస్మా 459, ఈ శ్రీహిత 455 మార్కులు సాధించగా, బైపీసీ ఫస్టియర్‌లో 440 మార్కులకుగాను ఎం అభిరాం 419, వై కళ్యాణి 418 మార్కులు, సీఈసీలో 500 మార్కులకుగాను ఎస్ సాహిత్య 463 మార్కులు సాధించారన్నారు. విద్యార్థులను కళాశాల అధ్యాపక బృందం అభినందించింది.
‘మిమ్స్’ సత్తా
మంచిర్యాల అర్బన్, మే 9 : మంచిర్యాల పట్టణంలోని మిమ్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో 470 మార్కులకుగాను పీ లిఖిత 465 మార్కులు, కే వైష్ణవి 465, కే లోహిత 465, పీ అక్షిత 464, జీ అరవింద 464, కే నిఖిత 464 మార్కులు సాధించగా, బైపీసీ ఫస్ట్ ఇయర్లో 440 మార్కులకుగాను డీ సాయి ప్రత్యూష 431, అతయా తుల్హజీ 431 మార్కులు సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ పీ శైలజ, కరస్పాండెంట్ టీ శ్రీనివాస రాజు మంగళ వారం తెలిపారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ సెకండియర్‌లో 1000 మార్కులకుగాను పీ రోహిత్ 987, ఎస్ వర్షిణి 984, జీ మంజుల 984, బీ సత్యతేజ 982 మార్కులు సాధించగా బైపీసీలో 1000 మార్కులకుగాను జీ కావ్య 989, టీ సాయి సంజన 984 మార్కులు, సీఈసీలో ఎం హేమలత 979 మార్కులు సాధించారని వెల్లడించారు. కళాశాల డైరెక్టర్స్ ఉపేందర్ రెడ్డి, పీ శ్రీధర్ రావు, విజయ్ కుమార్, అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు.